సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: మహేష్

ఎన్ని పోరాటాలు చేసయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామన్న మహేష్ కుమార్ గౌడ్.

Update: 2025-10-06 09:08 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం శుభపరిణామమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్ని పోరాటాలు చేసయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవోను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పట్టువిడువకుండా ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే హైకోర్టులో ఈ అంశంపై జరుగుతున్న విచారణలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు.

బుధవారమే విచారణ..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ అంశం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. జీఓను ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చిన అనంతరం అక్టోబర్ 8కి విచారణను వాయిదా వేసింది. బుధవారం విచారణ తిరిగి ప్రారంభం కానున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్ దాఖలుకు రెడీ అయింది. ఈ కౌంటర్ దాఖలపై సీఎం రేవంత్ రెడ్డి.. న్యాయ నిపుణులతో మంత్రులతో సమీక్షించారు. అనంతరం కౌంటర్ దాఖలు రెడీ అయ్యారు. కాగా అదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తంత ఊపిరి పీల్చుకుంది. కాగా బుధవారం హైకోర్టులో విచారణ ఏ అంశాలపై జరగనుంది అనేది ప్రస్తుతం అనేక చర్చలకు దారిలీస్తోంది.

Tags:    

Similar News