కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు, 10 కారణాలు

తెలంగాణ ఉద్యమ రథసారధి, రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తరచూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు?

Update: 2024-02-13 08:50 GMT
kcr (file Photo)

తెలంగాణ ఉద్యమ రథసారధి, తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తరచూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడీ అంశమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా ఉంది. నలుగురి నోళ్లలో నానుతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారానికి దూరమైంది. ఆ తర్వాత కేసీఆర్ నగర సమీపంలోని ఎర్రవెల్లిలోని తన ఫార్మ్ హౌస్ లో బాత్రూమ్ కి వెళుతూ జారిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ఆస్పత్రిలో తుంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.

హైదరాబాద్ నందీనగర్ లోని తన ఇంట్లో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఫార్మ్ హౌస్ చేరుకున్నారు. పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ ఏకంగా నల్గొండ లో పెట్టిన సభకు హాజరవుతున్నారు. అయినా ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదు.

కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదు?

కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటికి రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలి సమావేశానికి గానీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగానికీ దూరంగానే ఉన్నారు. మధ్యలో ఒకరోజు వచ్చి స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లారు తప్ప అసెంబ్లీ వైపు రాలేదు. ఎందుకు?, కారణాలు ఏమై ఉంటాయి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏమిటో ఓసారి చూద్దాం.

నెంబర్ వన్...

“తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణప్రాయం. కృష్ణా నదీ జలాలలపై ఐదారు జిల్లాలు ఆధారపడి బతుకుతున్నాయి. చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఫార్మ్ హౌస్ లో ఎందుకు దాక్కున్నాడు. ఇలా చేయడమంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు ఆ పెద్దమనిషి సభకు రావాల్నా, లేదా. సభకు రాకుండా ఫార్మ్ హౌస్లో దాక్కుని తప్పించుకోవాలంటే ఎలా” అని ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలపైన. అటువంటిది కృష్ణా నది జలాలపై నిర్మించిన ప్రాజెక్టులపై ఆధారపడి ఐదారు జిల్లాలు జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ప్రాజెక్టులపై చర్చ సాగుతున్నప్పుడు కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని సరైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు తామంతే ఒకతాటిపై ఉన్నామనే సంకేతం ఇస్తే బాగుండేది. కానీ కేసీఆర్ ఆపని చేయలేదు. ఇదో తప్పిదంగానే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

నెంబర్ 2..

“ ఆయన (కేసీఆర్) హెల్త్ కండిషన్ ఏమిటో తెలియదు. అనివార్యంగా కొన్ని కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుంది. అవేమిటనేది మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఓటమి తర్వాత బహుశా కేసీఆర్ తన పార్టీ మీద దృష్టి పెట్టి ఉంటారు. అందువల్ల పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లకు, పార్టీ పెట్టే బహిరంగ సభలకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. అసెంబ్లీకి సెకండరీ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. ఓడిపోయినందున ఓరకమైన తిరస్కార భావం కూడా ఆయనలో ఉండి ఉండవచ్చు. ప్రజలు, ప్రజాసంక్షేమం ముఖ్యమని భావిస్తే సభకు వెళతారు. అయితే సంతోషించాల్సిన అంశమేమిటంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా మంగమ్మశపధాలు చేయలేదు. మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే శాసనసభలో అడుగుపెడతాను అని అనకపోవడం సంతోషం” అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు ఆంజనేయులు. నిజమే, కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరయ్యారే తప్ప ఓడిపోయాను గనుక సభలో అడుగుపెట్టనని భీష్మ ప్రతిజ్ఞలేవీ చేయలేదు.

నెంబర్ 3..

‘తెలంగాణ తెచ్చింది, చావునోట్లో తలపెట్టింది నేనే‘ అనే భావన కేసీఆర్ మాటల్లో ప్రతిసారీ ధ్వనిస్తుంది. వివాదాలు, వాదోపవాదాలు ఎలా ఉన్నా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో అగ్రతాంబూలం మాత్రం కేసీఆర్ దే. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం కూడా. అందుకే ఆయన పార్టీని గెలిపించారు. పదేళ్లు ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఓటమి బహుశా ఇంకా ఆయనకు మింగుడు పడకపోయి ఉండవచ్చు.

నెంబర్ 4...

