గాంధీజీ వరంగల్లు వచ్చిన రోజు...

నాటి జర్నలిస్టు యం యస్ ఆచార్య జ్ఞాపకాలు. మహాత్మాగాంధీకి, లాల్ బహదూర్ శాస్త్రికీ నివాళులు

Update: 2024-10-02 05:53 GMT


వరంగల్లు రైల్వే స్టేషన్ ప్రక్కన పెద్ద బహిరంగ సభ నిర్వహించే విస్తారమైన జాగ ఉన్నది. ఆ ప్రాంతం అంతా జనంతో నిండిపోయింది. గాంధీ ఇంకా రాలేదు. ఆ మాట ఒక రోజు తరువాత మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు అని గాంధీ అని ఎదురుచేస్తున్నారు. వస్తారో లేదో కూడా పూర్తిగా తెలవడం లేదు. కాని జనం అంటున్నారు, వింటున్నారు, అంతేకాదు ప్రజానీకం ప్యాసెంజర్, వేగంగా నడిచే రైళ్లు, బస్సులు, కాలి నడక ద్వారా వందలాది జనం వచ్చి కూచున్నారు. అక్కడ ఎవరూ బిర్యానీ పొట్లాలు పంచిపెట్టే బహిరంగం సభా నిర్వాహక పార్టీలవాళ్లు కొని ఇచ్చేవారు ఉండరు. అందుకోసం పైసలు అడిగేవారు కూడా ఉండరు. నా వంటి జనానికి పైసలు ఎవరిస్తారు? ఎక్కడ బతికినారో, తిండి తిన్నారో లేదో చెప్పేవారు లేరు. బండ్లు కట్టుకుని వందలాది మంది సద్ది మూటలు తెచ్చుకుని గాంధీని చూడడం కోసం వస్తున్నారు. ఆ విషయం తెలిసి నాన్న (యం యస్ ఆచార్య) వరంగల్ లో నివసించే వంటి మిత్రులు కేవలం ఆ జనాన్ని చూడడం కోసం వచ్చిన వారు. రేపు పది పదకొండు సమయంలో గాంధీ వస్తున్నారని విన్నాం. గంటలకొద్ది ఉండి వెళ్లారు నాన్న, వారి మిత్రులు. గాంధీ రావడం కాదు, చూడడం కాదు, ఆ మాట, వార్త దాని గురించి మాట్లాడుకోవడం కూడా ప్రజానీకాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నది. అదే సత్యాగ్రహం, అదే ఉద్యమం, అదే ఉత్సాహం, ఉప్పు సత్యాగ్రహం కోసం అని కాదు. ఉప్పుకూడా లేదు. అయినా అదే ఉత్సాహం, అయినా గాంధీ పిలుపు కూడా ఎవరికి చేరలేదు. కాని తెలిసింది. చాలు. అందుకని వందలాది వేలాది జనం వరంగల్ స్టేషన్ పక్కన ఆవరణకు చేరుకున్నారు. 

 బానిసత్వాన్ని వదులుకోవడానికి, స్వతంత్ర పిపాస అంత లోలోతుగా నరనరాన నిండిపోయింది. (మనం నేర్చుకోవలసింది అది.)

తెల్లవారినప్పడినుంచి ఎదురు చూస్తున్నారు. అదొక జాతర. ఏ గుడీ లేదు, బ్రహ్మోత్సవం లేదు, ఊరేగింపులూ లేవు. మధ్యాహ్నమో, ఆ గంటల తర్వాతనో గాంధీ ఎక్కిన ధర్డ్ క్లాస్ రైలు వస్తున్నది. చుట్టూ జనం మధ్యలో నెమ్మదిగా రైలు వస్తున్నది. దిగుతున్నాడు మహాత్మాగాంధీ. జైహింద్ నినాదాలు దిక్కులు పిక్కటిల్లు పోతున్నాయి. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పైన రైలు కేవలం పదినిమిషాలు మాత్రమే ఆగుతాయి. ఈ లోగా దిగి, గాంధీ పక్కనున్న బాగా ఎత్తయిన మంచె పైకి బొంగు చెక్కలతో చేసిన మెట్లు టకటకా ఎక్కి, దిగుతున్నాడు గాంధీ. ఎవరికీ మైక్ లేదు. అవసరం కూడా లేదు. నినాదాల హోరు ఆగిన తరువాత నిశ్శబ్దంగా జనాన్ని చూస్తున్నాడు. జన జనార్దనుడిని నమస్కరించుకున్నాడు. చేయి అందరినీ మౌనంగా పలకరిస్తూ చేయి ఊపుకున్నారు.

