PONGAL | ఊరూరా భోగి మంటలు.. రురువు కథేంటీ..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ మూడు రోజుల పండుగలోని తొలి రోజైన భోగి పండుగను (TELUGU STATES) ఘనంగా నిర్వహిస్తున్నారు;
By : The Federal
Update: 2025-01-13 03:01 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ మూడు రోజుల పండుగలోని తొలి రోజైన భోగి పండుగను (TELUGU STATES) ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగవల్లులను (RANGAVALLULU) తీర్చిదిద్దారు. మరికొందరు ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు తరలి రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. హరిదాసులు ఇంటింటికీ వెళ్లి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. గంగిరెద్దులు ఇళ్ల వద్ద నృత్యాలు చేస్తున్నాయి.
సంక్రాంతి పండగను దక్షిణ భారత దేశంలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. ఈ పండగను భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా మూడు రోజుల పాటు జరుపుకొంటారు. మరి ముఖ్యంగా తెలుగు లోగిళల్లో ఈ పండగను పెద్ద పండగగా అభివర్ణిస్తారు. వాటిలో మొదటిగా వచ్చే పండగ.. భోగి. ఈ పండగ రోజు ఇంద్రుడు, వరుణుడిని ముఖ్యంగా పూజిస్తారు.
ఇక, దక్షిణాయన కాలంలో భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుడంతో.. చలి తీవ్రత పెరుగుతోంది. దాంతో చలి వాతావరణాన్ని తట్టుకోవడానికి.. ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను తట్టుకోవడానికి.. రానున్న ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని ఈ భోగి రోజు మంటలు వేస్తారు.
భోగి మంటల్లో పిడకలు వేస్తారు. అలాగే మామిడితోపాటు పలు ఔషధ చెట్ల కలపను సైతం మంటల్లో వేస్తారు. ఆవు నెయ్యితోపాటు ఆవు పిడకలు వేసి భోగి రోజు మంటలు వేస్తే.. శక్తివంతమైన గాలి వీస్తుందని పెద్దలు నమ్ముతారు. అగ్ని దేవుడిని ఆరాధించడం.. వాయు దేవుడిని గౌరవించడం ఈ రోజునే జరుగుతోందని ప్రజలు విశ్వసిస్తారు.
ఈ భోగి పండగ రోజే.. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అదే విధంగా చాలా మంది ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. భోగి పండగ రోజు.. సాయంత్రం వేళ.. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భోగి మంటల వెనుక కథే..
శాస్త్ర పురాణాల ప్రకారం.. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలో కోరుకోమని రాక్షసుడు రురువుని కోరాడు. తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడు. అందుకు బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు. దీంతో ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో తనని తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని రురువు కోరతాడు.
మిగతా సమయాల్లో మరణించకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు.
దేవతలను రురువు పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో ధనుర్మాసంలో దేవతలంతా 30 రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని కుప్పగా పోసి.. మంట పెడతారు. అందులోకి రురువును తోసేస్తారు. రాక్షసుడి చనిపోవడంతో.. అందుకు సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం అనవాయితీగా వస్తోంది.
అంతేకాదు.. రురువు అంటే సూక్ష్మక్రిమి అని అర్థం. చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములన్నీ తొలగి పోవడానికి భోగి మంటలు వేస్తారు. అంతేకాదు.. మనలోని చెడు గుణాలన్నీ ఆ భోగి మంటల్లో కాల్చేయాలనే సంకేతాన్ని సైతం పెద్దలు సూచిస్తారు.
భోగి రోజు.. పిల్లలు, పెద్దలందరూ వేకువజామునే లేచి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలను వేస్తారు. వాటిలో ఇంట్లో పాత సామాన్లు, అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను సైతం వేస్తారు. అయితే భోగి మంటల పక్కన ఒక బిందెడు నీళ్లను ఉంచాలని.. ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ నీటిని బకెట్లో కొన్నింటిని పోసుకోని స్నానం చేయడం ద్వారా గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
జాతక దోషాలు తొలగాలంటే..
అలాగే జాతకంలోని పలు దోషాలు తొలగాలంటే.. గొప్ప పరిహారం సైతం ఉందని వారు పేర్కొంటున్నారు. ఒక ఎర్రటి వస్త్రంలో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, రెండు గోమతి చక్రాలు వేసి మూట కట్టాలి. దానితో భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఆపై మూటను మంటలో వేయాలి. ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని.. ఆ వెంటనే అదృష్టం కలిసివస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల సంవత్సర పాటు కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని.. ఆర్థిక సమస్యలు సైతం ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు.
బూడిదతో ఇలా చేస్తే..
అదే విధంగా భోగి మంటల అనంతరం.. ఆ బూడిదను నుదుటి మీద బొట్టు, హృదయం, చేతుల మీద రాసుకోవాలని వారు సూచిస్తు్న్నారు. అలా అగ్ని దేవుడి నుంచి సిరిసంపదలు రావాలని 'శ్రీయమిచ్చేత్ హుతాసనాత్' అనే మంత్రాన్ని 11 సార్లు కూర్చొని జపించాలని వివరిస్తున్నారు. శ్రీయము అంటే సంపద, హుతాసనాడు అంటే అగ్ని దేవుడు.. ఇలా చేయడం వల్ల అగ్ని దేవుడు సిరిసంపదలను అందిస్తాడని చెబుతున్నారు.