ట్యాపింగ్ కేసులో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యాయా ?

కేసు దర్యాప్తును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.;

Update: 2025-07-22 12:45 GMT
BRS leader RS Praveen Kumar

టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగటంలేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అందుకనే కేసు దర్యాప్తును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్యాపింగ్ (Telephone Tapping)కేసు దర్యాప్తు విషయంలో బీజేపీ చేస్తున్న డిమాండ్ కు బీఆర్ఎస్(BRS) మద్దతు పలుకుతున్నట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రవీణ్ కు రెండుసార్లు నోటీసులు జారీచేస్తే లెక్కచేయలేదు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని ప్రవీణ్ అప్పట్లో నానా గోలచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రవీణ్ బీఆర్ఎస్ లో చేరారు.

ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు విచారణకు వచ్చి వాగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్(RS Praveenkumar)కు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. అయితే ఆ నోటీసులను ఈ నేత పట్టించుకోలేదు. రెండుసార్లూ విచారణకు గైర్హాజరైన ప్రవీణ్ ఇపుడు సడెన్ గా మీడియా ముందుకొచ్చి సిట్ దర్యాప్తుపై ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. విచారణకు హాజరుకాకుండానే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగటంలేదని మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ఆరోపణలు గుప్పించటం విడ్డూరంగా ఉంది. చాలాకాలం ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కూడా సిట్ అధికారులు జారీచేసిన నోటీసులను ఏమాత్రం ఖాతరుచేయకపోవటం గమనార్హం.

విచారణకు హాజరుకాకుండానే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగటంలేదని ఎలా చెప్పారో ప్రవీణ్ కు తెలియాలి. విచారణ ముగింపుకు వచ్చిన తర్వాత కేసీఆర్ ను అరెస్టుచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ప్రస్తుతం కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ బాస్ గా పనిచేసిన టీ ప్రభాకరరావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. తొందరలోనే ప్రభాకరరావును విచారిస్తున్న సిట్ అధికారులు కేసీఆర్ కు కూడా నోటీసులు జారీచేస్తారనే ప్రచారం నేపధ్యంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతు దర్యాప్తును సీబీఐ(CBI)కి ఇవ్వాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

ఇపుడు ప్రవీణ్ చేసిన డిమాండ్ నే కొంతకాలంగా బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కాపాడేందుకే కేంద్రమంత్రులు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారంటు రేవంత్ రెడ్డి, మంత్రులు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత(Kavitha)ను కూడా బీజేపీనే రక్షిస్తోందని రేవంత్(Revanth), మంత్రులు ధ్వజమెత్తారు. అదేపద్దతిలో ట్యాపింగ్ దర్యాప్తును రాష్ట్రప్రభుత్వం నుండి తప్పించి సీబీఐకి అప్పగించటం ద్వారా కేసీఆర్ ను రక్షించేందుకు బీజేపీ ప్లాన్ వేసినట్లు ప్రభుత్వ పెద్దలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రమంత్రుల డిమాండ్ నే ప్రవీణ్ కూడా వినిపించటంతో రేవంత్, మంత్రులు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News