అమెరికాలో విషాదం, నలుగురు హైదరాబాదీల సజీవ దహనం

రాంగ్ రూట్ లో వచ్చిన ట్రక్ వారి కార్ ని ఢీ కొట్టడంతో ప్రమాదం;

Update: 2025-07-08 02:50 GMT
అమెరికాలో సజీవదహనం అయిన శ్రీవెంకట్ కుటుంబసభ్యులు (ఫైల్ ఫొటో)

అమెరికా దేశంలో నలుగురు హైదరాబాదీల విహార యాత్రలో విషాదం రాజుకుంది. గ్రీన్ కౌంటీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన బెజుగం శ్రీవెంకట్ కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు. హైదరాబాద్ నగరంలోని సుచిత్ర ప్రాంతానికి చెందిన శ్రీ వెంకట్ (40), తేజస్వినీ(36), వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ, మృదాలు సెలవుల్లో సరదాగా గడిపేందుకు డల్లాస్ వెళ్లారు. డల్లాస్ నుంచి అట్లాంటాలోని వారి బంధువువల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన మినీ ట్రక్కు ఢీకొంది.ఈ ప్రమాదంలో కారులో మంటలు రాజుకోవడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. డీఎన్ఏ పరీక్షలకు శాంపిల్స్ తీసుకొని మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని గ్రీన్ కౌంటీ పోలీసులు చెప్పారు.


ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి...
హైదరాబాద్ నగరంలోని సుచిత్ర ప్రాంతానికి చెంది శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. వీరిద్దరూ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఇల్లు కొనిక్కొని స్థిరపడ్డారు. సెలవుల కోసం విహార యాత్రకు వెళ్లి అట్లాంటాలోని తన అక్క ఇంటికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ వెంకట్ తల్లిదండ్రులు పసుపతినాథ్, గిరిజలు తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండేవారు. వారు కుమారుడి వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నారు.

అమెరికా బయలుదేరిన తేజస్వినీ తల్లిదండ్రులు
తేజస్వినీ తల్లిదండ్రులు రవి, అనిత కొంపల్లిలో ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే తేజస్వినీ తల్లిదండ్రులు అమెరికాకు బయలు దేరి వెళ్లారు. తేజస్వినీ అన్నయ్య కూడా అమెరికాలోనే ఉంటున్నారని సమాచారం. ఈ ఘటనతో శ్రీవెంకట్ బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కారుతో సహా అందరూ కాలి బూడిద కావడంతో అధికారులు ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. డీఎన్ఏ నమూనా తీసుకొని మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తారని వారి బంధువులు చెప్పారు.


Tags:    

Similar News