బతుకమ్మ ‘బ్రాండ్ అంబాసిడర్’ ఎక్కడ ?

తెలంగాణాలో ఎంతో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ పండుగలో ఒక లోటు స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే బతుకమ్మ ఆటల్లో కవితక్క ఎక్కడా కనబడటంలేదు.

Update: 2024-10-06 10:13 GMT
Batukamma festival in BRS Bhavan

తెలంగాణాలో ఎంతో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ పండుగలో ఒక లోటు స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే బతుకమ్మ ఆటల్లో కవితక్క ఎక్కడా కనబడటంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బతుకమ్మ పండుగ పేరుతో కవిత ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. దశాబ్దాల చరిత్రలో బతుకమ్మ పండుగకు ప్రాచారం మాత్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో కవితక్క కారణంగానే వచ్చిందన్నది వాస్తవం. అంతకుముందు బతుకమ్మ పండుగను జనాలు జరుపుకోలేదని కాదు. ప్రత్యేకంగా బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించటం, బతుకమ్మకు అంతర్జాతీయస్ధాయిలో జరుపుకోవటం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలైంది. బతుకమ్మ పండుగకు కవిత బ్రాండ్ అంబాసిడర్ లాగ వ్యవహరించేవారు.



 ఈ పండుగ నిర్వహణకు ప్రత్యేకంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల కూడా చేసేది. దసరా పండుగ మొదలయ్యే రెండురోజుల ముందు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించేది. కేసీఆర్ కూతురు కదా పండుగలో పాల్గొనేందుకు కవిత అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా పర్యటించారు. ప్రధానంగా ఈ పండుగ ప్రకృతిసిద్ధమైన పూలకు సంబంధించిన పండుగ. అందుకనే మహిళలు పెద్దఎత్తున పూలను కొనుగోలు చేసి కలశాలకు రకరకాల, రంగురంగుల పూలను అందంగా అలంకరించి బతుకమ్మ పాటలు పాడుకుంటారు. ఏ పండుగ ఉద్దేశ్యమైనా పదిమందిని ఒకచోట చేర్చటమే కదా. అదే పద్దతిలో బతుకమ్మ పండుగను కూడా పదిమంది ఒకటిగా చేరి ఘనంగా జరుపుకుంటారు. 



ఇలాంటి పండుగలో ఇపుడు కవితక్క ఎక్కడా కనబడటంలేదన్నది పెద్ద లోటుగా కనబడుతోంది. ఈ పండుగలో కవిత బహిరంగంగా ఎక్కడా పాల్గొనలేదన్నది వాస్తవం. శనివారం బతుకమ్మ పండుగను కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణా భవన్లో కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. గాంధీభవన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు. మరి తెలంగాణా భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కదా ఇక్కడ కూడా కవిత ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో అర్ధంకావటంలేదు. తెలంగాణా భవన్లో బతుకమ్మను ఎంఎల్సీ వాణీదేవి, పద్మాదేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత తదితరులు ఘనంగా జరిపించారు. పార్టీలోని మహిళా నేతలు ఇంతమంది పాల్గొన్నా కవిత మాత్రం ఎక్కడా కనబడలేదు.



 లిక్కర్ స్కామ్ లో అరెస్టయి దాదాపు ఐదునెలలు ఢిల్లీలోని తీహార్ జైలులో గడిపి బెయిల్ పై కవిత బయటకు వచ్చారు. నాలుగురోజుల క్రితమే హెల్త్ చెకప్ కూడా చేయించుకున్నారు. జైలులో ఉన్నపుడు బీపీ ఉందని, గైనిక్ సమస్యలున్నాయనే కారణాలతో ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అలాంటిది బెయిల్ దొరికి చివరకు బయటకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న కవిత పార్టీలోని మిగిలిన మహిళా నేతలతో కలిసి బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకోవటంలేదో అర్ధంకావటంలేదు. ఇపుడు కవిత హైదరాబాద్ లోనే ఉన్నారు. అధికారంలో ఉన్నపుడు కవిత హవా ఏ స్ధాయిలో నడిచిందంటే రోజుకో ఊరికి వెళ్ళి కవిత బతుకమ్మ ఆడేవారు. ఆమె ఆడుతోందంటే మొత్తం మీడియా అటెన్షన్ అంతా గంటలకొద్ది ఆమె మీదే ఉండేది. అందుకనే బతుకమ్మ పండుగ పదేళ్ళు అంతలా పాపులరైంది. ఇంతగా బతుకమ్మ పండుగతో పెనవేసుకుపోయిన బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల కవిత ఈసారి ఇప్పటివరకు ఎక్కడా కనబడకపోవటం పెద్ద లోటనే చెప్పాలి.

Tags:    

Similar News