Telangana debts|ఇంతకీ తెలంగాణా అప్పు ఎంత ?
ప్రతిపక్ష నేతల భిన్నమైనవాదనల కారణంగా తెలంగాణాఅప్పు ఎంతన్న విషయం జనాల్లో అయోమయం పెరిగిపోతోంది;
ప్రతిపక్ష నేతల భిన్నమైనవాదనల కారణంగా తెలంగాణాఅప్పు ఎంతన్న విషయం జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. 2023 డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుండి ఇప్పటివరకు అంటే ఏడాదికాలంలో ప్రభుత్వం 1.2 లక్షల కోట్లరూపాయల అప్పుచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) ప్రతిరోజూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మీడియాతో మాట్లాడుతు రేవంత్(Revanth) ప్రభుత్వం ఏడాదిలో రు. 70 వేల కోట్లరూపాయల అప్పుచేసిందని ఆరోపించారు. కేటీఆర్ ఏమో 1.20 లక్షల కోట్లరూపాయల అప్పుచేసిందని అంటే బండేమో 70 వేల కోట్లరూపాయల అప్పని చెప్పారు. ఇద్దరు కీలకనేతల పరస్పర విరుద్ధమైన ఆరోపణలతో గడచిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంచేసిన అప్పు ఎంత ? అనే సందేహం జనాల్లో పెరిగిపోతోంది.
ప్రభుత్వం ఏడాదికాలంలో చేసిన అప్పుపై ఇద్దరు కీలకనేతల్లోనే ఇంత తేడా అంటే సుమారు 50 వేల కోట్లరూపాయల తేడా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఏడాదిలో తెలంగాణా ప్రభుత్వంచేసిన అప్పులపై వీళ్ళదగ్గర సరైన సమాచారం లేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేటీఆర్ ఏమో పదేళ్ళు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కీలకనేత. ఇదేసమయంలో బండి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. ఇంతటి కీలకస్ధానాల్లో ఉన్న ఇద్దరు నేతల ఆరోపణల్లో ఇంతటి వైరుధ్యం ఉండటంతో జనాలు ఎవరు చెప్పింది నిజమో తేల్చుకోలేకపోతున్నారు. పైగా వీళ్ళిద్దరు రాష్ట్రం ఏడాది అప్పుగురించి మాట్లాడుతు ఒక విచిత్రమైన ప్రశ్నను వేశారు. అదేమిటంటే ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంచేస్తున్న లక్షల కోట్ల రూపాయల అప్పును ఎవరు తీరుస్తారు ? అని. ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే అప్పును ఎవరు తీరుస్తారు అన్న విషయం కూడా తెలీకుండానే ఉన్నారా ? అనే సందేహం పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న పార్టీలు చేసే అప్పులను తీర్చాల్సిందే జనాలే అన్న చిన్న లాజిక్ వీళ్ళకు తెలీదా ?
ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే బీఆర్ఎస్ పదేళ్ళ కాలంలో రు. 7 లక్షల కోట్లరూపాయల అప్పుచేసిందని రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పును భరిస్తున్నది కూడా జనాలే కదా. ఇక కేంద్రప్రభుత్వం అప్పులగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పు సుమారు రు. 65 లక్షల కోట్లరూపాయలు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం అప్పు సుమారు 181,68,457 కోట్ల రూపాయలు. సుమారు 60 ఏళ్ళపాటు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలు 65 లక్షల కోట్లరూపాయలు అప్పుచేస్తే కేవలం 11 ఏళ్ళల్లోనే నరేంద్రమోడి(Narendra Modi) ప్రభుత్వం కోటి 16 లక్షల కోట్లరూపాయల అప్పుచేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలతో అర్ధమవుతోంది. మరి పదకొండేళ్ళల్లో మోడి ప్రభుత్వం చేసిన అప్పును ఎవరు తీరుస్తారు ? ఇంకెవరు జనాలే కదా తీర్చాల్సింది. ప్రభుత్వంలో ఏపార్టీ ఉన్నా చేసిన అప్పులను తీర్చాల్సింది, తీర్చేది జనాలు మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు. తమ హయాంలో జరిగిన, జరుగుతున్న అప్పులను కేటీఆర్, బండి మరచిపోయినట్లు నటిస్తున్నారంతే.