కలకత్తా నుండి వెంటాడి హైదరాబాదులో 17 మందిని కాటేసిన మృత్యువు

రాత్రంతా వివాహ వేడుకల్లో పాల్గొని బాగా అలసిపోవటంతో ఏసీ వేసుకుని అందరు పడుకున్నారు;

Update: 2025-05-18 12:08 GMT
Gulzar fire accident

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌజ్ ఏరియాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఒక్కోటి బయటకు వస్తోంది. అన్నింటికన్నా బాధాకరం ఏమిటంటే ఒకే కుటుంబంతో పాటు దగ్గర బంధువులు 17 మందిని మృత్యువు ఒకేసారి కాటేయటం. మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)చెప్పిన వివరాల ప్రకారం మృతులంతా పశ్చిమబెంగాల్ కు చెందిన వారు. బెంగాల్ కు చెందిన వ్యాపారుల కుటుంబం దాదాపు వందేళ్ళ క్రితమే హైదరాబాదులోని ఓల్డ్ సిటి గుల్జార్ హౌజ్(Gulzar House Area) ఏరియాలో స్ధిరపడింది. ఈకుటుంబం ముత్యాల నగల వ్యాపారం చేస్తోంది. హైదరాబాదు(Hyderabad)లోని బంధువుల వివాహం ఉండటం+పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చిన కారణంగా నాలుగు కుటుంబాలకు చెందిన వ్యాపారి బంధువులు కలకత్తా నుండి హైదరాబాద్ చేరుకున్నారు.

నాలుగుకుటుంబాలకు చెందిన వాళ్ళంతా కలిసి శనివారం మ్యారేజీకి హాజరయ్యారు. వివాహ వేడుకల్లో పాల్గొని, వివాహం అయిపోయిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఆదివారం తెల్లవారుజామున తిరిగి బంధువులందరు గుల్జార్ హౌజ్ లోని వ్యాపారి ఇంటికి చేరుకున్నారు. రాత్రంతా వివాహ వేడుకల్లో పాల్గొని బాగా అలసిపోవటంతో ఏసీ వేసుకుని అందరు పడుకున్నారు. పడుకున్న కొద్దిసేపటికే అందరు గాఢనిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి సుమారు 5.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎక్కడో ఏదో కాలుతోందన్న విషయం మొదట పసిగట్టింది బంధువుల్లో ఒకడైన పంకజ్. ఎలాగంటే ఊపిరిపీల్చటం కష్టమవటంతో పంకజ్(36)కు మెలకువ వచ్చేసింది. కష్టంమ్మీద నిద్రలో నుండి లేచి చూస్తే చుట్టూ మంటలు, పొగలు కమ్ముకునేసింది. దాంతో ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి తన మిత్రుడు ఇక్బాల్ కు ఫోన్ చేసి అగ్నిప్రమాదం జరిగిందని వెంటనే ఫైర్ ఫైటర్స్, అంబులెన్సుకు ఫోన్ చేయమని చెప్పాడు.

వెంటనే మిత్రుడు ఇక్బాల్ స్పందించి అంబులెన్సుకు, ఫైర్ ఫైటర్స్ కు ఫోన్ చేసి వ్యాపారి ఇంటికి చేరుకునేటప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన ఉన్న రెండస్తులు మంటలు వ్యాపించటం గమనించాడు. ఇదంతా అయ్యేటప్పటికి ఉదయం 6.15 అయ్యింది. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న పంకజ్ ఇంట్లో తలుపులు తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ లోపలకు వెళ్ళాడు. బయటకు వచ్చిన పంకజ్ మళ్ళీ ఎందుకు లోపలకు వెళ్ళాడంటే మంటల్లో చిక్కుకుపోయినభార్య, పిల్లలను కాపాడుకోవాలని. అయితే అప్పటికే కొంతకాలిపోయిన పంకజ్ లోపలకు వెళ్ళి మళ్ళీ బయటకు రాలేదు. భవనంలోకి మంటలు పూర్తిగా వ్యాపించిన సమయంలో కొందరు రెండో అంతస్తుకు చేరుకుని అక్కడ తలుపులు తీసుకుని పక్కనే ఉన్న ఇళ్ళలోకి దూకేయటంతో గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మిగిలిన వాళ్ళు గాఢనిద్రలో నుండి శాశ్వతనిద్రలోకి వెళ్ళిపోయారు.

తాజా సమాచారం ప్రకారం పై రెండు అంతస్తుల్లో సుమారు 53 ఉంటున్నారు. వీరిలో మంటల్లో చిక్కుకుని 17 మంది చనిపోయారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు కాగా మిగిలిన వారు 11 మంది. హైదరాబాదులో బంధువులింట్లో వివాహం, పిల్లలకు వేసవి సెలవులు కలసిరావటంతో హైదరాబాదులోని బంధువుల ఇంటికి చేరుకోవటం అంతా విధిలిఖితం కాకపోతే ఇంకేమిటి ? కలకత్తాలో ఉంటున్న వారిని మృత్యువు వెంటాడి హైదరాబాదులో కాటువేయటం ఆశ్చర్యంగా ఉంది. గుల్జార్ హౌజ్ ఏరియాలోని వ్యాపారి, బంధువుల కుటుంబాల వాళ్ళందరూ బెంగాల్ వాళ్ళే కావటం చాలా విషాధమనే చెప్పాలి.

Tags:    

Similar News