VamanRao murder Case | జంటహత్యల కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రింకోర్టు ఆదేశం
మంథని రోడ్డుమీద వెళుతున్న లాయర్ దంపతులు గట్టు వామనరావు(52), పీవీ నాగమణి(46)ని(Lawyers murder) ఇద్దరు కత్తులతో నరికి చంపేశారు;
దాదాపు నాలుగేళ్ళ క్రిందట తెలంగాణలో జరిగిన జంటహత్యల కేసు విచారణను సీబీఐ(CBI)కి అప్పగించాలని మంగళవారం సుప్రింకోర్టు(Supreme Court) తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే 2021, ఫిబ్రవరి 17వ తేదీన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని మంథని రోడ్డుమీద వెళుతున్న లాయర్ దంపతులు గట్టు వామనరావు(52), పీవీ నాగమణి(46)ని(Lawyers murder) ఇద్దరు కత్తులతో నరికి చంపేశారు. దంపతులు ఇద్దరూ హైకోర్టులో మంచి ప్రాక్టీసున్నా లాయర్లు. లాయర్ల హత్య ఘటన అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో సంచలనమైంది. ఘటనలో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన కొడుకు, కోడలు హత్యకేసు విచారణను పోలీసులతో విచారణ చేయించటం కాదని సీబీఐతోనే చేయించాలని వామనరావు(Lawyer Vamana Rao) తండ్రి కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
అయితే ఆయన విన్నపాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని కిషన్ కోర్టులో పిటీషన్ వేశారు. జస్టిస్ ఎంఎం సుందరేశన్, జస్టిస్ ఎన్ కే సింగ్ ధర్మాసనం ఈకేసును విచారించింది. మంగళవారం జరిగిన విచారణలో కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హత్యకు సంబందించిన వీడియోలు, డాక్యుమెంట్లను కూడా వెంటనే సీబీఐకి హ్యండోవర్ చేయాలని చెప్పింది. ఈరోజు ఉదయం విచారణ మొదలవ్వగానే కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరంలేదని ప్రభుత్వం తరపు లాయర్ చెప్పారు. దాంతో కేసును సీబీఐకి బదిలీచేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. హత్యకేసును తిరిగి విచారించాలని అలాగే పిటీషనర్ కు భద్రత కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు పూర్వపరాలు
హైకోర్టు లాయర్లయిన దంపతులు ఒక కేసులో వాదనలు వినిపించేందుకు మంథని కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో విచారణ పూర్తియిన తర్వాత పెద్దపల్లి-మంథని రోడ్డు మీదుగా తిరిగి హైదరాబాద్ కు తమ కారులో బయలుదేరారు. అయితే రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని కాల్వచర్ల ప్రాంతానికి కారు చేరుకోగానే సడెన్ గా ఒక కారు వెనుకనుండి ముందుకువచ్చి లాయర్ల కారును అటకాయించింది. అందులోనుండి టీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్టా శ్రీనుతో కలిసి మరో వ్యక్తి దంపతుల దగ్గరకు వచ్చారు. కారు దగ్గరకు వచ్చిన ఇద్దరిచేతిలోని ఆయుధాలను గమనించిన దంపతులు కారులో నుండి బయటకువచ్చి తప్పించుకునే ప్రయత్నంచేశారు. అయితే ప్రత్యర్ధులు ఇద్దరూ దంపతులకు అవకాశం ఇవ్వకుండా చేతిలోని కత్తి, కొడవలితో నరికి చంపేశారు. వామనరావును కత్తితో పొడుస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కూడా వదలకుండా నరికి చంపేశారు.
కారులోనే కత్తితొ దాడిచేసిన ఇద్దరు తర్వాత వామనరావును కారులో నుండి బయటకు లాగి రోడ్డుమీద పడేసి విచక్షణా రహితంగా నరికేశారు. కారులో దంపతులను నరుకుతున్నపుడు, తర్వాత రోడ్డుమీదకు వామనరావును లాగి నరుకుతున్నపుడు రోడ్డుమీదే కాకుండా ఆక్కడే ఆగివున్న ఆర్టీసీ బస్సుల్లోనుండి చాలామంది జనాలు హత్య దృశ్యాలను వీడియోలు తీశారు. కళ్ళముందే జరుగుతున్న దాడి, హత్యను ఆపకపోయినా హత్యను మాత్రం చాలామంది వీడియో తీశారు. దంపతులను హత్యచేసిన తర్వాత హంతకులు తాపీగా తమ కారు ఎక్కి అక్కడనుండి పారిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గంలో వామనరావు పోలీసులతో మాట్లాడుతు పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అనుచరుడు పుట్టా శ్రీను తమను హత్యచేసినట్లు మరణ వాగ్మూలమిచ్చాడు. హత్యచేసిన వారితో పాటు లాయర్ దంపతులది కూడా ఒకే గ్రామం. ఒకదేవాలయం నిర్మాణంకు సంబంధించిన స్ధలవివాదం బాగా పెద్దదిగా మారి చివరకు హత్యకు దారితీసింది.