ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్
తెలంగాణ అంతా ఒక ఊపు ఊపేసిన అంశం ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇందులో బడాబడా అధికారులు ఉన్నారు.;
తెలంగాణ అంతా ఒక ఊపు ఊపేసిన అంశం ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇందులో బడాబడా అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురు పోలీసుల అధికారులను రిమాండ్‌లో ఉంచడం జరిగింది. కాగా తాజాగా ఈ కేసులో ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు అయింది. ఆయన జైల్ నుంచి కూడా విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అధికారులకు కూడా బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వీరికి ఒక్కొక్కరికి రూ.లక్ష పూచికత్తుతో పాటు పాస్‌పోర్ట్‌లు అధికారులకు హ్యాండోవర్ చేయాలన్న షరతులు విధించింది న్యాయస్థానం. అంతేకాకుండా కేసు దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది. దాంతో పాటుగా సాక్షులను ప్రభావితం చేయడం వంటివి చేయకూడదని సూచించింది.
నిందితులంతా బయటకు వచ్చేస్తున్నారా!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో అత్యంత సంచలనంగా మారింది. ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది ఇంకా తేలలేదు. కానీ ట్యాపింగ్ అయితే జరిగిందని రూడీ అయింది. ఇందులో పలువురు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేటతెల్లమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేయడం జరిగిందని కొందరు అధికారులు తమ విచారణ చెప్పారు. కానీ ఆ ఉన్నతాధికారులు ఎందుకు అటువంటి ఆదేశాలు ఇచ్చారు అన్నది మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇందులో ఆనాటి పాలకు ప్రమేయం ఏమైనా ఉందా? అన్నది తెలుసుకోవడం కోసం దర్యాప్తు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈకేసులో అత్యంత కీలకంగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు.. అమెరికా వెళ్లిపోగా, మరో కీలక నిందితుడు శ్రవణ్ రావు కూడా పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పదుల సంఖ్యలో పోలీసులను రిమాండ్‌లో ఉంచారు. ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిన నిందితులను తిరిగి తీసుకొచ్చేందుకు దర్యాప్తు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. మొన్న తిరుపతన్న బెయిల్‌పై విడుదల కాగా ఇప్పుడు మరో ఇద్దరికి బెయిల్ మంజూరైంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులంతా బయటకు వచ్చేస్తున్నారని, ఇక ఈ కేసు కూడా కాలగర్భంలో కొట్టుకుపోతుందా? అన్న అనుమాణాలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి.
అయితే మరోవైపు బీఆర్ఎస్ పాలకుల ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ కేసులో నిందితులు బయటకు వచ్చేస్తుంటూ చూస్తూ ఊరుకుంటారా? అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులోని నిందితులను మళ్ళీ కటకటాల వెనక్కి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా వారికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు ప్రభావితం అవుతారని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదిస్తున్నప్పటికీ న్యాయస్థానం మాత్రం ఇప్పటికే చాలా రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని పేర్కొంటూ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తోంది. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపుతు తిరుగుతుందో చూడాలి.