కేసీయార్కు షాకుల మీద షాకులు
ఫాంహౌస్ లో కేసీయార్ మీటింగులు పెట్టుకుని తొందరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందని ఏవో మాటలు చెబుతున్నారు.
వరుసగా 15 రోజులు పార్టీలోని ప్రజా ప్రతినిధులు, సినియర్ నేతలతో ఫాం హౌస్ లో కేసీయార్ మీటింగులు పెట్టుకున్నారు. ఒకవైపు కేసీయార్ మీటింగులు పెడుతునే ఉన్నారు మరోవైపు ఎంఎల్ఏ, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరుతునే ఉన్నారు. అంటే కేసీయార్ మాటలను వీళ్ళల్లో చాలామంది నమ్మటంలేదని అర్ధమైపోతోంది.
ఫాంహౌస్ లో కేసీయార్ మీటింగులు పెట్టుకుని తొందరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందని ఏవో మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మద్దని భవిష్యత్తంతా తమదే అని ప్రతిరోజు చెప్పిందే చెబుతున్నారు. ప్రతిరోజు కొందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు కొందరిని పిలిపించుకుని బుజ్జగించి, భోజనాలు పెట్టి పార్టీమారద్దని బతిమలాడుకుంటున్నారు. కేసీయార్ బతిమలాడుతుండగానే చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అంటే కేసీయార్ చెబుతున్న మాటలను యాదయ్య నమ్మటంలేదని అర్ధమైపోతోంది. అలాగే ఇద్దరు ఎంఎల్సీలు తొందరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
శనివారం వరంగల్ జిల్లాకు వెళ్ళిన రేవంత్ రెడ్డి టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి విషయంలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగులో బీఆర్ఎస్ ఎంఎల్సీలు బసవరాజు సారయ్య, బండా ప్రకాష్ హాజరయ్యారు. రేవంత్ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్సీల హాజరును ఎవ్వరూ ఊహించలేదు. కొద్దిసేపు కూర్చున్న సారయ్య తర్వాత అక్కడినుండి వెళ్ళిపోయి పక్కనే ఉన్న మరో గదిలో చాలాసేపు వేం నరేందర్ రెడ్డితో మాట్లాడుకున్నారు. వేం నరేందర్ రెడ్డి ఎవరంటే రేవంత్ కు అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారుడు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి పెట్టే రివ్యూ మీటింగులకు ప్రతిపక్ష ఎంఎలఏలు, ఎంఎల్సీలు హాజరుకారు. ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను అధికారులు పిలవటం, ప్రజా ప్రతినిధులు హాజరై సమస్యలు, పరిష్కారం గురించి మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇపుడంతా ఏమి జరిగినా అంతా ఏకపక్షమే.
ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ ఎంఎల్సీలు ఇద్దరు రేవంత్ రివ్యూ మీటింగుకు హాజరయ్యారంటే వెనుక ఏదో జరుగుతోందన్న విషయం అర్ధమైపోయింది. 40 సీట్లున్న శాసనమండలిలో బీఆర్ఎస్ కు 29 మంది ఉంటే కాంగ్రెస్ కు 6 మంది మాత్రమే ఉన్నారు. ఏ బిల్లు గట్టెక్కాలన్నా బీఆర్ఎస్ అనుకుంటే తప్ప సాధ్యంకాదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు సానుకూలంగా ఉంటుంది ? కాబట్టి అసెంబ్లీలో పాసయ్యే బిల్లులను మండలిలో అడ్డుకోవాలన్న టార్గెట్ బీఆర్ఎస్ ది. సో, మండలిలో కూడా బిల్లులు పాసవ్వాలంటే బీఆర్ఎస్ సభ్యులను చీల్చి చెండాల్సిందే అని రేవంత్ డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎంఎల్సీల్లో సగంమందికి పైగా లాగేస్తేకాని మండలిలో బిల్లులు సజావుగా పాస్ కావు. అందుకనే రేవంత్ ఆపనిలో ఉన్నట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే బహుశా సారయ్య, బండా రివ్యూ మీటింగుకు హాజరయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది.
జరుగుతున్నది చూస్తుంటే కేసీయార్ చెబుతున్న మాటలను ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామంది నమ్ముతున్నట్లు లేదు. అందుకనే కేసీయార్ మాట్లాడి మాట్లాడుతున్నారు పార్టీని వదిలేసే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు వదిలేస్తున్నారు. తన మాటలను, హామీలను ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు నమ్మటంలేదంటే ఇదంతా కేసీయార్ చేసుకున్న స్వయంకృతమనే చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, నేతలను దగ్గరకు కూడా రానీయలేదు. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తుపోకడలకు పోయిన కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు కనీసపాటి గౌరవంకూడా ఇవ్వలేదు. అలాంటిది ఓడిపోయిన తర్వాత అందరినీ పిలిపించుకుని మాట్లాడి, ధైర్యం చెబితే కేసీయార్ మాటలను నమ్మేందుకు వీళ్ళేమీ చిన్నపిల్లలు కాదుకదా. అందుకనే పిలిపించినపుడు వెళ్ళి మాట్లాడుతున్నారు, భోజనాలు చేస్తున్నారు, హామీలు తీసుకుంటున్నారు బయటకు వచ్చి పార్టీ మారిపోతున్నారు. కొందరైతే అసలు కేసీయార్ మీటింగులకు కూడా హాజరుకావటంలేదు. ప్రజాప్రతినిధుల నిర్ణయాలు కేసీయార్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొద్దిరోజుల తర్వాత పార్టీలో ఎంతమంది మిగులుతారో చూడాలి.