Heavy Rains | బీఆర్ఎస్ ను ప్రకృతి ఏమార్చిందా ?
ఐదురోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి ఏమైందో ఏమో సడెన్ గా రెండురోజులు అసలు వర్షం జాడేలేదు.;
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే 14, 15 తేదీలు అంటే గురువారం, శుక్రవారం ఒక్క వానచినుకు(Rains) కూడా పడలేదు. అంతకుముందు ఐదురోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి ఏమైందో ఏమో సడెన్ గా రెండురోజులు అసలు వర్షం జాడేలేదు. వర్షం పడకపోవటానికి, బీఆర్ఎస్(BRS) కు సంబంధం ఏమిటి ? ఏమిటంటే, 14వ తేదీన బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై(BC Reservations)భారీ బహిరంగసభను నిర్వహించాలని బీఆర్ఎస్ అనుకున్నది. అంతకుముందు 8వ తేదీనే జరగాల్సిన బహిరంగసభ వివిధ కారణాలతో 14వ తేదీకి వాయిదాపడింది.
ఒకసారి వాయిదాపడింది కాబట్టి రెండోసారి తప్పక నిర్వహించాల్సిందే అని పార్టీలోని బీసీనేతలు గట్టిగా అనుకున్నారు. బహిరంగసభకు వేదికగా కరీంనగర్ పట్టణాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే కరీంనగర్ లో బీసీల జనాభా ఎక్కువగా ఉంది. కరీంనగరే కాదు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో కూడా బీసీల జనాభా గణనీయంగా ఉంది. కాబట్టి ఈరెండుజిల్లాల నుండి బహిరంగసభకు జనసమీకరణ తేలికగా ఉంటుందని అనుకున్నారు. అన్నీ కోణాల్లోను ఆలోచించుకుని 14వ తేదీన బహిరంగసభ జరుగుతుందని ప్రకటించారు. సభకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. జనసమీకరణ బాధ్యత మాజీమంత్రి కరీంనగర్ ఎంఎల్ఏ గంగులకమలాకర్ మీద మోపినట్లు సమాచారం.
ఏర్పాట్లు మొదలైన తర్వాత సడెన్ గా వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. అదేమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజులు భారీవర్షాలని 10వ తేదీన ప్రకటించింది. ప్రకటనకు తగ్గట్లే తెలంగాణ వ్యాప్తంగా వరుసగా మూడురోజులు భారీవర్షాలు కురిశాయి. క్లౌడ్ బరెస్ట్ పద్దతిలో కుంభవృష్టి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీవర్షాలను చూసిన తర్వాత బీఆర్ఎస్ లోని బీసీ నేతలు సమావేశమై బహిరంగసభను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. భారీవర్షాల కారణంగా బహిరంగసభ నిర్వహణ కష్టంకాబట్టి సభను వాయిదా వేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. సభను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
అయితే నేతలు బహిరంగసభను వాయిదావేస్తున్నట్లు ప్రకటించిన దగ్గర నుండి వానలు పడటం ఆగిపోయాయి. సభను నిర్వహించాలని అనుకున్న 14వ తేదీన ఒక్క చినుకు కూడా పడలేదు. 15వ తేదీన కూడా వర్షపు జాడే కనబడలేదు. దాంతో బీఆర్ఎస్ బీసీ నేతల్లో ఒక్కసారిగా నిరాశ కమ్ముకునేసింది. వర్షాలను నమ్ముకుని సభను వాయిదా వేసుకుంటే రెండురోజులుగా ఒక్క చినుకు కూడా పడకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకనే వర్షాలు కూడా బీఆర్ఎస్ ను ఏమార్చిందా అని జనాలు చెప్పుకుంటున్నారు.