ఈ ఎంఎల్ఏ రూటే సపరేటు

కొనుగోలుదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నది, ఆటో డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చింది ఎవరని అనుకుంటున్నారా ? అయనే మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.

Update: 2024-09-28 09:37 GMT
MLA Komati rajagopal reddy with bajji cart owner

ఉదయమే ఒక పర్మిట్ రూములో ప్రత్యక్షమై మందుబాబుకు ఫుల్ క్లాసు. పనిలోపనిగా అమ్ముతున్న మందు గురించి వాకాబు...

ఒక కిరాణాకొట్టును తనిఖీ చేసి అందులోని వస్తువుల నాణ్యతపై ఖాతాదారుల నుండి ఫీడ్ బ్యాక్...

బజ్జీలమ్మే బండి దగ్గర ఆగి బజ్జీలు వేసేందుకు వాడుతున్న నూనెపై ఆరా...

స్కూలికి వెళుతున్న ఆటోని ఆపి అందులో ఎంతమంది పిల్లలున్నారనే విషయమై విచారణ...

ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా ? పర్మిట్ రూమును చెక్ చేసి మందుబాబుకు క్లాసుపీకింది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కారు. కిరాణాకొట్టును తనిఖీ చేసిందీ తూనికలు, కొలతల శాఖ అధికారులు కాదు. బజ్జీలమ్మే బండిలో వాడుతున్న నూనెను తనిఖీచేసింది ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అంతకన్నా కారు. ఆటోని నిలిపి అందులో ఎంతమంది పిల్లల్ని తీసుకెళుతున్నారని పరిశీలించింది ఆర్టీయే అధికారులు అంతకన్నా కాదు. పై తనిఖీలు చేసింది, క్లాసు పీకింది, కొనుగోలుదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నది, ఆటో డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చింది ఎవరని అనుకుంటున్నారా ? అయనే మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.

అదేమిటి ఎంఎల్ఏకి నియోజకవర్గంలో చేయాల్సిన పనులే లేవా ? అంటే ఎందుకు లేవు చాలానే ఉన్నాయి. కాకపోతే తన నియోజకవర్గంలోని జనాల మంచి చెడులు చూడాల్సింది తానే కదాని ఎంఎల్ఏ రాత్రనక, పగలనకా కనిపించిన పర్మిట్ రూములు, కిరాణా కొట్లు, స్నాక్స్ అమ్మే బండ్లు, ఆటోలన్నింటినీ చెక్ చేస్తుంటారు. నియోజకవర్గంలో ఇతరత్రా అభివృద్ధి అంటారా ? ఎలాగూ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రే కదా అన్నీ ఆయనే చూసుకుంటారనే ధీమా. ఉదమయే పర్మిట్ రూములో కూర్చుని మందుతాగుతున్న ఒక వ్యక్తిని పట్టుకుని ఎంఎల్ఏ ఫుల్లుగా క్లాసు పీకారు. ‘ఇంతపొద్దునే పర్మిట్ రూములో కూర్చుని మందు తాగుతున్నావు, నీకు ఫ్యామిలీ లేదా’ అని ప్రశ్నించారు. ‘పొద్దున్నుండి మందుతాగుతుంటే కుటుంబం ఏమైపోవాల’ని నిలదీశారు.

బజ్జీలమ్మే బండి యజమానికి నాసిరకం నూనెలు వాడి జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీయద్దని సలహా ఇచ్చారు. ఖరీదు ఎక్కువే అయినా మంచి నాణ్యమైన నూనే వాడాలని చెప్పారు. మంచి నాణ్యమైన నూనె కొనాలంటే నెలకు ఎంత డబ్బులు అవసరమని అడిగారు. యజమాని చెప్పగానే జేబులోనుండి రు. 10 వేలు తీసి ఇద్దామని అనుకున్నారు. అయితే జేబులో డబ్బులు లేకపోవటంతో మద్దతుదారుడి దగ్గర తీసుకుని పదివేల రూపాయలు ఇచ్చారు. నాణ్యమైన నూనెను వాడి బజ్జీ ధర పదిరూపాయలు ఎక్కువ పెట్టినా నష్టంలేదని వ్యాపారపరమైన సలహా కూడా ఇచ్చారు.

స్కూలుకు పిల్లల్ని తీసుకెళుతున్న ఆటోను నిలిపారు. ఆటోలో ఎంతమంది పిల్లల్ని తీసుకెలుతున్నది లెక్కపెట్టారు. ఇంతమంది పిల్లల్ని తీసుకెళుతున్నపుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. డ్రైవర్ పక్కన కూర్చున్న పిల్లాడిని దింపి వెనక కూర్చోబెట్టి ఇకముందెప్పుడు పక్కనే పిల్లల్ని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయద్దని డ్రైవర్ రాముడికి ఎంఎల్ఏ వార్నింగ్ ఇచ్చి ఆటోని పంపించేశారు. ఏదేమైనా తన స్టైలే వేరని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పకనే చాటుతున్నారు.

Tags:    

Similar News