తెలంగాణలో రగులుతున్న ప్రతీకార రాజకీయాలు, కారణం ఏమిటి?

ప్రతీకార రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Update: 2024-04-11 05:21 GMT
Source: Twitter

(గోరంట్ల పెద్ద వేంకటేశ్వర్లు)

ప్రతీకార రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతిపక్ష నాయకుడు బీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఉపన్యాసాలు విన్నా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగాలు విన్నా, అదే విధంగా బీజేపీ నేతలు చెప్పేది విన్నా, ఒకరి మీద ఒకరు కసి తీర్చుకోవాలన్న అక్కసు మాత్రమే కనబడుతోంది. కేసీఆర్ వేదిక ఎక్కితే చాలు విపరీతంగా తిట్ల వర్షం కురిపిస్తున్నారు. దానికి రేవంత్ కూడా అదే భాషలో సమాధానమిస్తున్నారు. బిజెపి నేతలు కూడా రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడం కంటే, కేసీఆర్‌ను దూషించడం, మూన్నెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనడం తప్ప ఆసక్తికరమయిన రాజకీయ చర్చ జరగడం లేదు. ఒకరి మీద ఒకరికి పగ. ప్రతీకారేచ్ఛ. ఎప్పుడూ అవతలి వాడిని తొక్కేసి గద్దెనెక్కుదామా అన్న ఆతృత తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది.

రండా, వెంట్రుక పీకలేవు, సన్నాసి, దద్దమ్మ, దున్నపోతు, కంచర గాడిద వంటి పదాలు వాడటం నిత్యం కనిపిస్తుంది. ఇది మనిషిలో రగులుతున్న పగ తప్ప రాష్ట్ర బాగోగుల మీద కమిట్‌మెంట్ చూపించదు.. ఆధిపత్యం చూపిస్తుందని ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి అన్నారు. ఫ్రొఫెసర్ ఉస్మానియా యూనివర్శిటీ జాగ్రఫీ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన బీసీ సామాజిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఈ పదాల ప్రయోగం దొరతనాన్ని చూపుతుందని ప్రొఫెసర్ సింహాద్రి వ్యాఖ్యానించారు. ఇలా తిట్లు మానేసి విద్యార్థులు, నిరుద్యోగులు, స్త్రీల, బీసీ, ఎస్సీ ఎస్‌టీల విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవం గురించి చర్చించరా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడ్డాక మొదలైన రాజకీయ పతనం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చింది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అది భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అయింది. బీఆర్‌ఎస్‌ తప్ప మరోపార్టీ అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలను ముప్పుతిప్పలు పెట్టారు. రకరకాల కేసులు బనాయించి మూడు చెరువుల నీరు తాగించారు. దీంతో దశాబ్దకాలంగా కాంగ్రెస్‌ పార్టీ అతలాకుతలం అయ్యింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితమైనట్లేనని అందరూ భావించారు. అయితే కేసీఆర్‌ ఊహలన్నీ తలకిందులయ్యాయి. పడిలేచిన కెరటంలా కాంగ్రెస్‌ తెరపైకి వచ్చింది. అనూహ్యంగా పుంజుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకుంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు, ఆ పార్టీ ముఖ్యనేతలకు చుక్కలు చూపించే పనికి ఉపక్రమించింది. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొన్న రేవంత్‌రెడ్డి తన రాజకీయ మార్కును రుచి చూపిస్తున్నారు.

అప్పుడు జూలు విదిల్చిన కేసీఆర్‌..

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ బీటలు వారేవిధంగా చర్యలు చేపట్టడం ప్రారంభించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అనే భావం ప్రజల్లో లేకుండా చేసేందుకు కేసీఆర్‌ పూనుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లో ఒక్క నాయకుడు కూడా మిగలకుండా చేసేందుకు ముఖ్యనేతలందరినీ తన గూటికి వచ్చేలా రకరకాల వ్యూహాలు రచిస్తూ వారిని దారికి తెచ్చుకున్నారు. ఇందులో సఫలీకృతుడైన కేసీఆర్‌ తన పంజాను కాస్త టీడీపీపైనా విసిరాడు. తెలంగాణలో టీడీపీని నామరూపాలు లేకుండా కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు పెద్ద పన్నాగం వేశారు. ఇందులో భాగంగానే అప్పట్లో టీడీపీలో దూకుడుగా ఉన్న రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు.

సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ప్రతిక్షణం టీడీపీ నేతలపై నిఘా ఉంచారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కొందరు ఎమ్మెల్యేలను నాటి టీడీపీ ఎమ్మెల్యే అనుమల రేవంత్‌రెడ్డి ప్రలోభాలకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్‌ తన యంత్రాంగంతో పక్కాగా స్టింగ్‌ ఆపరేషన్‌ చేయించాడు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు నాటి టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య రూ. 50 లక్షలు ఇస్తూ కేసీఆర్‌ ఉచ్చులో పడ్డారు. ఈ వ్యవహారం వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దీనిపై పెద్ద రాద్ధాంతం జరిగింది.

అప్పట్లో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలపై ఓటుకు నోటు కేసును కేసీఆర్‌ నమోదు చేయించారు. ప్రతిగా టీడీపీ నేతలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పెట్టారు. ఈ వ్యవహారం అంతా రేవంత్‌రెడ్డి కడుపులో పెట్టుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరాడు. చిన్నగా పార్టీలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ఏకంగా పీసీసీ పగ్గాలు చేపట్టారు. అదే సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ మరింత దూకుడు పెంచి రేవంత్‌పై భూ కబ్జాలు, తదితర కేసులు నమోదు చేయించి ఉక్కిరిబిక్కిరి చేయించారు. ఇవన్నీ కడుపులో పెట్టుకున్న రేవంత్‌రెడ్డి అదునుకోసం వేచి చూశాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. అటు కేసీఆర్‌ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్‌ సానుకూలత రేవంత్‌రెడ్డికి కలిసొచ్చాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

పగతో రెచ్చిపోతున్న రేవంత్‌రెడ్డి

అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం ఎ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలుత రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు స్కెచ్‌ సిద్ధం చేశారు. బీఆర్‌ఎస్‌ను చిన్నగా భూ స్థాపితం చేసే దిశగా అడుగులు వేయడం స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర తీశారు. ఇప్పటి వరకు స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ విజయలక్ష్మితో పాటు కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో గూటికి వచ్చే విధంగా యాక్షన్‌ ప్లాన్‌ సక్సెస్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె కేశ్వరావు తన కూతురుతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా దాదాపు 26 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటిచండం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసారు. వీరు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కథ

ఎన్నికల సమయంలో నాటి సీఎం కేసీఆర్‌ తన అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు తెరతీశారు. అందులో ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారు. ఆ వ్యవహారం ఎంతవకు పోయిందంటే తన భార్యతో మాట్లాడే మాటలు కూడా కేసీఆర్‌ విన్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పోలీసు అధికారుల్లో వణుకు మొదలైంది. ఎక్కడైతే ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించిన కంప్యూటర్‌ కేంద్రం ఉందో.. ఆ కేంద్రం వద్దకు సంబంధిత పోలీస్‌ అధికారి వెళ్లి అక్కడ ఉన్న కంప్యూటర్‌ పరికరాలను తొలగించి ఊరి బయటకు తీసుకెళ్లి వాటిని ధ్వంసం చేసి పడేశారు.

అధికారం చేపట్టగానే రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అత్యుత్సాహం చూపించిన పోలీసు అధికారులపై కొరడా ఝుళిపించి కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండయ్యారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌తో పాటు మాజీ అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను ఇది వరకే అరెస్టు చేశారు. ఇంకా మరి కొందరిపై విచారణ జరుగుతోంది. కాంగ్రెస్‌ వాళ్లను ఏ విధంగా అయితే వేధించారో, కొంత మంది సినిమా నటుల ఫోన్లను సైతం ట్యాపింగ్‌ చేసి కేటీఆర్‌ ఎన్నో దుర్మార్గాలు చేసినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలోను నిజాలను వెలికి తీస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్‌ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు చోటు చేసుకున్నాయని, భారీగా అవినీతికి పాల్పడ్డారని, కట్టడాలు నెర్రెలు బారాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడమే కాకుండా వాటిని నిరూపించే ప్రయత్నంలో భాగంగా క్షేత్ర స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం మెటీరియల్‌ను వాడారనే స్పష్టత వచ్చింది. ఇందులో కొంత మంది అధికారులు కూడా అరెస్టు అయ్యే చాన్స్‌ ఉంది. ఈ వ్యవహారం కూడా మాజీ సీఎం కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలోనూ అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన కొత్తల్లో విద్యత్‌ అధికారులు కృత్రిమ కొరత సృష్టించి కాంగ్రెస్‌ పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు అధికారులు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించారు. వెంటనే విద్యుత్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయంలో ఒక ఉన్నతాధికారి మీటింగ్‌కు రాకుండా రాజీనామా పంపించారు. రాజీమానామాను తర్వాత ఆమోదిద్దామని, ఆయన మీటింగ్‌కు రావాలని ఆదేశించినా మీటింగ్‌కు ఆ అధికారి రాలేదు. దీంతో కొందరు అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. నేతల మధ్య పగలు ప్రతీకారాలతో, కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News