హైడ్రా కమిషనర్‌‌కు నోటీసులు.. ఎలా కూలుస్తారని నిలదీసిన కోర్టు

హైడ్రాకు తొలిసారి బ్రేకులు పడ్డాయి. ఓ భవనం కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అసలు కారణం ఇదే..

Update: 2024-09-27 13:15 GMT

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా చూసినా ‘హైడ్రా’ అన్న మాటే వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో వాగులు, వంకలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై కన్నెర్ర చేస్తోంది. ఎక్కడిక్కడ అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని వారాంతాల్లో నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ దూడుకు చర్యలే ఇప్పుడు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. హైడ్రా కూల్చివేతలను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో హైడ్రా చర్యలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో హైకోర్టు నోటీసులు కీలకంగా మారాయి.

రంగనాథ్‌కు నోటీసులు..

హైడ్రా ఎక్కడికక్కడ ఆక్రమణలపై దృష్టి సారిస్తోంది. తాజాగా అమీన్‌పూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఓ భవనాన్ని కూల్చివేయడం ఇప్పుడు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను చిక్కుల్లో పడేసింది. ఆ భవనాన్ని ఎలా కూల్చారని హైకోర్టు ప్రశ్నించింది. సదరు భవనానికి సంబంధించిన కేసులో కోర్టు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణం. ‘‘కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారు. దీనిపై వివరణ ఇవ్వండి. అదే విధంగా వచ్చే సోమవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ హాజరుకావాలి. ఆ వాయిదాలో ఆ భవనాన్ని కూల్చడంపై వివరణ ఇవ్వాలి’’ అని హైకోర్టు తన నోటీసుల్లో పేర్కొంది.

మూసీ కూల్చివేతలు ఆలస్యమవుతాయా..


అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా హైడ్రా వేగంగా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నిర్వాసితులు అధికారులను అడ్డుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులపై దాడులకు దిగారు నిర్వాసితులు. సర్వేను పూర్తి చేయడానికి హైడ్రా అధికారులు చూపుతున్న తొందరపాటు.. రేపటి నుంచే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు ప్రారంభం కానున్నాయా అన్న అనుమాలను అధికం చేస్తున్నాయి. కాగా ఇప్పుడు హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ కావడంతో.. కొన్ని రోజుల పాటు హైడ్రా కూల్చివేతలకు బ్రేకులు పడతాయా? లేకుంటే అలానే కొనసాగుతాయా? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. ఇదిలా ఉంటే గురువారం రోజున సర్వే చేసిన అధికారులు దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. మరికొన్ని ఇళ్లను ఖాళీ చేయించడానికి కూడా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూల్చడానికి సన్నాహాలు చేస్తున్నారని గ్రహించి స్థానికులు.. అధికారులను అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.

సీఎంకు నిర్వాసితుల గోడు పట్టదా..

రాష్ట్రంలో ఒకవైపు తమ ఇళ్లను కూల్చొద్దంటూ మూసీ నిర్వాసితులు గగ్గొలుపెడుతున్నారు. ఓట్లేసి ఎన్నుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి తమకు తగిన శాస్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులు దాడులకు కూడా పాల్పడటంతో అధికారులు భయంతో పరుగులు పెట్టారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు పట్టదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. తమ ప్రభుత్వం మూసీ సుందరీకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, మూసీని ఎవరూ ఊహించని రీతిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. దీంతో రేవంత్ తీరుపై ప్రతిపక్షాలు సహా మూసీ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News