రేసులో ఈ ముగ్గురే ఉన్నారా ?

నరేంద్రమోడి క్యాబినెట్లోకి తెలంగాణా నుండి ఎవరుండబోతున్నారో తేలిపోయింది. కాబట్టి ఇపుడు అందరి చూపు తెలంగాణా అధ్యక్షపదవి మీద పడింది.

Update: 2024-06-09 09:34 GMT

నరేంద్రమోడి క్యాబినెట్లోకి తెలంగాణా నుండి ఎవరుండబోతున్నారో తేలిపోయింది. కాబట్టి ఇపుడు అందరి చూపు తెలంగాణా అధ్యక్షపదవి మీద పడింది. ఇపుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొంతముందుగా అధ్యక్షుడిగా ఉన్న బండిసంజయ్ ను జాతీయ నాయకత్వం తప్పించి కిషన్ కు పగ్గాలు అప్పగించింది. ఆదివారం రాత్రి నరేంద్రమోడితో పాటు కొలువుదీరనున్న మంత్రుల్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు. కాబట్టి మంత్రివర్గంలో ఉండబోయే వాళ్ళపై క్లారిటి వచ్చేసింది. కిషన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేకపోతే జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డాను తప్పించి కిషన్ కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం బాగా జరిగింది.

జాతీయ అధ్యక్షపదవి కిషన్ కు ఇవ్వబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో తెలంగాణా నుండి మంత్రివర్గంలో ఎవరుంటారు ? అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే కిషన్ విషయంలో క్లారిటి వచ్చేయటంతో ఇక మిగిలింది తెలంగాణా అధ్యక్షపదవి మాత్రమే. ఇక్కడే కొందరు ఎంపీలు అధ్యక్షపదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం కోసం ముగ్గురు ఎంపీలు రేసులో ఉన్నారు. వారు ఎవరంటే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.

డీకే అరుణ ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే మహిళలకు ఇచ్చినట్లు కూడా ఉంటుందనే చర్చ జరుగుతోంది. అరుణ కూడా బాగా చొచ్చుకుపోగలరు, చాలామంది నేతలతో మంచి సబంధాలే ఉన్నాయి. కాబట్టి పార్టీ పగ్గాలు అప్పగిస్తే న్యాయం చేయగలరని నేతల మధ్య చర్చ జరుగుతోంది. అలాగే ధర్మపురి అర్వింద్ రెండోసారి ఎంపీ అయ్యారు. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. మంచి వాగ్దాటి ఉన్నది. అలాగే ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజికవర్గానికే చెందిన నేత. ఈయనకు కూడా వాగ్ధాటి ఉండటమే కాకుండా బీసీల్లో మంచి క్రేజున్న నేత. పైగా అధిష్టానంతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎనిమిదిమంది ఎంపీల్లో ఇద్దరు కేంద్రమంత్రివర్గంలోకి వెళ్ళిపోయారు.

డీకే, ధర్మపురి, ఈటలను మినహాయిస్తే మిగిలింది రఘునందనరావు, గోడంరమేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే. సామాజికవర్గాలతో పాటు వివిధ సమీకరణలను గమనిస్తే రఘు, కొండా, గోడంకు పగ్గాలు అప్పగించే అవకాశాలు తక్కువనే మాట వినిపిస్తోంది. అందుకనే అధ్యక్ష బాధ్యతలు డీకే, ధర్మపురి, ఈటల మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కిషన్నే కంటిన్యుచేస్తారనే చర్చ జరుగుతున్నా దానికి అవకాశం తక్కువ. ఎందుకంటే ఇపుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కిషన్ కేంద్రమంత్రి హోదాలో తన శాఖపై పూర్తి దృష్టిపెట్టాల్సుంటుంది. అందుకనే పైన చెప్పినట్లుగా ముగ్గురు ఎంపీల్లో ఒకళ్ళకి పగ్గాలు దక్కే ఛాన్సుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News