‘హిందూ దేవుళ్లంటే చులకనా’.. ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత..
మొండా మార్కెట్ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మొండా మార్కెట్ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ దేవుళ్లంటే, హిందువుల మనోభావాలంటే అంత చులకనా అయిపోయాయా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు రోడ్డుపైనే భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కూడా కొందరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని, హిందూ దేవతల విగ్రహాలపై ఈ దాడులు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, హిందూ దేశంలో హిందువులు ఆరాధించే దేవతల విగ్రహాలకే రక్షణ లేకుంటే ఎలా అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టకూడదని, ప్రభుత్వ ఈ ఘటనపై దృష్టి సారించి మరోసారి ఇవి పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితుల గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరగడంతో అక్కడ హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.
గేటును తన్ని మరీ..
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడిన దుండగుడు ఆలయ గేటును కాలితో తన్ని మరీ లోపలికి వెళ్ళాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతడిని దేహశుద్ధి చేశారు. అనంతరం ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన తెలుపుతున్నవారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తప్పు ఎవరో చేస్తే.. న్యాయం కోసం పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం ఏంటంటూ నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. వారు అరెస్ట్‌ను ప్రతిఘటించడంతో అక్కడ ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ఘటన స్థలానికి చేరుకున్నారు.
కేంద్రమంత్రితో పాటు సీపీ సీవీ ఆనంద్ కూడా ముత్యాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులు సహా జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతడు దాడి చేయడం వెనక ఉన్న కారణం తెలియాల్సి ఉందని, మద్యం మత్తులోనే ఇలా చేశాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాగా దసరా పండగ వేళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కూడా ఇటువంటి ఘటనే జరగడం. రోజుల వ్యవధిలో ఆలయంలోకి చొరబడి దేవత విగ్రహం దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
నాంపల్లిలో ఏం జరిగిందంటే..
దసరా పండగ వేడుకల కోసమని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దసరా దగ్గర పడుతున్న క్రమంలో అక్కడ భారీ కార్యక్రమం నిర్వహించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అపచారం.. అమ్మవారికి అవమానం జరిగాయి. అర్థరాత్రి సమయంలో అమ్మవారి విగ్రహంపై దాడి చేసి విగ్రహం కాళ్లు, చేతులు పగులగొట్టేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ విషయాన్ని ఉదయం గమనించిన స్థానికులు వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే నిర్వాహకులతో పాటు హిందూ సంఘాలు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.