అందరికీ అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్..
ఈ స్టేషన్లో ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది సన్ఇన్స్పెక్టర్లు (SIలు), 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.;
గ్రేటర్ పరిధిలో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అంతమొందిచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. ఏర్పాటైన తొలి రోజు నుంచే గ్రేటర్ పరిధిలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా ఈ హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది. అందుకోసం హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోలీస్ స్టేషన్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ బుద్ధభవన్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే దీనిని నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పోలీస్ స్టేషన్‌ను జీ-2 అంతస్తులతో నిర్మించారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ ఎసెచ్వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ స్టేషన్లో ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది సన్ఇన్స్పెక్టర్లు (SIలు), 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. పూర్తి స్థాయి బలగాలతో ఈ స్టేషన్ కార్యాచరణ ప్రారంభించనుంది. ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు వంటి వాటిపై జరిగిన ఆక్రమణల కేసులపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన పలు భూకబ్జా కేసులను, నూతనంగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశముంది. దీనివల్ల సంబంధిత వ్యవహారాలపై మరింత వేగంగా స్పందించేందుకు, నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
హైడ్రా అధికారికంగా సమన్వయ చర్యలు చేపట్టే స్థాయిలో ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్తో అనుసంధానమవడం వల్ల ఈ విభాగానికి మరింత అదనపు బలం లభించనుంది. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరిగా, హైడ్రా కూడా స్వంతంగా కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేపట్టడం వంటి అధికారం కలిగిన వ్యవస్థగా ఎదుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువుల దుస్థితి వంటి అంశాలు నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ సమస్యలను పట్టించి తగిన చర్యలు తీసుకోవడంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించనుంది. ఇది ప్రభుత్వ విధానాలకు సమర్థవంతమైన అమలు సాధనంగా నిలవనుంది.