హెచ్‌సీయూ ల్యాండ్‌ని ఎకో పార్క్ చేస్తాం..!

ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరూ కొనవద్దు. కొంటే పక్కాగా మీరు నష్టపోతారు. ప్రభుత్వంలో వచ్చాక కాదు.. ముందే హెచ్చరిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.;

Update: 2025-04-03 06:08 GMT

హెచ్‌సీయూ భూములపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ భూములు కొందామనుకుంటున్న రియల్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు భూములు కొన్నా.. తాము అధికారంలోకి వస్తే మాత్రం మొత్తం లాగేసుకుంటామన్నారు. ఆ 400 ఎకరాలను అందమైన ఎకో పార్క్‌గా మార్చేస్తామని, తద్వారా వన్యప్రాణులను కాపాడటమే కాకుండా.. హైదరాబాద్ పర్యాటకానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. హెచ్‌సీయూ భూముల వివాదంపై ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. అసలు అవి ప్రభుత్వ భూముల, వర్సిటీ భూముల అన్న టాపిక్ గురించి తాను మాట్లాడట్లేదని చెప్పారు. అదే విధంగా అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరిట విధ్వంసం చేస్తామంటూ చూస్తూ ఊరుకోమని చెప్పారు. అదే విధంగా ఆ భూముల కోసం పోరాడుతున్న, ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. వారి పోరాట స్ఫూర్తి చాలా గొప్పదన్నారు. 400 ఎకరాల భూమి కోసం వారు చేస్తున్న పోరాటం.. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామిక లక్షాలేడ..!

‘‘ఒక అంశంపై విద్యార్థులు ఇంతటి స్థాయిలో పోరాటం చేస్తున్నప్పుడు ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం ఏం చేయాలి? వారిని పిలిచి మాట్లాడి.. సమస్యల పరిస్కారానికి మార్గం చూడాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలతో పోలుస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అక్కడ జింకలు లేవు గుంటనక్కలున్నాయన్నారు. ఇంకో మంత్రి అయితే విద్యార్థులను చిన్నబుచ్చేలా పేమెంట్ బ్యాచ్ అని నోరుపారేసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి.. ఆ 400 ఎకరాల్లో జంతువులే లేవు.. అదంతా కూడా కృత్రిమ మేధా(ఏఐ)తో జనరేట్ చేసిందని అంటున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇది దాయాదుల పోరు, ఆస్తి తగాదా కాదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి.. ఈరోజు నాలుగుకోట్ల మంది ప్రజల ముఖ్యమంత్రి, అంటే వారు కట్టే పన్నులతో జీతం తీసుకుని బతికే ఒక ప్రతినిధి మాత్రమేనని అన్నారు.

సీఎం అంటే చక్రవర్తి కాదు..

‘‘కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు.. రూలింగ్ పార్టీ కాదు.. సర్వింగ్ పార్టీ అని పిలవాలని. సీఎం అనే వ్యక్తి రాష్ట్రానికి రాజో, నియంత, చక్రవర్తో కాదు.. ఒక పెద్దపాలేరులా.. పబ్లిక్ సర్వెంట్‌గా పనిచేయాల్సిన వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినా ప్రజా సేవకులం. ఈ విషయం మరిచిపోయి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న ఇంగితం కోల్పోయి రేవంత్రెడ్డి దురుసు వ్యాఖ్యలు చేస్తున్నాడు. వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. మీతో పాటు మనమందరం పబ్లిక్ సర్వెంట్లమే. ఇదేం పటేల్, పట్వారీ వ్యవస్థ కాదు. నియంతృత్వం కాదు. ఇక్కడ రాజులు, చక్రవర్తులు లేరు’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పేరుకే ప్రజాపాలన

‘‘నువ్వు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేవి మాత్రమే. మీ పార్టీకి సంఖ్యాబలం ఎక్కువ ఉండి.. మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే.. సీఎం కుర్చీలో కూర్చున్నావ్. పేరుకేమీ ప్రజాపాలన అంటున్నా.. కానీ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారు. ఈ రోజు ప్రజాస్వామిక స్ఫూర్తి కనీసం అణుమాత్రం కూడా మీరు చేసే పనుల్లో కనిపిస్త లేదు. దేశం మొత్తం చూస్తుంది. ప్రజా పాలన అనే అర్థానికి పాతరేసి బుల్డోజర్లు, జేసీబీలతో.. మేం పాలకులం.. మీరంతా కాలికింద చెప్పుల్లా ఉండాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదో విచిత్రమైన మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా ప్రభుత్వ వ్యవహరం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి అంటున్నారు. రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్లు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు చేస్తా? నా భూమి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గవర్నర్ కస్టోడియన్ మాత్రమే.. ప్రజలు మాత్రమే ఓనర్లు. ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. నేను రాజును.. ఇది నా రాజ్యం అన్నట్లుగా వ్యవహరించొద్దు. అది యూనివర్సిటీ భూమా? గవర్నమెంట్ భూమా అనే పంచాయితీని పక్కనపెడితే.. నువ్వు కేవలం తాత్కాలిక ధర్మకర్తవు మాత్రమే. దాన్ని కాపాడాల్సింది పోయి.. ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తానంటే కుదరదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


అంత తొందరేంటి రేవంత్..!

