దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలేవి?

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.ఈ చెరువుపై రాష్ట్ర హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-06-21 11:27 GMT
దుర్గం చెరువు : పరిరక్షణకు చర్యలేవి?

దుర్గం చెరువును పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఈ కేసులో నిపుణుల కమిటీ సిఫార్సుల నివేదికను దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

- దుర్గం చెరువు సరస్సును సంరక్షించేందుకు,కొత్త మురుగునీటి శుద్ధి ప్రణాళికలను ఏర్పాటు చేసేందుకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సుమోటోగా విచారించింది.స్వల్పకాలిక చర్యలను అమలు చేయడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలపై నివేదికను దాఖలు చేయాలని హైకోర్టు బెంచ్ నిపుణుల కమిటీని ఆదేశించింది.
దుర్గం చెరువు సంరక్షణపై కమిటీ నివేదిక
దుర్గం చెరువు సంరక్షణపై నిపుణుల కమిటీ నివేదికను ఏప్రిల్ 24వతేదీన సమర్పించింది. హైకోర్టు బెంచ్ నివేదికను పరిశీలించిన తర్వాత స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సరస్సు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని,మెకనైజ్డ్ బోట్‌ల స్థానంలో పెడలింగ్ బోట్‌లు ఏర్పాటు చేయాలని కోర్టు కోరింది. చెరువులో నీరు కలుషితం అయినందున చెరువులోని నీటి నాణ్యతను పర్యవేక్షించాలని హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తదుపరి విచారణను ఆగస్టు 19వతేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
దుర్గం చెరువు ఆక్రమణలను తొలగించండి
హైదరాబాద్‌ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిటీ సమర్పించిన సత్వర ప్రణాళికను అమలుచేయాలని ఆదేశించింది. దుర్గం చెరువు హైదరాబాద్ నగరంలో రాయదుర్గ్,మాదాపూర్,జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలు,కొండల మధ్య సుందరంగా ఉండేది.

కాలుష్య కాసారంగా మారిన చెరువు
దుర్గం చెరువు సరస్సు కాలుష్య కాసారంగా మారింది. ఈ చెరువులోకి మురుగునీటితో పాటు రసాయనక వ్యర్థాలు కలుస్తున్నాయి.చెరువు కాలుష్యం వల్ల చెరువులోని చేపలు కూడా చనిపోయాయి. దీంతో ఈ చెరువు నీటి నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. కాలుష్యం బారి నుంచి ఈ చెరువును పరిరక్షించడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విఫలమైంది. పీసీబీ పనితీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.దుర్గం చెరువు సరస్సు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోకుంటే చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.కాలుష్య కారకాలు,మురుగునీటి కారణంగా చనిపోయిన చేపలు తేలుతున్నందున దుర్గం చెరువు సరస్సు పునరుద్ధరణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది.దుర్గం చెరువు పునరుద్ధరణ చర్యలను ప్రతిపాదించడానికి అతుల్ నారాయణ్ వైద్య అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఇటీవల కోర్టు నియమించింది.

దుర్గం చెరువులో ఆక్రమణలు
దుర్గం చెరువు సరస్సు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్‌లలో ఆక్రమణలు పెరిగాయని హైకోర్టు గుర్తించింది. సరస్సులో పూడిక తీయడం పక్కన పెడితే, ఆక్రమణలను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ఆక్రమణల వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకుడి హస్తం ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న యాక్టివిస్టులు ఆరోపించారు.

కాలుష్యంపై అధ్యయనం
దుర్గం చెరువుపై మహీంద్రా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఐఐటి- సివిల్ ఇంజనీరింగ్ విభాగాల పరిశోధకుల బృందం గత ఏడాది ఆగస్టులో ఓ నివేదికను విడుదల చేశాయి.ఈ సరస్సులోని విషపదార్థాల మొత్తాన్ని నివేదికలో తెలిపారు. దుర్గం చెరువు సరస్సులో సేంద్రీయ సూక్ష్మ కాలుష్య కారకాలున్నాయని తేలింది.ఔషధాలు,కలుపు సంహారకాలు, నైట్రేట్లు, క్రిమిసంహారకాలు,పురుగుమందుల అవశేషాలు ఈ చెరువులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.ఈ సరస్సు నుంచి మూడు నమూనా సైట్ల నుంచి 183 సమ్మేళనాలను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.ఈ చెరువు నీటిలో ఐరన్,మాంగనీస్,నికెల్,జింక్, మెటలాయిడ్స్ వంటివి ఉన్నట్లు తేలింది.

మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మించినా ఆగని కాలుష్యం
ఈ చెరువు వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు ద్వారా 35 కోట్ల రూపాయల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించినా దుర్గం చెరువు నీరు కలుషితం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దుర్గం చెరువు సరస్సు కాలుష్యం కారణంగా జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా రూ.3,866 కోట్లతో బోర్డు ఏర్పాటు చేసిన మరో 31 మురుగునీటి ప్లాంట్ల పనితీరుపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి.

దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి

పిక్నిక్ స్పాట్... దుర్గం చెరువు
వాస్తవానికి 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు సరస్సు గోల్కొండ కోట నివాసులకు మంచినీటి సరఫరా కోసం 1518- 1687వ సంవత్సరాల మధ్య నిర్మించారు.1950వ దశకంలో సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు.1970వ సంవత్సరం నాటికి ఈ చెరువు పిక్నిక్‌లు, విశ్రాంతి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. 2000వ దశకం ప్రారంభంలో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చెరువులో బోట్ సేవలను విస్తరించారు.అప్పుడే చెరువు ఆక్రమణలు,కాలుష్యం ఆనవాళ్లు బయటపడ్డాయి.ఈ చెరువుపై జూబ్లీహిల్స్​ నుంచి మాదాపూర్, హైటెక్​ సిటీలను కలుపుతూ 2022 సెప్టెంబరులో ఒక బ్రిడ్జిను నిర్మించారు.

పర్యావరణానికి ప్రమాదం తలపెట్టారు : సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లూబ్నా సర్వత్
దుర్గం చెరువును విధ్వంసం చేసి పర్యావరణానికి ప్రమాదం తలపెట్టారని సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లూబ్నా సర్వత్ ఆరోపించారు. ఈ చెరువు మధ్యలో రోడ్డు నిర్మించారని, చెరువు స్థలాలను కూడా ఆక్రమించారని ఆమె చెప్పారు. మురుగునీటితోపాటు విషకారకాలు చెరువులోకి వదిలారని ఆమె పేర్కొన్నారు. కెమికల్స్ వల్ల చెరువులో చేపలు మరణించాయని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలు, గుట్టలను తొలిచారని, పర్యావరణానికి వ్యతిరేకంగా ఈ సరస్సులో పనులు చేశారని డాక్టర్ లూబ్నా వివరించారు.


Tags:    

Similar News