మోదీ పాలనకు వ్యతిరేకంగా TPJAC ప్రచారం

Update: 2024-05-02 14:12 GMT

ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించాలని రాష్ట్రంలోని మేధావులతో ఏర్పాటుయిన తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) పిలుపునిచ్చింది. దీని కోసం ఒక   ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. మే 2 నుండీ మే 11 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు ఈ సంస్థ తరఫున వారు ప్రచారం చేయనున్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాగించిన ‘ఫాసిస్టు’ పాలనను, ఆర్ధిక విధానాలను, అవినీతిని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశ్నించాలని సంస్థ  పిలుపునిచ్చింది. తెలంగాణలో మే 13 న 17      లోక్ సభ నియోజకవర్గాలకు జరుగుతున్న  ఎన్నికలలో తగిన మోదీనాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఓడించాలని  తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరారు.

గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రచార కార్యక్రమ ప్రారంభ సభలో హరగోపాల్ మాట్లాడుతూ... "ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికలలో ప్రచారంలోకి తీసుకురాకుండా, బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోదీ ముస్లింలు, మంగళసూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారి పట్టిస్తున్నారని” ఆయన విమర్శించారు. “గత పదేళ్ళలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా, మతం, దేవుడు, ముస్లిం ప్రజలపై విద్వేషం పునాదిగా మోడీ ప్రచారం సాగిస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని” ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రొఫెసర్ రమా మేల్కొటె ప్రసంగిస్తూ... “బీజేపీ నాయకులు నైతిక విలువలు కూడా వ్యవహరిస్తున్నారని, బెంగళూర్ లో బీజేపీ భాగస్వామ్య పార్టీ ఎంపీ స్త్రీలపై జరిపిన అత్యాచారాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ, అటువంటి వ్యక్తికి మోడీ ప్రచారం చేశాడని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు మతసామరస్యంతో శతాబ్ధాల పాటు జీవించారని, ఇప్పుడు ఆ సామరస్య వాతావరణాన్ని బీజేపీ నాయకులు విద్వేషంతో నింపుతున్నారనీ, ప్రజలు వాళ్ళ మాయలో పడకుండా ఉండాలని ఆమె కోరారు.

సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ... మోదీ ఆర్ధిక విధానాల వల్ల, కొంతమంది బిలియనీర్లుగా మారారని, దేశ సంపద దోచుకున్నారని, మిగిలిన ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని, దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఈ సమయంలో బీజేపీ ని కేంద్రంలో మళ్ళీ అధికారంలో రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు.

భారత్ జోడో అభియాన్ జాతీయ నాయకులు కవిత కురుగంటి మాట్లాడుతూ... దేశమంతా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అందుకే మోదీ మత విధ్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో కూడా బీజేపీకి స్థానం లేకుండా చేయాలని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమం కరపత్రాలు, పోస్టర్స్, సభలు, సమావేశాలు, పత్రికా విలేఖరుల సమావేశాలు, స్థానిక ర్యాలీల రూపంలో రాబోయే పది రోజులు రాష్ట్రమంతా జరుగుతుందని టీపీజెఏసి తెలిపింది. మే 3, 4 తేదీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుందని, మిగిలిన అన్ని జిల్లాలలో స్థానిక యాత్రలు జారుగుతాయని, అన్ని మండల కేంద్రాలలో సమావేశాలు ఉంటాయని TPJAC కో కన్వీనర్ లు కన్నెగంటి రవి, రవిచందర్, మైసా శ్రీనివాస్ వివరించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో డాక్టర్ వనమాల, ప్రొఫెసర్ సుకుమార్, అనిశెట్టి శంకర్, మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు డాక్టర్ రుక్మిణీ రావు, విరసం నాయకులు రాము, TPJAC కో కన్వీనర్ లు బన్నూరు జ్యోతి, విస్సా కిరణ్ కుమార్, కరుణాకర్ దేశాయి, TPJAC నగర నాయకులు ముత్తయ్య, రామగిరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News