కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో కొందరు ఏఐ సహాయంలో తప్పుడు వీడియోలను సృష్టించింది వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని, తద్వారా ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.