మీనాక్షి నటరాజన్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నది ?

పార్టీకి మాత్రమే పరిమితం కావాల్సిన మీనాక్షి(Meenakshi Natarajan) ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు;

Update: 2025-07-04 07:16 GMT
Meenakshi Natarajan at Sigachi Factory

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనాలకు, పార్టీ నేతలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు ? ఒకవైపు పార్టీ అధిష్టానానికి, రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇదేసమయంలో పార్టీకి మాత్రమే పరిమితం కావాల్సిన మీనాక్షి(Meenakshi Natarajan) ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు. సిగాచి(Sigachi factory) కెమికల్ ఫ్యాక్టరిని సందర్శించి బాధితులను పరామర్శించటమే తాజా ఉదాహరణ. మీనాక్షి వెంట పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. బొమ్మ అంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, దామోదర వైద్యశాఖ మంత్రి కాబట్టి బాధితులను పరామర్శించారంటే అర్ధముంది. మరి ఏ హోదాతో మీనాక్షి బాదితులను పరామర్శించటమే కాకుండా ప్రభుత్వం తరపున హామీలు కూడా ఇచ్చేరో అర్ధంకావటంలేదు.

మామూలుగా పార్టీ ఇన్చార్జి అంటే పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమవ్వాలి. పార్టీని బలోపేతం చేయటం, పార్టీ నేతల మధ్య పంచాయితీలను పరిష్కరించటం, జిల్లాల పర్యటనలకు వెళ్ళి నేతలు, కార్యకర్తలను కలిసి మీటింగులు పెట్టడం, ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపులో అందరినీ సమన్వయంచేయటం లాంటివి చేయాలి. పార్టీకి, ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం ఉండేట్లుగా చూడటంవరకు ఓకే. కాని మీనాక్షి ఏమిచేస్తున్నారంటే పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. పటాన్ చెరులోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరికి వెళ్ళి బాధితకుటుంబాలతో మాట్లాడారు. అలాగే బాధితులు వైద్యంచేయించుకుంటున్న ఆసుపత్రులకు వెళ్ళారు. బాధితులను పరామర్శించటంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు.

అయితే అధికారపార్టీ ఇన్చార్జి హోదాలో ప్రభుత్వం తరపున బాధితకుటుంబాలకు హామీలిచ్చేశారు. పేలుడుకు కారణాలు కనుక్కునేందుకు కమిటి వేశామని, ఘటనను రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. బాధితకుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించిందని, కంపెనీ తరపున చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఇప్పిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయిస్తున్నట్లు చెప్పారు. మంత్రులు దగ్గరుండి పరిస్ధితులను పర్యవేక్షిస్తున్నారని, అన్నిరకాల సహాయకచర్యలు చేప్పడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లు మీనాక్షి ప్రకటించారు. నిజానికి జరిగిన ఘటనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదు.

ప్రమాదంజరిగిన వెంటనే మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ ఫ్యాక్టరి దగ్గరకు వెళ్ళారు. అక్కడే ఉండి బాధితులను ఆసుపత్రులకు పంపించటమే కాకుండా సహాయకచర్యలను పర్యవేక్షించారు. రెండు, మూడురోజుల పాటు మంత్రులిద్దరు అక్కడేఉండి పరిస్ధితులను పర్యవేక్షించినందుకు అభినందించాల్సిందే. ప్రమాదంజరిగిన రెండోరోజు రేవంత్(Revanth) ఫ్యాక్టరీకి వెళ్ళటంతో పాటు ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. అక్కడే బాధితకటుంబాలతో కూడా మాట్లాడి పరిహారాన్ని ప్రకటించారు. యజమాన్యంపై ఒత్తిడితెచ్చి ఫ్యాక్టరికి వచ్చేట్లుగా చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అధికారపార్టీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma) కూడా ఫ్యాక్టరిని సందర్శించటంతో పాటు ఆసుపత్రికి కూడా వెళ్ళారు. ఇంతవరకు బాగానే ఉన్నా మీనాక్షి పాత్ర కాస్త ఓవర్ గా అనిపిస్తోంది.

రేవంత్ చెప్పిన విషయాలనే మీనాక్షి మూడురోజుల తర్వాత ప్రకటించారు. బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీనాక్షి మూడురోజుల తర్వాత ప్రకటించటంలో అర్ధమేలేదు. నిజానికి పార్టీ ఇన్చార్జి అన్న హోదా తప్ప మీనాక్షికి మరో హోదానే లేదు. అలాంటిది ఏహోదాతో బాధితులతో మాట్లాడి మీనాక్షి ప్రకటించారో అర్ధంకావటంలేదు. పార్టీ వేరు ప్రభుత్వం వేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడే కాదు గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల వివాదంలో కూడా మీనాక్షి చాలా సమావేశాలు నిర్వహించారు. యూనివర్సిటి విద్యార్ధులతో, స్టాఫ్ తోనే కాకుండా మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ప్రజాసంఘాలను పిలిపించి సెక్రటేరియట్ లో భేటీ అయ్యారు. యూనివర్సిటీని సందర్శించి అక్కడ విద్యార్ధులతో మాట్లాడారు.

మీనాక్షి యాక్షన్ చూస్తుంటే రేవంత్ కు సమాంతరంగా వ్యవహారాలు నడుపుతున్నారా అనేసందేహాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెతకగా ఉంటే పార్టీ ఇన్చార్జీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నడపటం గతంలో చాలాసార్లు చూసినవే. అయితే ఇక్కడ రేవంత్ మెతక మనిషి కాదు. పార్టీ అధికారంలోకి రావటంలో రేవంత్ కష్టం చాలానే ఉంది. కాబట్టి రేవంత్ కెపాసిటిని తక్కువ అంచనావేసేందుకు లేదు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియంది ఏమీకాదు. అధిష్ఠానం ఆదేశాలు లేకుండా మీనాక్షి తనంతట తానుగా ముఖ్యమంత్రికి ప్యారలల్ గా వ్యవహారాలు నడిపే అవకాశాలు లేవు. ఏదేమైనా మీనాక్షి వైఖరి చూస్తుంటే రేవంత్ కు సమాంతరంగా వ్యవహారాలు నడుపుతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News