రఘుపతి రాఘవ రాజారామ్

పతిత పావన సీతారామ్

భాజ్ ప్యారే తు సీతారం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ ,
సబ్కో సన్మతి దే భగవాన్

భజన (అదేనా మరో భజనా నాకు తెలియదు) రాం జయరాం రామ్ రామ్ అనే భజన కీర్తన చేయడానికి అవకాశం లేదు. అయిదారు నిమిషాలు భజన చేసి దిగిపోయి రైలెక్కివెళ్లిపోయారు గాంధీ. క్షణాల్లో అన్నీ జరిగిపోయింది.

జనం ప్రభంజనం ఊగిపోయారు. ఒక్క మాటా మాట్లాడలేదు. అవసరం లేదు. అదే పిలుపు, అదే ఉత్సాహం, సమరోత్సాహం, ఉద్యమం, భారతదేశమంతా ఊగిపోయిన మహోద్యమం అని నాన్న చెబుతూ ఉంటే తనకు పులకరింపులు వస్తూ ఉంటే వింటున్న మాకూ కూడా వస్తున్న పులకరింపులు కాక మరేమిటి.

నాకు తేదీ ఎప్పుడో తెలియదు. కాని గాంధీ వచ్చినపుడు, మే చూసిపప్పుడు అంటూ లక్షలాది మంది చెప్పుకుంటే అదే ఒక ఉద్యమం.


గాంధీ భజనైనా ఫరవాలేదు, అదే చాలు


ఎంఎస్ ఆచార్య


మహాత్మాగాంధీ అని పేరు వినబడితే చాలు, ప్రజలంతా కదిలిపోయిన సందర్భాలు ఎంతో చెప్పలేం. ఆగస్టు 15, 1947నాడు స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న నా వంటి ఇప్పటి సీనియర్ తరాల వారికి పాల్గొనే అవకాశం లేదు. కాని వారిగురించి మా నాన్నగారి చెప్పిన సంగతులు వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం 1947 ఆగస్టు 15 యం యస్ ఆచార్య యువకుడు, దినోత్సవం చూసుకోవాల్సిందే. కాని సాధ్యం కాలేదు. ఎందుకంటే 17 సెప్టెంబర్ 1948 దాకా నిజాం దుర్మార్గాలకు మొత్తం తెలంగాణా మరో పక్కన, ఆంధ్ర జిల్లాలకో లేదా మద్రాస్, మైసూర్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.

ఏ చేతిలో కందిలీ, మరో చేత లాఠీ

రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. ఆచార్యగారు. స్వాతంత్ర్య సమరయోధుడైన యం యస్ ఆచార్య నిజాం రజాకార్ల హత్య ప్రయత్నాలనుంచి కాపాడుకుంటూ వరంగల్లును వదిలేసి ఆంధ్రకు పోవలసి వచ్చింది. 1948 సెప్టెంబర్ 22న యం యస్ ఆచార్య జన్మభూమికి కాలు పెట్టుకునే అదృష్టం వచ్చింది. (ఆ తరువాత అంటే పదేళ్లకు 1958న నాన్నగారు జనధర్మ వార పత్రికను ప్రారంభించారు. 1994 దాకా నడిచి ఆగిపోయింది.)

ఇంకా ఆచార్య గారికి పెళ్లికాలేదు. మా అమ్మ తరువాత నాతో చెప్పిన సంఘటనల ద్వారా తెలిసింది: తన కుటుంబం ఎక్కడుందో తెలియదు. ఎప్పుడొస్తారో తెలియదు. అప్పడికి మా అమ్మానాన్నలకు అప్పడికి పెళ్లి కాలేదు. అప్పుడు హైదరాబాద్ లో వకీల్ గా ఉన్న మా తాతగారు వారి కొడుకులు కూతుళ్లు (అమ్మతో సహా) మద్రాస్ యాత్ర కు వెళ్లిపోయారు. చేతికి ఒక్క పైసా లేదు. పెద్ద కుటుంబం రజాకార్లను తట్టుకోలేక కనపడ్డ రైలు పట్టుకుని పారిపోవలసి వచ్చింది. అయినా మొత్తం దక్షిణ యాత్ర చేసుకొని రావడం ఒక సాహసం. వాళ్లు కూడా తెలంగాణ రావడానికి అందాకా స్వాతంత్ర్యదినోత్సవం చేసుకోవడం సాధ్యం కాదు.

అంతముందు జ్ఞాపకం మాతో చెప్పిన మాట గాంధీ గురించి కనీసం రెండుమూడు సార్లు నాన్నగారితో విని గుర్తుంచుకున్నాను.

