ఆపరేషన్ మిడ్ నైట్...అసలు కారణమిదేనా ?

ఒకేసారి ఆరుగురు ఎంఎల్సీలు పార్టీ మారారన్న విషయం కారుపార్టీలో సంచలనంగా మారింది.

Update: 2024-07-05 08:30 GMT

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ మిడ్ నైట్ కు తెరలేపారు. గురువారం అర్ధరాత్రి అంటే సుమారు 1 గంట ప్రాంతంలో బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరారు. 24 గంటల్లో ఉదయం, పగలు, సాయంత్రం ఉండగా అర్ధరాత్రి మాత్రమే బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులకు రేవంత్ కాంగ్రెస్ లో చేర్చుకుని కండువా ఎందుకు కప్పుతున్నట్లు ?

రెండు రోజులు ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన రేవంత్ గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్ హైదరాబాద్ లోని తనింటికి చేరుకోవటమే ఆలస్యం ఆరుగురు కారుపార్టీ ఎంఎల్సీలు దండె విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గపాడు దయానంద్, ఎగ్గేమల్లేష్, బస్వరాజు సారయ్య రేవంత్ ఇంటికి వెళ్ళారు. పార్టీ తెలంగాణా ఇన్చార్జి దీపా దాస్ మున్షీతో పాటు కొందరు సీనియర్ నేతల సమక్షంలో ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఇపుడు చేరిన వాళ్ళల్లో బస్వారాజు సారయ్య బీఆర్ఎస్ ను వదిలేయబోతున్నట్లు ముందుగానే సంకేతాలున్నాయి. మిగిలిన ఐదుగురి విషయంలో ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు, పార్టీ మారబోతున్నారని బీఆర్ఎస్ లో అనుమానం కూడా లేదు. అలాంటిది ఒకేసారి ఆరుగురు ఎంఎల్సీలు పార్టీ మారారన్న విషయం కారుపార్టీలో సంచలనంగా మారింది.

ఈమధ్యనే జగిత్యాల బీఆర్ఎస్ ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన కూడా అర్ధరాత్రే రేవంత్ ఇంట్లో హస్తంపార్టీ కండువా కప్పుకున్నారు. అసలు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను రేవంత్ అర్ధరాత్రిళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పార్టీ ఎంఎల్ఏ, ఎంఎల్సీల్లో ఏ రోజు ఎవరు కాంగ్రెస్ లో చేరుతారో అర్ధంకాక కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ కారణంగానే వరుసగా ప్రజా ప్రతినిదులను ఫాం హౌస్ కు పిలిపించుకుని విందు రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారద్దని బతిమలాడుకుంటున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. అయితే కేసీయార్ సమావేశాలు పెడుతునే ఉన్నారు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతునే ఉన్నారు.

పాం హౌస్ లో సమావేశాలు జరుగుతుండగానే చేవెళ్ళ, జగిత్యాల ఎంఎల్ఏలు కాలే యాదయ్య, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఒకేసారి ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇంతమంది పార్టీని వదిలేస్తారని బహుశా కేసీయార్ ఊహించుండరు. సాయంత్రం నుండి దగ్గరలోనే ఉన్న హోటల్లో వెయిట్ చేస్తున్న ఆరుగురు ఎంఎల్సీలు ఢిల్లీ నుండి రేవంత్ హైదరాబాద్ చేరుకోగానే వెంటనే వెళ్ళి పార్టీలో చేరిపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఒక హోటల్లో తాము సమావేశం అయిన విషయాన్ని కేసీయార్ కు తెలీకుండా ఆరుగరు ఎంఎల్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధమవుతోంది. విషయం ఏమాత్రం బయటకు పొక్కినా క్యాడర్ ఊరుకునే వారు కాదన్న విషయం మొన్నటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన గొడవతోనే అర్ధమైంది.

బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను అర్ధరాత్రి చేర్చుకోవటంలో రేవంత్ వ్యూహమున్నట్లు సమాచారం. అదేమిటంటే కేసీయార్ కు నిద్రను దూరంచేయటమేనట. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరిన తర్వాతే విషయాన్ని పార్టీ మీడియాకు లీకులు ఇస్తున్నది. దాంతో పార్టీలో చేరికలు బీఆర్ఎస్ లో సంచలనంగా మారుతున్నది. కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు మరికొందరు కీలక వ్యక్తులు వెంటనే కేసీయార్ తో టచ్ లోకి వెళుతున్నారట. పార్టీ మారుతున్న ప్రజా ప్రతినిధులు రేవంత్ ఇంటికి చేరుకోగానే విషయం బీఆర్ఎస్ నేతలకు తెలిసే అవకాశం కూడా ఉంది. విషయం ఎలా తెలిసినా కేసీయార్ లో టెన్షన్ పెంచేయటమే రేవంత్ టార్గెట్ అని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే అచ్చంగా ఇదే పద్దతిని కేసీయార్ అధికారంలో ఉన్నపుడు అమలుచేశారు కాబట్టే. కాకపోతే అప్పట్లో కేసీయార్ అర్ధరాత్రుళ్ళు చేర్చుకోలేదు ఆ పనిని ఇపుడు రేవంత్ చేస్తున్నారంతే.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటిపూట బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరితే వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగా గొడవలవుతున్నాయి. బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ లో చేరారు. ఉదయం పోచారం ఇంటికి రేవంత్ వెళ్ళారు. వెంటనే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. దాంతో బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ బాల్క సుమన్ నాయకత్వంలో క్యాడర్ అక్కడికి చేరుకుని నానా గోలచేశారు. ఇలాంటి ఘటనలను కూడా నివారించేందుకే రేవంత్ అర్ధరాత్రి చేరికలకు ముహూర్తం పెట్టుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే పద్దతిలో ఇంకెంతమంది చేరబోతున్నారో చూడాల్సిందే.

Tags:    

Similar News