హెచ్‌సీయూలో పనులకు హైకోర్టు బ్రేకులు..

ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా? అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది.;

Update: 2025-04-02 12:51 GMT

కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) పరిధిలో ఉన్న 400 ఎకరాల భూముల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చలకు దారితీస్తోంది. ఈ భూములను వేలం వేయడాన్ని హెచ్‌సీయూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే అక్కడ చేపట్టిన పనుల్లో ఏమాత్రం వేగం తగ్గించడం లేదు ప్రభుత్వం. దీంతో వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు కలిసి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వారి పిల్‌ను స్వీకరించిన న్యాస్థానం బుధవారం.. హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై విచారణ జరిపింది. అనంతరం ఏప్రిల్ 3 వరకు సదరు భూముల్లో చేస్తున్న పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై విచారణను ఏప్రిల్ 3 మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

అయితే ఈ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై వాదనలు జరిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున ఎల్ రవిశంకర్ వాదనలు వినిపించారు. ‘‘గత ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే ముందుగా నిపుణుల కమిటీ వేయాలి. వన్య ప్రాణులు ఉన్న యోట భూములను చదును చేయాలంటే నిపుణుల కమిటీ అక్కడ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లేక్‌లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి’’ అని కోర్టుకు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. “2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఈ భూములను వినియోగించలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదు. దీనికి ఆనుకొని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్లున్నాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదు" అని ఏజీ వాదనలు వినిపించారు.

అంతేకాకుండా కంచ గచ్చిబౌలి భూములు.. అటవీ భూములని ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదని చెప్పారు. ఈ భూమి పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలమేనని, అటవీ భూమి కాదని పునరుద్ఘాటించారు. నిజాం కాలం నుంచి ఈ భూమి.. బీడు భూమిగానే ఉందని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా? అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. సర్వే నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు.

Tags:    

Similar News