ఖద్దరు ఉద్యమం

అప్పడినుంచి నాన్న ఖద్దరు ధరించిన వారు ఒక ఉద్యమం వలె సత్యాగ్రహానికి సంకేతం ఖద్దరు. చివరి రోజుదాకా ఖద్దరు లుంగీ, వంటిలో ఖద్దరుతో కుట్టించుకున్న ఖద్దరు బనీను ఆయనే తొడిగేది.

ఆచార్య మరో జ్ఞాపకం చెప్పడం అవసరం. మహాత్మాగాంధీ నాడు జయంతి. అదే రోజు లాల్ బహదూర్ జయంతి. ఆరోజు అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందంతోముగిసింది. కాని ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో చనిపోయారని అన్నా అనేక కారణాలు ప్రణాళికాబద్ధమైన హత్యగా అని అనుమానిస్తున్నారు. 


శాస్త్రీజీ

ఆచార్యగారు రాత్రి దాకా పనిచేయడం, మరునాడు ఉదయం 7 గంటల వార్తలు వింటూ దినచర్య ప్రారంభమయ్యేది. దుప్పటి లోపల రేడియో వింటూ ఉండేవారు. అప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో చనిపోయారనే వార్త విని దిగ్గున లేచి నిలబడ్డారు. నాక్కూడా వివరంగా తెలియదు. చాలా బాధపడ్డారు. ఇదో తీవ్రమైన పరిణామం అని అంటూ ఉండేవారు. తొందరతొందరగా బయటపడి పత్రిక కార్యాలయానికి ఈ సంచలనమైన వార్త విశ్లేషిస్తున్నారని తరువాత తెలిసింది. (లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినపుడు పోస్ట్ మాంటన్ ఎందుకు జరగలేదనే ఆర్ టి ఐ ప్రశ్నగురించి కేంద్ర సమాచార కమిషనర్ గా నేను ఒక తీర్పులో చర్చించాను. లాల్ బహదూర్ గారి పత్రికా ఆఫీసర్ గా తాష్కెంట్ తో పనిచేసిన కులదీప్ నయ్యర్ గారిని కలిసి నేను స్వయంగా వారి పరిశోధన చేసే అవకాశం వచ్చింది. వారి ఇంటర్వ్యూ తరువాత కొన్నాళ్లలో ఆయన చనిపోయారు)

నాన్న ఖద్దరు బనీనుకు ఒక జేబు కుట్టించుకున్నారు. ఎందుకంటే ఆయనకు గుండె మీద ఒక జేబు అవసరం. ధ్వని పెంచే వినికిడి యంత్రం (చిన్న మెషిన్) జేబులో ఉండాల్సిందే. కాని జేబులో లేదు. చివరి ఘడియలు. కాని ఆ జేబులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాకెట్ చిత్రం ఉంది. మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పటల్ (ఎం జి ఎం వరంగల్) లో సిస్టర్లు ఇంజెక్షన్ కావాల్సిన సందర్భం అని అడుగుతుంటే, నేను ఆ నొప్పి నాకొద్దు అని బాధపడుతున్నారు. నేను ఎదురుగా ఉన్నాను. జేబులో నీ దగ్గరే ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి చూడు. నొప్పిని మరిచిపో నాన్నా అన్నాను. ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియదు. అప్పడికి మొత్తం జ్ఞాపకాలు ఉడిగిపోతున్న క్షణాలు. అప్పుడు రకరకాల ఇంకెక్షన్లు చేస్తూ ఉంటే నాన్న ఈ శ్లోకం గుర్తు వచ్చింది. (రోజూ సుప్రభాతం, విష్ణుసహస్రనామం పఠించేవారు, ఇది సుప్రభాతం స్తోత్రంలో అయిదోది)

రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర

వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః

భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 5

(ఆ శ్లోకం అర్థం ఇది: పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృతకలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడియున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.)

ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆయన అనంతవాయువుల్లో కలిసిలో పోయాయి. చివరి నిమిషాలలో అంత కఠినమైన శ్లోకం గుర్తు రావడం, చదువుకోవడం ఒక అద్భుతం కదా.

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।। ముఖ్యమైన మాట.

(అర్థం: ‘‘మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు’ నెంబర్ 5, అధ్యాయం 8, భగవద్గీత).

(యం యస్ ఆచార్య శతదినోత్సవం 3 అక్టోబర్ 2024, అక్టోబర్ 2  రోజు గాంధీ జయంతి. అదే రోజు లాల్ బహదూర్ జయంతి. వారికి, యంయస్ ఆచార్యగారికి నివాళులు)


 


Tags:    

Similar News