సినిమా స్టైల్లోనే టాస్క్ ఫోర్స్ పనిచేసిందా ?

తాజాగా అరెస్టై రిమాండుకు వెళ్ళిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు వింటుంటే క్రైం థ్రిల్లర్ సినిమాను చూసినట్లుంది.

Update: 2024-03-30 05:32 GMT
Telephone tapping

టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతున్న కొద్ది ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా అరెస్టై రిమాండుకు వెళ్ళిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు వింటుంటే క్రైం థ్రిల్లర్ సినిమాను చూసినట్లుంది. వ్యాపారస్తులను, రియాల్టర్లను, పారిశ్రామికవేత్తలను పోలీసులు బెదిరించటాలు, డబ్బువసూలు చేయటమంతా సినిమాల్లో సన్నివేశాలే గుర్తుకొస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీఎన్నికల్లో ఒకపార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులకు అవసరమైన డబ్బులు అందచేసిన విధానాన్ని రాధాకిషన్ విచారణలో పోలీసు అధికారులకు వివరించారు. ఆయన చెప్పిందివిన్న అధికారులు ఆశ్చర్యపోయారట.


అందుకనే రాధాకిషన్ వాగ్మూలం ఆధారంగా ఇప్పటివరకు అరెస్టయిన పోలీసు అధికారులందరిపైనా టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. నిందితులందరిపైనా టెలిగ్రాఫ్ చట్టం నమోదుచేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కోర్టు అనుమతి కోరుతు లేఖ రాయటం సంచలనంగా మారింది. దేశమొత్తంలో ఇప్పటివరకు టెలిగ్రాఫ్ చట్టాన్ని ఎవరిపైనా ఏ ప్రభుత్వం నమోదుచేయలేదు. కోర్టుగనుక అనుమతిస్తే నిందితులపై టెలిగ్రాఫ్ చట్టాన్ని నమోదుచేసే మొదటిరాష్ట్రంగా తెలంగాణా నిలుస్తుంది.

టెలిగ్రాఫ్ చట్టంలోని 25వ నిబంధన ప్రకారం అనుమతిలేకుండానే ఎవరి ఫోన్ను అయినా ట్యాపింగ్ చేసినట్లు బయటపడితే ట్యాప్ చేసిన సదరు అధికారికి మూడేళ్ళ జైలుశిక్ష పడుతుంది. కేసు తీవ్రత దృష్ట్యా మరికొన్ని సెక్షన్ల ప్రకారం పదేళ్ళ జైలుశిక్ష కూడా విధించవచ్చని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ట్యాపింగ్ కు సంబంధించి ఆరోపణలు మామూలే కాని అందుకు ఆధారాలు దొరకటమే చాలా కష్టం. అందుకనే గతంలో ట్యాపింగ్ ఆరోపణలు వినిపించిన రాష్ట్రాల్లో కూడా ఎవరిపైనా అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోయాయి. కాని ఇపుడు తెలంగాణా పరిస్ధితి వేరుగా ఉంది. ఎందుకంటే ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుఅధికారులు తాము ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు.

ఇప్పటివరకు అరెస్టయిన డీసీపీ, డీఎస్పీ, సీఐ స్ధాయి అధికారులందరు కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే తాము ప్రతిపక్షాల నేతలు, వారి కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియాల్టర్లు, బడా వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు. కిందిస్ధాయి అధికారులతో టెలిఫోన్ ట్యాపింగ్ చేయించమని ప్రభాకరరావుకు ఆదేశాలిచ్చిన వారెవరు అన్న విషయం మాత్రం బయటపడలేదు. ట్యాపింగ్ అంశం వెలుగుచూడగానే ప్రభాకరరావు అమెరికాకు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభాకరరావును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎస్ఐటి)కి అవకాశం రాలేదు. ప్రభాకరరావు విచారణకు హాజరైతే మరిన్ని సంచలనాలు బయటపడటం ఖాయమని అందరు అనుకుంటున్నారు.

అంతా సినిమా స్టైలేనా ?

ఇక ప్రస్తుతానికి వస్తే తాజాగా అరెస్టయి రిమాండుకు వెళ్ళిన రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగుగా ఉన్నాయి. విచారణలో ఆయన చెప్పిందంతా అచ్చం సినిమాలో జరిగినట్లే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ తరపున అభ్యర్ధులకు అందాల్సిన నిధులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే తరలించారట. సదరు పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులకు డబ్బులు కావాలంటే టాస్క్ ఫోర్సే సమకూర్చిందట. ఎలాగంటే ఉదాహరణకు ఒక అభ్యర్ధికి డబ్బులు కావాలని పార్టీ పెద్దలకు చెప్పటమే ఆలస్యం. వెంటనే టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగేసి కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియాల్టర్లకు ఫోన్లు చేస్తుంది. అభ్యర్ధికి ఎంతమొత్తం డబ్బు అందించాలని పార్టీ పెద్దల నుండి ఆదేశాలు వచ్చాయో అంతమొత్తాన్ని వసూలుచేసి సదరు అభ్యర్ధికి తీసుకెళ్ళి ఇచ్చేశారు.

పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించారు కాబట్టి ఎన్నికల డ్యూటీలో ఉన్న మిగిలిన పోలీసులు ఎవరు చెక్ చేయరు. ఈ విధంగా చాలామంది అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చులకు అవసరమైన డబ్బును టాస్క్ ఫోర్సే అందించినట్లు రాధాకిషన్ అంగీకరించారని సమాచారం. అయితే వీళ్ళు చేసిందేమిటంటే అభ్యర్ధుల కోసం డబ్బులు సమకూరుస్తునే తమ అవసరాల కోసం కూడా డబ్బులు వసూలు చేసుకున్నారు. మొదటిదే దరిద్రం అంటే రెండోది అరాచకం. ఒకపార్టీ కోసం చేశాము, పార్టీ పెద్దలు చెప్పింది చేసినట్లు రాధాకిషన్ చెప్పారంటేనే అదే పార్టీయో, పార్టీ బాసు ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. బ్లాక్ మెలింగ్ కు, డబ్బుల వసూళ్ళకు, డబ్బులు చేరవేతకు పోలీసు అధికారులు ఎవరిస్ధాయిలో వాళ్ళు ప్రైవేటు సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నట్లు రాధాకిషన్ సిట్ అధికారులకు వివరించారట. అందుకనే ట్యాపింగ్ కేసులో ఉన్న పోలీసు అధికారులందరిపైనా టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించి కోర్టు అనుమతి కోరారు.

Tags:    

Similar News