కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు ?
తెలంగాణ ఆర్ధికపరిస్ధితిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్ధంకావటంలేదు;
తెలంగాణ ఆర్ధికపరిస్ధితిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్ధంకావటంలేదు. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని రేవంత్ ఉన్నది ఉన్నట్లు ప్రజలకు, ఉద్యోగులకు వివరిస్తుండటాన్ని కేటీఆర్(KTR) అభ్యంతరం పెడుతున్నారు. తెలంగాణ అప్పుల(Telangana debts) కుప్పలాగ అయిపోయిందని సీఎం ప్రకటిస్తే పెట్టుబడిదారులు ఎవరైనా పెట్టుబడులు పెడతారా ? ఎవరైనా అప్పులిస్తారా అని కేటీఆర్ నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలాగున్నాయంటే తాముచేసినట్లే రేవంత్ కూడా ఆర్ధికపరిస్ధితిని మూసిపెట్టి మాయచేయాలని అనుకుంటున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజావ్యాఖ్యలతో రేవంత్(Revanth) తననుతాను స్వతంత్ర్యభారతదేశంలో అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నాడని కేటీఆర్ చెప్పటమే విడ్డూరంగా ఉంది.
రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి బావోలేదని, అప్పులుపుట్టడంలేదని, ఉద్యోగులు సమ్మెచేయద్దని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను సమ్మెచేయద్దని చెప్పే నేపధ్యంలోనే రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి గురించి వివరించారు. ఇందులో రేవంత్ చేసిన తప్పేమిటి ? అసమర్ధతను బయటపెట్టుకోవటం ఎలాగవుతుందో కేటీఆరే చెప్పాలి. ఉద్యోగుల త్యాగాలగురించి రేవంత్ కు ఇసుమంత కూడా తెలీదని కేటీఆర్ ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది. ఉద్యోగుల ఆందోళనల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని నమ్ముతున్న కేటీఆర్ మరిదే ఉద్యోగుల సంఘాల నేతలను కేసీఆర్ పదేళ్ళు ఎందుకు దూరంగా ఉంచేశారో చెప్పగలరా ? రాష్ట్రం అప్పుల్లో ఉందని రేవంత్ చెప్పటమే తప్పన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు.
పదేళ్ళపాలనలో కేసీఆర్(KCR) రు. 8.29 లక్షల కోట్లు అప్పుచేసినట్లు రేవంత్ బయటపెట్టడాన్ని కేటీఆర్ తట్టుకోలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది. కేసీఆర్ అప్పుల నిర్వాకంవల్ల తెలంగాణ ఇపుడు ఎన్ని తిప్పలుపడుతున్నదో చెప్పటాన్ని కేటీఆర్ సహించలేకపోతున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయినపుడు మిగులురాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ అధికారంలో నుండి దిగిపోయేనాటికి రు. 8.29 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందన్న రేవంత్ ప్రశ్నకు మాత్రం కేటీఆర్ సరైన సమాధానం చెప్పటంలేదు. ఎంతసేపూ తాము సంపద సృష్టించామని, ఆస్తులు కూడబెట్టామని చెబుతున్నారే కాని సృష్టించిన సంపద ఏమిటి ? కూడబెట్టిన ఆస్తుల గురించి మాత్రం వివరించటంలేదు. సంపద సృష్టించటానికి, ఆస్తులు కూడబెట్టడానికే తాము అప్పులు చేసినట్లు కేటీఆర్ సమర్ధించుకోవటమే విచిత్రంగా ఉంది.
రేవంత్ తప్పు కూడా ఉందా ?
రాష్ట్రం అప్పులకుప్పలాగ తయారై దివాలా అంచున ఉండటంలో రేవంత్ తప్పుకూడా ఉంది. 2023 ఎన్నికల సమయానికే తెలంగాణ లక్షల కోట్లరూపాయల అప్పుల్లో ఉందన్న విషయం రేవంత్ తో పాటు చాలామంది మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. తెలంగాణ ఆర్ధికపరిస్ధితి బాగా తెలిసినప్పటికీ ఉచితహామీలను ఎలాగిచ్చారు ? రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లు, ప్రతిమహిళకు తులంబంగారం, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు ఉచితంగా స్కూటీల పంపిణీ, మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ లాంటి ఎన్నోహామీలను ఇచ్చినపుడు రేవంత్ కు రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి గురించి తెలీదా ? తెలంగాణను కేసీఆర్ లక్షల కోట్లరూపాయల అప్పుల్లో ముంచేశారని పదేపదే ఆరోపిస్తున్న రేవంత్ గడచిన 15 మాసాల్లో తను చేస్తున్నది కూడా అదేకదా ? పదేళ్ళ పరిపాలనలో కేసీఆర్ చేసిన లక్షల కోట్ల రూపాయల అప్పులకు రేవంత్ మరిన్ని అప్పులు జమచేస్తున్నారే కాని అప్పులను తగ్గించే మార్గాలను మాత్రం వెతకటంలేదు.
అధికారంలోకి రావటానికి ఆచరణసాధ్యంకాని హామీలను ఇవ్వటం, అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కటం లేకపోతే హామీలను అరాకొరా అమలుచేస్తు బీదమాటలు మాట్లాడటం పాలకులకు మామూలైపోయింది. విచిత్రం ఏమిటంటే రేవంత్ మాటలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా తప్పుపట్టడం. అప్పులపై రేవంత్ తాజా ప్రకటనతో తెలంగాణ పరువుపోయిందని బండి మండిపడ్డారు. అప్పులగురించి ఓపెన్ గా రేవంత్ చెప్పటంలో ఏమిటి తప్పో మాత్రం బండి చెప్పలేకపోయారు. ఒకవైపు నరేంద్రమోదీ పాలనలో దేశం లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలవుతున్న విషయాన్ని మరచిపోయిన బండి అదే అప్పులవిషయంలో రేవంత్ ను తప్పుపట్టడమే విడ్డూరంగా ఉంది.