Tiger Mating season | తోడు కోసం పులుల ప్రయాణం, బోనులో బంధించిన వైనం

సంభోగ సీజనులో తోడును వెతుక్కుంటూ అడవుల్లో వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించిన జానీ, జీనత్ అనే రెండు పులులను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బోనులో బంధించారు.;

Update: 2025-01-02 07:35 GMT

మేటింగ్ సీజన్‌లో మగ పులులు ఆడపులితో శృంగారం కోసం అడవిలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయా? అంటే అవునంటున్నారు అటవీశాఖ అధికారులు.చలికాలం ఆరంభంతో పులులకు బ్రీడింగ్ సీజన్ ఆరంభమైంది. మేటింగ్ సీజనులో శృంగారం జరిపేందుకు మగ పులి ఆడపులి కోసం, ఆడపులి మగపులి కోసం అడవిలోనే తన నివాస అటవీప్రాంతాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి.ఆడపులిని వెతుక్కుంటూ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవికి వలస వచ్చిన జానీ అనే మగపులి, మగపులిని వెతుక్కుంటూ ఒడిశా నుంచి వచ్చిన జీనత్ అనే ఆడపులి ఒకే రోజు వలలో చిక్కాయి.


ఆడపులి కోసం వలస వచ్చిన జానీ
మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యానికి చెందిన జానీ అనే మగపులి ఆడపులి తోడు కోసం వెతుక్కుంటూ తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వలస వచ్చింది. ఆడపులి కోసం వెతుక్కుంటూ తిరిగిన జానీకి ఆడపులి ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన జానీ మహారాష్ట్రలో ఇద్దరిని, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిపై దాడి చేసి చంపింది. జానీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఉట్నూర్, నార్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్, వాంకిడి, ఇటికల పహాడ్ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని రాజురా తాలూకా ప్రాంతానికి తిరిగి చేరింది.

బోనులో బంధించిన అటవీఅధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలను వణికించిన జానీ అనే పులిని ఎట్టకేలకు రాజురా తాలూకా అంతర్ గామ్ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. సీసీ కెమెరాల ద్వారా పులి జాడను గుర్తించిన అధికారులు పులిని బోనులో బంధించి దాన్ని చంద్రాపూర్ లోని ట్రాన్సిట్ ట్రీట్ మెంట్ సెంటరుకు తరలించారు. పులి చంపిన వారి రక్త శాంపిళ్లను, పులి రక్తంతో జత చేసి పరీక్షించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు జానీ పులిని బంధించడంతో కాగజ్ నగర్ ప్రాంత అటవీ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



 మగపులి తోడు కోసం జీనత్ 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం

ఒడిశా పులుల అభయారణ్యం నుంచి మగతోడు వెతుక్కుంటూ వెళ్లిన జీనత్ అనే ఆడపులిని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లా లో అటవీశాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి బంధించారు. జీనత్ అనే ఆడపులి మగతోడు కోసం తపిస్తూ ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అటవీప్రాంతాల్లో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

శృంగార సమయంలో పులులు ఎలా ప్రవర్తిస్తాయంటే...
‘‘బ్రీడింగ్ సీజనులో పులులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. శృంగారానికి వేళ అయినపుడు ఆడపులి సరిగా నిద్రపోకుండా తోక ఊపుతూ మగపులి చెంతకు చేరుతుంటాయి.ఆడపులి చెట్లపై పోసే మూత్రం ఫిరోమోన్స్ వాసన ద్వారా గుర్తించి మగపులి ఆడపులితో కలిసేందుకు వస్తుంది. ఆడపులి వెల్లెకిలా పడుకొని అరుస్తూ మగపులి జాడ కోసం ఎదురుచూస్తూ విరహంతో గడుపుతుంటాయి’’ అని హైదరాబాద్ జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ అయిన సీనియర్ పశువుల డాక్టర్ ఎంఏ హకీం చెప్పారు. మరో వైపు మగపులి కూడా ఆడపులిని కలిసేందుకు విరహంతో అరుస్తూ ఉంటే గుర్తించి జూపార్కులో మగపులిని ఆడపులితో కలుపుతామని హకీం చెప్పారు. మేటింగ్ సీజన్ ప్రారంభానికి ముందే మగపులి, ఆడపులి మధ్య సయోధ్య కోసం నెలరోజుల పాటు కలిపి ఉంచుతామని ఆయన వివరించారు.

మేటింగ్ తర్వాత...
అడవిలో మేటింగ్ సీజనులో మగపులి ఆడపులి కోసం, ఆడపులి మగపులి కోసం పరితపిస్తూ తమ నివాస ప్రాంతాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణిస్తుంటాయని డాక్టర్ ఎంఏ హకీం చెప్పారు. ఒక సారి మగపులి ఆడపులిని కలిసిన తర్వాత తమ తమ నివాస అటవీ ప్రాంతానికి తిరిగి వెళతాయని ఆయన తెలిపారు. ఒక సారి కలిసిన తర్వాత ఆ రెండు పులులు మళ్లీ కలవవని ఆయన పేర్కొన్నారు. తల్లీ పిల్లలు తప్ప ఏ రెండు పులులు ఒక చోట కలిసి ఉండవని, అవి కూడా పులి పిల్లలకు ఏడాదిన్నర వయసు వచ్చేదాకా కలిసి ఉంటాయని, ఆ తర్వాత అవి కూడా దూరంగా వెళతాయని డాక్టర్ హకీం వివరించారు.


Tags:    

Similar News