‘‘మీకు చేయాలనుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. కట్టాలనుకుంటున్న బిల్డింగ్.. మీరు నిర్మాస్తానంటున్న ఫోర్త్ సిటీనో 420 సిటీనో ఉంది కదా.. అందులో కట్టుకోండి. 14వేల ఎకరాలను బుట్టలో పెట్టి ఇచ్చాం కదా. ఇక్కడ పర్యావరణాకి హాని కలిగిస్తూ చేస్తాననడం ఎంత వరకు సమంజసం. ఒక పదినిమిషాల పాటు భవిష్యత్ తరాలకు ఏమిస్తున్నాం అన్నసోయితోని పనిచేయి రేవంత్. ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు.. అలాంటప్పుడు అర్థరాత్రుల్లు బుల్డోజర్లు వేసుకుని దొంగల్లో ఎందుకు లోనికి పోతున్నారు. వట ఫౌండేషన్ వాళ్లు పిల్ దాఖలు చేస్తే.. దానికి కౌంటర్ ఇవ్వడానికి పది రోజులు టైమ్ ఇవ్వండని కోర్టును మీరే కదా అడిగారు. మరి ఈ పదిరోజుల్లో ఏ ఉపద్రవం వచ్చిందని రాత్రింబవళ్లు లైట్లు వేసుకుని మరీ చదును పనులను చేస్తున్నారు. కోర్టులు సెలవుల్లో ఉన్న రోజులే అదునుగా చూసుకుని వందల వాహనాలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. పిల్లలు పోరాటం చేస్తున్నారు.. అందులోకి మేము ఎంట్రీ ఇచ్చి వారి పోరాటాన్ని మలినం చేయకూడదనే ఇన్నాళ్లూ దూరంగా ఉన్నాం. ఈ అంశంపై కేసీఆర్ కూడా దృష్టాసారించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలని పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు’’ అని కేటీఆర్ చెప్పారు.


మూడేళ్లు.. మళ్ళీ అధికారంలోకి వస్తాం

‘‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేసిన ప్రయత్నాల వల్ల ప్రపంచంలో పలు నగరాల తలదన్ని వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022ను హైదరాబాద్ అందుకుంది. హరితహారం వంటి విప్లవాన్ని తీసుకొచ్చింది మా ప్రభుత్వమే. కేసీఆర్ హయాంలో గ్రీనరీ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా ఇచ్చింది’’ అని వివరించారు. ‘‘మూడేళ్లలో మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలను తెలంగాణలోనే అతిపెద్ద ఎకోపార్క్‌తో తయారు చేస్తాం. ఈరోజు ఎవరైనా రేవంత్ విసిరే బిస్కెట్లకు, మాటలకు ఆశపడి ఆ భూముల్లో ఒక్క అంగుళం కొనుక్కున్నా.. ప్రతి అంగుళాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం. అక్కడ అద్భుతమైన ఎకో పార్క్ నిర్మిస్తాం. కాబట్టి ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరూ కొనవద్దు. కొంటే పక్కాగా మీరు నష్టపోతారు. ప్రభుత్వంలో వచ్చాక కాదు.. ముందే హెచ్చరిస్తున్నాం. మేము భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాం. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి. మరో ఢిల్లీలో హైదరాబాద్ మారకూడదు. అందుకు మా పార్టీ కట్టుబడి ఉంటుంది’’ అని చెప్పారు.

‘‘ఇన్నాళ్లూ అక్కడకు మేము రాకపోవడానికి బలమైన కారణం ఉంది. ఒక్కసారి మేము అడుపెడుతూనే ఈ కాంగ్రెస్ దుర్మార్గులు.. ఇదంతా బీఆర్ఎస్సే చేస్తుందని బురదజల్లే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మలిన పరుస్తారు. అందుకే మేము ఇంతకాలం మౌనంగా ఉన్నాం. కానీ టైమ్ వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మేము, మా పార్టీ కార్యకర్తలం అంతా కూడా హెచ్‌సీయూకు కలిసి కదులుతాం. ఇప్పటికే ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా మా ఎంపీలు లేవనెత్తారు’’ అని చెప్పారు.

Tags:    

Similar News