మహా రాజకీయాల్లో తెలుగోడి మార్క్.. తెలుగు నేతల హామీల వర్షం..

దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాముఖ్యత పెరిగింది. జాతీయ పార్టీలు సైతం తెలుగువారిని ఆకట్టుకోవడమే లక్ష్యంలా అడుగులు వేస్తున్నాయి.

Update: 2024-11-19 07:53 GMT

దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాముఖ్యత పెరిగింది. జాతీయ పార్టీలు సైతం తెలుగువారిని ఆకట్టుకోవడమే లక్ష్యంలా అడుగులు వేస్తున్నాయి. తెలుగేతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగు వారే జాతీయ పార్టీ టార్గెట్‌ లిస్ట్‌లో ఉంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఝార్ఖండ్, మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం తెలుగు నేతలను రంగంలోకి దించింది కాంగ్రెస్. ఝార్ఖండ్ సహా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. పలు ఇతర ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన కోమటి రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు కీలక నేతలు పాల్గొని కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి బంధన్ కూటమిని గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయా రాష్ట్రాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మహారాష్ట్రలోని తెలుగు వారిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా వీరు హామీలను ఇచ్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేశామని, కాంగ్రెస్ గెలిస్తే మహారాష్ట్ర కూడా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టడం ఖాయమని వారు పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి సోమవారం ముగిసే వరకు కూడా తెలుగు నేతలు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తెలుగు నాయకులందరూ కలిసికట్టుగా కదిలారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రజలపై హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా తెలుగు వారికి అండగా ఉంటామని, వారి ఇబ్బందులను తొలగిస్తామంటూ వారి ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీలిచ్చారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి అభ్యర్థికి ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్లేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ఇక్కడ మహా వికాస్ అఘాడి అభ్యర్థి.. హైదరాబాద్‌లో నేను. ఇలా ఒకే ఓటుకు ఇద్దరు సేవకులమంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అదే విధంగా మరోవైపు కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దని బీజేపీ తరపున కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ప్రజలతో పాటు ప్రతి మహారాష్ట్ర పౌరుడికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారాయన.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సహా పలువురు మంత్రులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో హుజారుగా పాల్గొన్నారు. రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొని తమ ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు. అదే విధంగా కిషన్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సహా పలువురు ఇతర నాయకులు బీజేపీ తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారని ప్రకటించినప్పటికీ ఆయన సోదరుడు మరణించడంతో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తిరిగి రావాల్సి వచ్చింది.

తెలుగు ప్రజల టార్గెట్‌గా సాగిన ఈ ఎన్నికల ప్రచారం అనేక సందేహాలకు నెలవుగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరుపున కీలక నేతలు జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ప్రజలపై హామీల వర్షం కురిపించారు. కానీ ఈ హామీలు ఈసారైనా అమలవుతాయా.. లేకుంటే ఎప్పటిలానే ఈసారి కూడా ఇవి పేపర్లకే పరిమితమవుతాయా అనేది కీలకంగా మరింది. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయా? అనే విషయంపై తెలుగు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కాగా ఇరు పార్టీల నేతలు కూడా తెలుగువారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇవ్వడంతో.. ఈసారి తమ సమస్యలు తగ్గుతాయని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. మరి చూడాలి.. మహారాష్ట్రలో తెలుగు ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు రానున్న కాలంలో ఏమైనా పరిష్కారమవుతాయేమో.

Tags:    

Similar News