ఎనిమిప్రాపర్టీ అంటే ఏమిటి ? వాటి విలువ ఎంత ?
మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైఫ్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎనిమిప్రాపర్టీపై చర్చ మరింతగా పెరిగిపోయింది.;

ఈమధ్య తరచూ ఎనిమిప్రాపర్టీపై బాగా చర్చజరుగుతోంది. తాజాగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎనిమిప్రాపర్టీపై హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ఆధీనంలో ఉన్న ఎనిమిప్రాపర్టి కేంద్రప్రభుత్వానిదే అని తేలిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైఫ్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎనిమిప్రాపర్టీపై చర్చ మరింతగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజా నోటీసుల కారణంగా దశాబ్దాలుగా తన ఆధీనంలోనే ఉంచుకుని అనుభవిస్తున్న సుమారు రు. 15 వేల కోట్ల విలువైన ఆస్తులను సైఫ్ వదులుకోవాల్సొచ్చింది. ఈ నేపధ్యంలోనే అసలు ఎనిమిప్రాపర్టీ గురించి తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి పెరుగుతోంది.
ఇంతకీ ఎనిమిప్రాపర్టీ అంటే ఏమిటంటే కేంద్రప్రభుత్వం 1968లో రూపొందించిన చట్టం ప్రకారం దేశవిభజన తర్వాత చైనా, పాకిస్ధాన్ యుద్ధంనేపధ్యంలో మనదేశం నుండి శాశ్వతంగా వలసలు వెళ్ళిపోయిన వారి ఆస్తులే ఎనిమిప్రాపర్టీ. 1962లో చైనా, 1965, 1971లో పాకిస్ధాన్ మనదేశంపై యుద్ధంచేశాయి. ఆసమయంలో భారత్ లో ఉండటం ఎంతమాత్రం సురక్షితం కాదని అనుకున్న వందలాది కుటుంబాలు చైనా, పాకిస్ధాన్ కు వలసలు వెళ్ళిపోయాయి. దేశంలో ఉన్న తమ ఆస్తులన్నింటినీ వదిలిపెట్టేసి చాలామంది శాశ్వతంగా పై దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల్లో పౌరసత్వాన్ని కూడా తీసుకున్నారు. పై దేశాల్లో శాశ్వత పౌరసత్వాలు తీసుకున్న వాళ్ళు లేదా వాళ్ళ వారసులు ఎవరూ తిరిగి దేశానికి తిరిగొచ్చే అవకాశాలు లేవని కేంద్రప్రభుత్వం నిర్ధారణ చేసుకున్నది. మన శతృదేశాల్లో శాశ్వాతనివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకు చెందిన దేశంలోని ఆస్తులనే కేంద్రప్రభుత్వం ఎనిమిప్రాపర్టీ అని ప్రకటించింది.
మనదేశంలో 21 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 13 వేల ఎనిమి ప్రాపర్టీలున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత వాటన్నింటినీ కేంద్రప్రభుత్వం ఎనిమిప్రాపర్టీగా నోటిఫైచేసింది. ఇలాంటి ఎనిమిప్రాపర్టీలను సంరక్షించేందుకు ముంబాయ్ లో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ)ని ఏర్పాటుచేసింది. ఎనిమిప్రాపర్టీ సరక్షణకోసం కేంద్రం ప్రత్యేకంగా చట్టాన్ని కూడా చేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఎనిమిప్రాపర్టీలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే వేలంవేసి బహిరంగంగా అమ్మే అవకాశముంది. ఎనిమిప్రాపర్టీ దేశంలో ఏప్రాంతంలో ఉన్న వాటి సంరక్షణ లేదా అమ్మే అధికారం కేంద్రప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.
