యూనివర్సిటీలకు ఇన్చార్జిలను ఎందుకు వేయాల్సొచ్చింది ?
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అసలు ఇన్చార్జి వీసీలను నియమించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ? ఈ విషయమై మేథావుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణాలోని పదియూనివర్సిటీలకు రాష్ట్రప్రభుత్వం ఇన్చార్జీలను నియమించటంపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఈనెల 21వ తేదీన పది యూనిర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగిసింది. కొత్త వీసీల నియామకాలకు ఇంకా సమయం పడుతుంది కాబట్టి స్టాప్ గ్యాప్ గా ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా నియమించింది. రెగ్యుల్ వీసీ నియామకంలో ఆలస్యం అవుతున్నపుడు తాత్కాలికంగా యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమించటం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అసలు ఇన్చార్జి వీసీలను నియమించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ? ఈ విషయమై మేథావుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం అందరు ఏకీభవిస్తున్నారు. అదేమిటంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇన్చార్జి వీసీల నియామకాలు తప్పటంలేదని.
ఒక యూనివర్సిటీకి వీసీ పదవీకాలం కొన్ని నెలల్లో ముగుస్తోంది అనగానే వెంటనే సెర్చి కమిటీని నియమించి, అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్ల పేర్ల పేర్లను తెప్పించుకుని ఆ ప్రొఫెసర్ల నేపధ్యంపై సమాచారం తెప్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ తర్వాత ఆ పేర్లను గవర్నర్ కు పంపి ఎంపికచేసిన వారిని వీసీగా ప్రభుత్వం నియమిస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగాల్సిన ప్రొసీజర్. అయితే ఏ ప్రభుత్వంలో కూడా నూరుశాతం ఈ ప్రొసీజర్ ఫాలో అవటంలేదు. ఇపుడు పది యూనివర్సిటీలకు ఒకేసారి వీసీల పదవీకాలం ముగియటమే నిదర్శనం. ఒకేసారి పదిమంది వీసీల పదవీకీలం ముగిసే అవకాశమే లేదు. అయినా వీళ్ళపదవీకాలం ఎలా ముగిసింది ? ఎలాగంటే ఇక్కడే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుందంటే యూనివర్సీటికి వీసీ పదవీకాలం ముగుస్తోందని తెలిసినా కొత్త వీసీని నియమించే విషయంలో జాప్యం జరగటంవల్లే. బీఆర్ఎస్ హయాంలో 2019 జూలై నుండి 2021 మే నెల మధ్యలో పది యూనివర్సిటీలకు వీసీలనే ప్రభుత్వం నియమించలేదు. 2019 జూలైలో వీసీల పదవీకాలం ముగుస్తోందని తెలిసినా కొత్తవారిని నియమించే విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ? దీన్నే ప్రభుత్వ వైఫల్యమంటారు. యూనివర్సీటీలకు వీసీలు లేకపోవటంపై మేథావులు, యూనివర్సిటీలు, రాజకీయపార్టీల నుండి ప్రభుత్వంపై బాగా ఒత్తిళ్ళు పెరిగిపోవటంతో తప్పనిస్ధితిలో 2021 మేలో అన్నీ యూనివర్సిటీలకు ప్రభుత్వం ఒకేసారి వీసీలను నియమించింది. అందుకనే ఇపుడు మే 21వ తేదీన పదిమంది వీసీల పదవీకాలం ముగిసింది. కొత్త వీసీలను నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సెర్చి కమీటీలను నియమించినా ఆ కమిటీలు ఒక్కసారి కూడా భేటీకాలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో భేటీలే జరగలేదు.
వీసీల నియామకం అవసరాన్ని వివరిస్తు ప్రభుత్వం ఎన్నికల కమీషన్ కు లేఖ రాస్తే సెర్చి కమిటీల భేటీకి అనుమతి లభించింది. దాంతో వీలైనంత తొందరలో సెర్చి కమిటీలు భేటీ అయి మూడుపేర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే జూన్ 15వ తేదీకి అన్నీ యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. వీసీ పదవీకాలం ముగియటానికి ముందే సెర్చికమిటీని నియమంచి అర్హత కలిగిన ప్రొఫెసర్ ను వీసీగా ఎంపిక చేస్తే ఇన్చార్జి వీసీల నియామకం అవసరమే ఉండదు. అయితే గడచిన ప్రభుత్వం ఈ పనిచేయకపోవటంతోనే ఇప్పటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి పదిమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా వేయాల్సొచ్చింది.
