ఢిల్లీ మీటింగులో అసలు ఏమి జరిగింది ?
ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఒకలాగ చెబితే ఏపీ ఇరిగేషన్ శాఖమంత్రి నిమ్మలరామానాయడు పూర్తివిరుద్ధంగా చెప్పారు.;
ఇపుడీ పాయింటే తెలుగురాష్ట్రాల్లోని జనాలందరినీ అయోమయానికి గురిచేస్తోంది. ఢిల్లీలో మీటింగుకు హాజరైన వాళ్ళల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఒకలాగ చెబితే ఏపీ ఇరిగేషన్ శాఖమంత్రి నిమ్మలరామానాయడు పూర్తివిరుద్ధంగా చెప్పారు. దీంతో సమావేశంలో ఏమి జరిగింది అనే విషయమై అయోమయం మొదలైంది. సమస్యపరిష్కారానికి పెద్దమనిషి పాత్ర వహించిన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మౌనం వహించటంతో అయోమయం మరింతగా పెరిగిపోతోంది. అసలు విషయం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండురాష్ట్రాల మధ్యపెరిగిపోతున్న జలవివాదాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి సమక్షంలో రేవంత్, నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. వీళ్ళతో పాటు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) నిమ్మలతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
సమావేశం తర్వాత మీడియాతో రేవంత్ మాట్లాడుతు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చర్చే జరగలేదని చెప్పారు. బనకచర్ల విషయమై చంద్రబాబు ప్రస్తావన తేలేదుకాబట్టి తాను అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే రాలేదన్నారు. ఇతర విషయాలు చర్చించామని ఉమ్మడి కమిటి వేసి సమస్యలను పరిష్కారించుకోవాలని డిసైడ్ చేసినట్లు రేవంత్ తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. ఢిల్లీలోనే నిమ్మల మీడియాతో మాట్లాడుతు బనకచర్లతో పాటు అనేక అంశాలపై చర్చలు జరిగినట్లు చెప్పారు. అంటే బనకచర్ల విషయంలో ఇటు రేవంత్ అటు నిమ్మల(Nimmala Ramanaidu) మాట్లాడింది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దాంతో ఇద్దరిలో ఎవరుచెప్పింది నిజం ? అనే అయోమయం పెరిగిపోతోంది జనాల్లో.
మీటింగుకు ముందువరకు బనకచర్లపై ప్రతిరోజు పదేపదే ప్రకటనలు చేసిన చంద్రబాబు(Chandrababu) మీటింగ్ తర్వాత ఎందుకని అసలు మాట్లాడటంలేదో అర్ధంకావటంలేదు. సరే, రెండు రాష్ట్రాల నేతలు స్ధానిక పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ఎవరికి మద్దతుగా వాళ్ళు ప్రకటించటం సహజం. రేవంత్, నిమ్మల ప్రకటనలు ఇందులో భాగమనే అనుకుందాం. మరి ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అయినా ఏదో ప్రకటన చేయాలి కదా ? సమావేశంలో చర్చలు జరిగిన అంశాలను కేంద్రమంత్రి వివరించాలి కదా. భేటీలో జడ్జిపాత్ర పోషించిన కేంద్రమంత్రి ఎందుకు నోరిప్పటంలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. రేవంత్, నిమ్మల ఒకటే ప్రకటన చేస్తే అసలు సమస్యే ఉండకపోను. కాని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయటంతోనే అందరిలోను సమావేశంలో ఏమిజరిగింది ? అనే విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
భేటీలో ఏమిజరిగింది అనేవిషయమై ప్రకటనచేయాల్సిన బాధ్యత కేంద్రమంత్రి మీద కూడా ఉంది. భేటీలో చర్చలు జరిగిన అంశాలపై పాటిల్ ఒక ప్రకటనచేస్తే అసలు అయోమయానికి అవకాశమే ఉండదు. బనకచర్లపై చర్చజరిగితే జరిగిందని, జరగకపోతే జరగలేదన్న విషయాన్ని ఇప్పటికైనా కేంద్రమంత్రి ప్రకటిస్తే బాగుంటుంది. రేవంత్, చంద్రబాబు ప్రకటనలకన్నా కేంద్రమంత్రి ప్రకటనకే ఎక్కువ విలువ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యవర్తిగా వ్యవహరించిన కేంద్రమంత్రి నోరిప్పకపోవటంతోనే సమస్య పెరిగిపోతోంది.
