తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు,వణికించనున్న చలిగాలులు

తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రత తగ్గింది. మంగళవారం మెదక్ పట్టణంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

Update: 2024-11-12 09:58 GMT

శీతాకాలంలో ఉత్తరాది ప్రాంతం ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల ప్రభావం వల్ల తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్,హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ శీతాకాలంలో మెదక్ లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రత తగ్గింది.


నవంబరు నెలాఖరు నుంచి వణికించనున్న చలిపులి
నవంబరు నెలాఖరు నుంచి చలిపులి తెలంగాణను వణికించనుంది. ఉత్తరాది నుంచి వీచే చలి గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో నవంబరు నెలాఖరు నుంచి చలి ప్రభావం పెరుగుతుందని భారత వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ధర్మరాజు వెల్లడించారు. ఈ శీతాకాలంలో చలి ప్రభావం జనవరి నాటికి పెరిగి ఫిబ్రవరి నెలతో తగ్గుముఖం పడుతుందని ధర్మరాజు అంచనా వేశారు. వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా ప్రభావం ఉండదని ఆయన చెప్పారు.

పలు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం
చెరువులు, కుంటలు, జలాశయాలు, పచ్చదనం ఉన్న చోట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం సీనియర్ సైంటిస్టు ఎ ధర్మరాజు తెలిపారు.పొగమంచు ప్రభావం వల్ల తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గింది. ఈ శీతాకాలంలో హైరడాబాద్ శివారు ప్రాంతమైన పటాన్ చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 15.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేర తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో 15 డిగ్రీల సెల్సియస్ కు తగ్గింది.సూర్యాపేటలో అత్యధికంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 25.5 డిగ్రీల సెల్సియస్ కాగా అత్యల్ప ఉష్ణోగ్రత మెదక్ లో 14.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

శీతాకాంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
శీతాకాలం వేగంగా సమీపిస్తున్న సూచనగా హైదరాబాద్‌లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 18డిగ్రీలు, 32డిగ్రీల సెల్సియస్ ల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.సోమవారం పటాన్‌చెరులో 15.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యల్పంగా 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మెదక్ జిల్లాలో నమోదైందని ఐఎండీ తెలిపింది.ఆదిలాబాద్‌లో 16.2 డిగ్రీల సెల్సియస్‌, హకీంపేట, దుండిగల్‌లో 17.9 డిగ్రీల సెల్సియస్‌, హన్మకొండలో 18 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, నల్గొండ లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి.రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రం పాక్షికంగా మేఘావృతమైన వాతావరణంతో పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలోని దక్షిణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చలి ప్రభావం పెరుగుతున్నందున ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ రామమోహన్ రావు సూచించారు.

చలి ప్రభావంతో కూరగాయలకు మేలు
చలి ప్రభావం వల్ల కొన్ని కూరగాయల పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కాలీ ఫ్లవర్, టమోటా, ఆకుకూరలు బాగా పెరుగి దిగుబడి పెరుగుతుందని శర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చలి ప్రభావం వల్ల పంటలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు.


Tags:    

Similar News