ఇదే విషయమై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన నాగిరెడ్డి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘వ్యవస్ధల ఫెయిల్యూర్ వల్లే ఇలాంటి పరిస్ధితులు ఏర్పడతాయ’న్నారు. సర్పంచ్ నుండి పార్లమెంటు సభ్యుడి వరకు ఏ ప్రజాప్రతినిధి పోస్టయినా ఖాళీ అవ్వగానే ఎన్నికల కమీషన్ వెంటనే ఆ స్ధానం భర్తీకి నోటిపికేషన్ ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదే పద్దతిలో ప్రభుత్వం వీసీల నియామకాన్ని ఎందుకు చేయటంలేదని ప్రశ్నించారు. ‘ఎంఎల్ఏ, ఎంపీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరపాల్సిన అవసరం వచ్చినపుడు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక జరుపుతున్నట్లే వీసీల నియామకాన్ని వెంటనే జరపకపోవటంలోనే వ్యవస్ధ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంద’న్నారు. ‘నియామకం సమయంలోనే వీసీ పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందో తెలిసినపుడు సెర్చి కమిటీని నియమించటంలోను, అర్హులైన వారిని ప్రభుత్వం ఎంపికచేస్తే ఇన్చార్జి వ్యవస్ధ అవసరమే ఉండద’ని అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతు కేసీయార్ ప్రభుత్వం ఏళ్ళ తరబడి వీసీల నియమాకాన్ని చేయకపోవటం వల్లే ఇపుడీ పరిస్ధితి తలెత్తిందన్నారు. కేసీయార్ హయాంలో దాదాపు రెండేళ్ళపాటు యూనివర్సిటీలకు అసలు వీసీలే లేరన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇన్చార్జీలుగా ఉండే ఐఏఎస్ అధికారులకు యూనివర్సిటీల అభివృద్ధిపై పెద్దగా శ్రద్ధ ఉండదని అభిప్రాయపడ్డారు. వీసీల పదవీకాలం ఒకేసారి ముగుస్తోందని తెలియగానే కాంగ్రెస్ ప్రభుత్వం సెర్చికమిటీలను నియమించుంటే ఇపుడు ఇన్చార్జిలను నియమించాల్సిన అవసరం ఉండేదికాదన్నారు. కొన్ని యూనివర్సిటీలకు పాలకమండళ్ళని కూడా గడచిన ప్రభుత్వం నియమించలేదని కూరపాటి గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించటంతో పాటు యూనివర్సిటీల అభివృద్ధికి పాటుపడే వారితో పాలకమండళ్ళని కూడా నియమించాలన్నారు.
హెచ్సీయూ రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతు యూనివర్సిటీలకు సంవత్సరాలుగా రెగ్యులర్ గా వీసీలను నియమించటంలేదన్నారు. అలాగే చాలా యూనివర్సిటీల్లో సరైన ఫ్యాకల్టీ కూడా లేదని చెప్పారు. ప్రొఫెసర్లను ప్రభుత్వం అసమర్ధులుగా భావిస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీల్లో రాజకీయనేతలతో పాటు ప్రభుత్వం జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని వాపోయారు. బ్యూరోక్రాట్లను ఇన్చార్జి వీసీలుగా నియమించటం అంటే యూనివర్సిటీలను బలహీనపరచటమే అని అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ పార్ధసారధి మాట్లాడుతు ఇన్చార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమించటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. సీనియర్ ప్రొఫెసర్ ను ఇన్చార్జిగా నియమించాలంటే చాలా సమస్యలు తలెత్తుతాయన్నారు. కేసీయార్ హయాంలో రెండున్నర సంవత్సరాలపాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలు లేకపోవటమే ప్రస్తుత స్ధితికి కారణమని పార్ధసారధి అభిప్రాయపడ్డారు.