రేవంత్ బయటపెట్టాలి : బండి
ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన డిమాండ్ మరింత ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ భేటీలో ఏమి జరిగిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టాలని బండి డిమాండ్ చేయటమే విడ్డూరం. సమావేశంలో ఏమి జరిగిందన్న విషయాన్ని సమావేశం అయిపోగానే రేవంత్ మీడియాకు వివరించారు. అప్పుడు చెప్పిన వివరాలకన్నా రేవంత్ కొత్తగా చెప్పేదేమీ ఉండదు. బనకచర్ల అంశంపైన తప్ప మిగిలిన అంశాలపై రేవంత్, నిమ్మల చెప్పింది దాదాపు ఒకటే. మిగిలిన అంశాలను పక్కనపెట్టేస్తే అసలు సమస్యంతా బనకచర్ల మీదే అని అందరికీ తెలుసు. కాబట్టి భేటీలో ఏమి జరిగిందనే విషయాన్ని రేవంత్ ను బండి డిమాండ్ చేయటం కన్నా తన సహచర మంత్రి సీఆర్ పాటిల్ ను అడిగితే బాగుంటుంది. ఎందుకంటే సమావేశాన్ని నిర్వహించిందే సీఆర్ పాటిల్, సమావేశం జరిగింది సీఆర్ పాటిల్ అధ్యక్షతనే. కాబట్టి బండి సంజయ్ సమావేశ వివరాలు బయటపెట్టాలని రేవంత్ ను అడగటంకన్నా సీఆర్ పాటిల్ ను అడిగి తెలుసుకోవటం ఈజీ. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) కూడా ఇదే విషయమై మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరపటం సంతోషమన్నారు. అయితే భేటీలో చర్చించుకున్న అంశాలను ముఖ్యమంత్రులు పూర్తిగా ఎందుకు చెప్పటంలేదని అడగటమే విచిత్రంగా ఉంది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ను అడిగి తెలుసుకోవాల్సిన వివరాలను కూడా బీజేపీ ముఖ్యులు రేవంత్ ను డిమాండ్ చేయాలని చెప్పటమే విడ్డూరంగా ఉంది.
రేవంత్ క్షమాపణ చెప్పాలి : హరీష్
ఈవిషయంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు(Harish Rao) డిమాండ్ మరింత విచిత్రంగా ఉంది. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలట. ఢిల్లీ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగినా మీడియాసమావేశంలో చర్చ జరగలేదని చెప్పటం జనాలను మోసంచేయటమే అని హరీష్ తేల్చేశారు. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏవన్న విషయం హరీష్ కు ఎలాగ తెలుసు ? ఎలాగంటే ఏమీలేదు బట్టకాల్చి రేవంత్ మొహంమీద వేసేయటం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారింది. హరీష్ వాదన ఏమిటంటే మీటింగ్ అజెండాలో బనకచర్ల సబ్జెక్టే మొదటిది అని అన్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో ప్రకటన వచ్చిందట. ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ప్రకటన కూడా అనధికారికమే. అధికారికంగా కేంద్రమంత్రి ప్రకటించలేదు. అజెండాలో చాలా ఐటెమ్స్ ఉంటాయి అయితే అందులో చర్చకు వచ్చిన అంశాలు ఎన్ని ? వాయిదాపడినవి ఎన్ని అన్న అంశాలను గమనించాలి. అజెండాలో మొదటి అంశమైన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగలేదని రేవంత్ చెప్పింది అబద్ధమని హరీష్ ఎలాగ చెబుతున్నారో అర్ధంకావటంలేదు. ఏదేమైనా ఢిల్లీ సమావేశం తర్వాత వివాదాస్పదమైన బనకచర్ల అంశంపై మరింత అయోమయం పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.