ముగిసిన టీఎస్పీఎస్సీ చీకటి అధ్యాయం, తరువాత ప్రభుత్వం ఏం చేయబోతోంది?

అంతపెద్ద పదవిలో ఉండి.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్ మా చేతుల్లో ఉందనే ధ్యాసే లేకుండా చూసిచూడనట్లు వదిలేశారు.

Update: 2024-01-10 13:10 GMT

ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వమంది ఇచ్చాం.. మాకే సంబంధం అనుకున్నారో ఏమో కానీ, మాపనుల వల్ల ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారో ఆలోచించలేకపోయారు. గోస పెట్టి.. ఏడిపించి.. బతికుండగానే ప్రాణం లేని జీవచ్ఛవాలు చేసిన టీఎస్పీబోర్డు చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళి సై ఆమోదించారు. ఇక కొత్త కమిషన్ సభ్యుల నియమాకాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయడానికి ఇక అవకాశం లభించింది.

లక్షలాది నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన టీస్పీఎస్సీ చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రాజీనామాల విషయంలో ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రావడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పేపర్ లీకేజ్ సహ ఇతర ఆరోపణపై విచారణ చేయాలని మాత్రం ప్రభుత్వానికి సూచించారు. నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.

వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చిన..

2022 నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతితో టీఎస్పీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. 2016-17 లో వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ తరువాత మళ్లీ 2022లోనే గ్రూప్ 1, వచ్చింది. తరువాత గ్రూప్-2, 3,4 ఇతర బోర్డులు సైతం ఉద్యోగ నియమాకాల కోసం సంసిద్దం వ్యక్తం చేయడంతో నిరుద్యోగుల ముఖాల్లో ఆనందం తొంగిచూసింది.

అయితే ఆనందం క్రమంగా ఆవిరి కావడం ప్రారంభం అయింది. మొదట గ్రూప్ వన్ పరీక్ష తేదీలను మార్చడం ప్రారంభించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరువాత పేపర్ లీక్ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా 14 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని తెలియడంతో పరీక్షలు రాసి ఉద్యోగం వస్తుందనే ఆశపడుతున్న వారి కళ్లలో నీళ్లు తెప్పించారు. పది సంవత్సరాల తరువాత వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ మొదట పేపర్ లీక్ తో రద్దు కాగా, రెండో సారి నిబంధనలు పాటించలేదనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది.

2022 చివరలో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. పరీక్ష తేదీలను మొదట్లో ప్రకటించకపోయినా తరువాత ఆగష్టులో నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే కొందరు నిరుద్యోగులు ఆందోళనలు చేయడంతో పరీక్ష తేదీలను తిరిగి నవంబర్ కు వాయిదా వేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోలీసులు పరీక్షల నిర్వహణకు తగినంత భద్రత కల్పించమలేమని చెప్పడంతో తిరిగి జనవరికి వాయిదా వేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదో అసమర్ధ బోర్డు అంటూ వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. యూపీఎస్సీ ఒకసారి పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని నిర్వహిస్తుందని, అయితే టీఎస్పీఎస్సీ మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోందని ఆందోళన చేశారు. వీటికి ప్రతిపక్షాలు సైతం జతకలవడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవేవీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఎవరూ దానిని విశ్వసించినట్లు కనిపించలేదు.

మంచి నిర్ణయం తీసుకున్నారు- నిరుద్యోగులు



 


"మాకు టీఎస్పీఎస్సీ పై నమ్మకం లేదు. ఉన్న పరీక్ష పేపర్లను ఇప్పటికే అమ్ముకున్నారేమో, గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించి మంచి పని చేశారు" అని భువనగిరి జిల్లాకు చెందిన జ్యోతి(పేరు మార్చాం) ఫెడరల్ తో చెప్పారు. "ఎన్నో సంవత్సరాల మా కష్టాన్ని ఎందుకు అక్కరకు రాకుండా చేశారు. ఎన్నో కష్టాలు పడి సంపాదించి దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయింది. ప్రతిఫలం దక్కలేదు. ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాం" అని తన ఆవేదనను పంచుకున్నారు.

నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సంగి తిరుపతి ఫెడరల్ తో మాట్లాడుతూ " టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని మేం చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది ఇప్పుడు నెరవేరింది. ఇకముందు వచ్చే నోటిఫికేషన్ల కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కమిషన్ లో పనిచేయడానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలి. పేపర్ లీక్ కు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. అన్యాయం జరిగిన నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చాలామంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగదేమో అనే అనుమానం ఉండేది. కమిషన్ సభ్యులను తొలగించే ప్రక్రియ కష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ చాలా సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఈ సందేహం కలిగింది. దాని బదులు కమిషన్ సభ్యులు వారంతట వారే రాజీనామా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే రాజీనామా చేసిన తరువాత వాటిని ఆమోదిస్తారా లేరా కూడా సంశయం కలిగింది. అయితే ఎట్టకేలకు గవర్నర్ వాటిని ఆమోదించారు.

ప్రభుత్వం తదుపరి స్టెప్ ఏంటీ?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలువురి పేర్లను టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులుగా నియమించడానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్పీలో ఇంతకుముందు ఉన్న పెండింగ్ ఫలితాలను వెంటనే విడుదల చేయాల్సి ఉంది. వీటిలో కొన్నింటికి న్యాయవివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల క్రితం పరీక్ష రాసి అపాయింట్మెంట్ లెటర్లు కోసం వేచి చూస్తున్న పీఈటీ అభ్యర్థుల వంటి వారు ఉన్నారు.

తరువాత విడుదల చేసిన గ్రూప్స్ నోటిఫికేషన్ పరిస్థితి చూడాల్సి ఉంటుంది. గ్రూప్ 1 కి తిరిగి ఇంటర్వ్యూ నిర్వహించేలా రీ నోటిఫికేషన్ ఇస్తారనే ప్రచారంతో పాటు, గ్రూప్ 2, 3 కి పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ నిరుద్యోగులు చేస్తున్నారు. చాలా జోన్లలో కనీసం పది పోస్టులు కూడా లేవని, కనీసం వంద పోస్టులు ఒక్కో జోన్ కు ఉండేలా చూడాలని వారు అభ్యర్థిస్తున్నారు. వీటన్నింటిని కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News