వీటివిలువ సుమారు లక్షన్నర కోటరూపాయలపైనే ఉంటుందని కూడా కేంద్రప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. 1968లో తయారుచేసిన ఎనిమిప్రాపర్టీ యాక్ట్ కొన్ని లొసుగులను గుర్తించి నరేంద్రమోడీ ప్రభుత్వం సవరించి 20016లో మరో కొత్తచట్టం తీసుకొచ్చిది. కొత్తచట్టం ప్రకారం దేశంలోని ఏ సివిల్ కోర్టుకు కూడా ఎనిమిప్రాపర్టీ కిందకు వచ్చే వివాదాలను విచారించే అధికారంలేదు. వివాదాలను హైకోర్టులు మాత్రమే విచారించాలి. దీనివల్ల ఏమైందంటే వివాదాల పరిష్కారంలో ఆలస్యం జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. ఎనిమిప్రాపర్టీకి సంబంధించి ఆమధ్య ఆర్టీఐ చట్టం ప్రకారం దేశంలోని ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. ఆర్టీఐ చట్టం ప్రకారం వెల్లడైన వివరాల్లో సుమారు 13 వేల ఆస్తులున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 5,688, పశ్చిమబెంగాల్ లో 4,354, తెలంగాణలో 234, మధ్య ప్రదేశ్, గోవా, ఛత్తీస్ ఘఢ్ లో కొన్ని ఆస్తులున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆస్తులపై వివరాలు అందుబాటులో లేవు.
తెలంగాణలో ఆస్తులు
తాజాగా బండి సంజయ్ నిర్వహించిన సమీక్షలో తెలంగాణలో 234 ఎనిమిప్రాపర్టీ ఉన్నట్లు తేలింది. రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ లో ఎనిమిప్రాపర్టీ ఉందని ఉన్నతాధికారులు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్ గూడ, మియాపూర్ లో వందలాదిఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు వివరించారు. అలాగే మరికొన్ని భూములు దశాబ్దాలుగా రైతుల స్వాధీనంలో ఉన్నట్లు చెప్పారు. బాకారంలో 25,503 గజాల స్ధలం వివాదంలో ఉందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివరించారు. ఇందులో ఎనిమిప్రాపర్టీ వాటా 5578 గజాలుందన్నారు. ఈస్ధలంలో కొన్నికుటుంబాలు ఇళ్ళు నిర్మించుకున్నాయని, కమర్షియల్ యాక్టివిటీ కూడా జరుగుతోందన్నారు.
బహదూర్ పురాలోని రికాబ్ గంజ్ సర్వేనెంబర్ 710-724, 778-784లో 3,300 గజాల స్ధలం కూడా ఎనిమిప్రాపర్టీ పరిధిలోకే వస్తుందన్నారు. అయితే ఇందులోని కొంతభూమి లొకేషన్ ట్రేస్ కావటంలేదని కూడా కలెక్టర్ వివరించారు. ఇదికాకుండా కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ 126/111, 126/112 సర్వే నెంబర్లలో 40 ఎకరాల వ్యవసాయభూమి ఆక్రమణల్లో ఉందని అధికారులు చెప్పారు. వికారాబాద్ జిల్లాలోని అల్లంపల్లి సర్వే నెంబర్లు 426, 427, 428లో 17.22 ఎకరాల భూమి కూడా ఎనిమిప్రాపర్టీయే అని కలెక్టర్ వివరించారు. ఇవికాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎనిమిప్రాపర్టీలున్నాయని అయితే వాటి వివరాలు అందుబాటులో లేవని అధికారులు కేంద్రమంత్రికి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలోను తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలోను కొన్ని రికార్డులు గల్లంతైనట్లు అధికారులు చెప్పినట్లు తెలిసింది. స్వాధీనంలో ఉన్న భూములపై శాశ్వత హక్కుల కోసం అనుభవదారులు కేంద్రప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవచ్చని ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి వివరించారు.
ఇదే విషయమై బండి మాట్లాడుతు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ, గోవా, ఛత్తీస్ ఘఢ్ లో ఎనిమిప్రాపర్టీలున్నట్లు చెప్పారు. వీటిని దగ్గరుండి సంరక్షించుకునేందుకు ముంబాయ్ లోని సెపీ కేంద్ర కార్యాలయానికి అనుబంధంగా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇపుడు ఎనిమిప్రాపార్టీలను సంరక్షించుకునేందుకు సెపీ కార్యాలయం ముంబాయ్ లో మాత్రమే ఉండటంవల్ల సంరక్షణలో అనేక సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. అందుకనే సెపీ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.