లాకర్లలో ఏమున్నాయో ఏసీబీ ఎందుకు చెప్పటంలేదు ?

మురళికి చెందిన లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు కాని అందులో ఏమున్నాయో మాత్రం చెప్పటంలేదు;

Update: 2025-07-25 10:17 GMT
Retd ENC Muralidhar Rao

అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారుల దాడుల్లో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన మురళీధరరావు అరెస్టయిన విషయం అందరికీ తెలిసిందే. విచారణలో భాగంగా మురళికి చెందిన లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు కాని అందులో ఏమున్నాయో మాత్రం చెప్పటంలేదు. అరెస్టయిన మురళి మామూలు చేపకాదు. పెద్ద సొరచేపనే అనుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో మురళి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 2013లో ఇరిగేషన్ శాఖలో రిటైర్ అయిన ఈయన్ను కేసీఆర్ తెచ్చి నెత్తినపెట్టుకున్నారు. దాదాపు పదేళ్ళ పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కీలకమైన పోస్టులో కొనసాగారు. కాళేశ్వరం అవినీతిలో మురళి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. రిటైర్ అయిన మురళిని కేసీఆర్(KCR) కాళేశ్వరం ప్రాజెక్టు డైరెక్టర్ గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా, తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ ఫ్రా అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టరుగా కీలక బాధ్యతల్లో పనిచేశారు. ఈయన పనిచేసిన అన్నీ ప్రాజెక్టులూ వేలాది కోట్ల రూపాయల పనులు జరుగుతున్నవే.

ఆదాయానికిమించిన ఆస్తులకేసులో మురళిని ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు. ఆయన ఇల్లుతో పాటు కుటుంబసభ్యుల ఇళ్ళు, దగ్గర బంధువుల ఇళ్ళపైన కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. చివరకు బినామీలుగా అనుమానం ఉన్న తొమ్మిదిమంది ఇళ్ళల్లో కూడా అధికారులు సోదాలు జరిపారు. ఆ దాడుల్లో విస్తుపోయే ఆస్తులు బయటపడ్డాయి. ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు వెయ్యికోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఫ్లాట్లు, ప్లాట్లు, ఫామ్ హౌసులు, కమర్షియల్ బిల్డింగులు, పొలాలు, గేటెడ్ కమ్యూనిటిల్లో విల్లాలు, ఖరీదైన నాలుగు కార్లు, కొన్ని కంపెనీల్లో భాగస్వామిగా పెట్టుబడులు..ఇలా చాలానే సంపాదించారు. 1976లో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగంలో చేరిన మురళి వివిధ హోదాల్లో పనిచేసి 2013లో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా రిటైర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోగానే మురళి దశతిరిగిందనే చెప్పాలి.

ఏసీబీ లెక్కల ప్రకారం సర్వీసులో చేరిన దగ్గర నుండి రిటైర్ అయ్యేంతవరకు మురళి అందుకున్న జీత, బత్యాలు 6 కోట్ల 50లక్షల రూపాయలు. వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టడం, స్కూళ్ళల్లో చేర్పించటం లాంటి ఇంటి ఖర్చులు ప్రతినెలా అనేకముంటాయి. కాబట్టి ఎంత క్రమశిక్షణతో ఉన్నా వచ్చిన జీతంలో ప్రతినెలా సగం దాచటం కూడా కష్టమే. ఇక ఆర్ధిక క్రమశిక్షణ లేనివాళ్ళయితే వచ్చిన జీతం వచ్చినట్లుగా హారతికర్పూరంలో మాయమైపోవటం ఖాయం. ఇక్కడ మురళి విషయంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే సర్వీసు మొత్తంమీద జీత, బత్యాల రూపంలో రు. 6.5 కోట్లు అందుకుంటే చేసిన ఖర్చు రు. 6.96 కోట్లు. అంటే సర్వీసు మొత్తంమీద అందుకున్న దానికన్నా రు. 46.51 లక్షలు ఎక్కువగా ఖర్చుచేశారు. దీన్నిబట్టి ఏమి అర్ధమవుతున్నది అంటే మురళికి ఆర్ధిక క్రమశిక్షణ ఏమాత్రం లేదని.

అయితే ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే ఏసీబీ లెక్కల ప్రకారం మురళి సంపాదించిన ఆస్తుల విలువ రు. 9 కోట్లు. అంటే వచ్చిన జీతంకన్నా చేసిన ఖర్చులు ఎక్కువైతే ఇంకోళ్ళ కుటుంబం అయితే ఎప్పుడో రోడ్డుమీద పడేదే అనటంలో ఎలాంటి సందేహంలేదు. కాని విచిత్రంగా జీతం కన్నా ప్రతినెలా ఖర్చులు ఎక్కువ అయిపోయినా మురళి మాత్రం భారీస్ధాయిలో ఆస్తులు కూడబెట్టారు. ఇది ఎలాగ సాధ్యమైంది అన్నదే ఏసీబీ(Telangana ACB) అధికారులకు అర్ధంకావటంలేదు. అందుకనే ఆదాయానికి మించిన ఆస్తులుగా పరిగణించి మురళిపైన కేసు పెట్టి అరెస్టుచేసింది. జీతం కన్నా ఖర్చులు ఎక్కువైనా కాని మురళి రు. 9 కోట్ల విలువైన ఆస్తులను ఎలాగ సంపాదించారు అనే విషయాన్ని ఏసీబీ అధికారులు ఎంత అడిగినా సమాధానం చెప్పటంలేదని సమాచారం.

ఇదే సమయంలో ఐదురోజులుగా విచారిస్తున్న మురళికి చెందిన బ్యాంకు లాకర్లను(Bank Lockers) ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. లాకర్లగురించి ఎంత ప్రశ్నించినా మురళి నోరువిప్పటంలేదని తెలిసింది. లాకర్లలో ఏముందన్న విషయాన్ని ఏసీబీ అధికారులు కూడా బయటపెట్టలేదు. మురళి ఇంట్లో దొరికిన ఫ్లాట్లు, ప్లాట్లు, పొలాలు, కార్లు, బంగారం లాంటి వాటిని మీడియాలో ప్రకటించిన అధికారులు తాజాగా బ్యాంకు లాకర్లలో ఏముందన్న విషయాన్ని మాత్రం ఎందుకు ప్రకటించటంలేదు అన్నదే అర్ధంకావటంలేదు. అధికారులు గోప్యత పాటించేకొద్ది జనాల్లో ఊహాగానాలు బాగా పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News