ప్రాంతీయ పార్టీలు.. ఎక్కువగా వ్యక్తుల ప్రాతిపదికగా లేదంటే కుటుంబాల నాయకత్వంలోనే నడుస్తుంటాయి. దానికి మిగతా వాళ్లు కట్టుబడి ఉండాలని రూల్ లేకపోయినా అంతసూత్రం మాత్రం అలాగే ఉంటుంది. ‘నేను అనే అహం, నా పార్టీ అనే ధీమా‘ ఉంటుంది గనుక ఆయన ఏమి చేసినా మిగతావాళ్లు నోరు మెదపరు. అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే ఏ వైపు నుంచి సమాధానం రాదు. నిన్న మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్ రావు చెప్పింది కూడా అలాగే ఉంది. సభకు ఎందుకు రాలేదో చెప్పలేదు గాని ‘కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ ని అనేంత మాత్రపు వాళ్లా‘ అని ఎదురుదాడిచేసి నోళ్లు మూయించారు.

నెంబర్ 5...

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన మాటల యుద్ధం మరో కారణం. కేసీఆర్ ను ‘లంగా, దొంగ, లఫంగి‘ అని పీసీపీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి దూషిస్తే ‘ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చిల్లర మల్లర దొంగ, వాడో బచ్చా‘ అని కేసీఆర్ సీఎం హోదాలో రేవంత్ ను తిడతారు. ఇప్పుడు అదే వ్యక్తి సీఎం కావడం, తాను కూర్చున్న కుర్చీలో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కేసీఆర్ చూడలేకపోవొచ్చు.

నెంబర్ 6...

‘నేను తెలంగాణను బతికించాను, నేను చెప్పినట్టే తెలంగాణ వినాలని కేసీఆర్ లాంటి వాళ్లు కోరుకోవడం కూడా ఓ కారణమై ఉండవచ్చు. చర్చల సభకు కాకుండా రచ్చల సభకు కేసీఆర్ వెళ్లాలనుకుంటున్నారేమో‘ అంటారు సీనియర్ జర్నలిస్టు నందిరాజు రాధాకృష్ణ. కేసీఆర్ ను బాగా దగ్గర్నుంచి పరిశీలించి చూసిన వారికి మాత్రమే ఆయన పోకడ అర్థమవుతుందన్నది రాధాకృష్ణ అభిప్రాయం. పార్టీకి కాపాడే శక్తియుక్తులు, కేసీఆర్ చెప్పాలనుకున్న మాటల్ని చక్కగా చెప్పగలిగే వ్యక్తి హరీశ్ రావు. అందుకే ఆయనకు వకాల్తా ఇచ్చి ఉంటారని కూడా నందిరాజు అభిప్రాయం.

ఇవిగాక మరింకేమైనా ఉండవచ్చా?

సమయానుకూలంగా వ్యవహరించడంలో కేసీఆర్ ను మించిన వారు ఉండరు. తనదైన వాగ్ధాటితో ఎంతటి వాళ్లనైనా తన దారిలోకి తెచ్చుకోగల చాతుర్యం ఆయనకు ఉంది. అటువంటి వ్యక్తి ఇవాళ సభలో తనిష్టం వచ్చినప్పుడు కాకుండా ఎవరో మైకు ఇస్తే మాట్లాడాల్సి వస్తుందేమో అనే భావన కూడా ఉండి ఉండవచ్చు.

-చర్చల కన్నా వ్యూహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కేసీఆర్.

-అనువుగాని చోట అధికులమని చెప్పుకోవడం మంచిది కాదన్న విజ్ఞత కేసీఆర్ కి ఉంది

-మేధావులకి ప్రత్యేకించి 60,70వేల పుస్తకాలు చదివామనే విజ్ఞులకి కాసంత మేధోపరమైన అహం ఉంటుంది.

-ఆ లెక్కన చూసినప్పుడు రేవంత్ రెడ్డి తనతో తూగడన్న భావన ఉండవచ్చు

- రేవంత్ లాంటి వాళ్లు ఉన్న సభలో అడుగు పెట్టి ఆయనతోనే ‘కూర్చో‘, ‘నిల్చో‘ అని అనిపించుకోవడం ఇష్టం లేక సభకు దూరంగా ఉండవచ్చు.

-పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి గనుక ఆ కసరత్తు మొదలుపెట్టి ఉండవచ్చు

-అసెంబ్లీకి పోకపోయినా సభ నడుస్తుంది కనుక వెళ్లకపోయి ఉండవచ్చు.

-పదేళ్లు కష్టపడి ఓ షేప్ తెచ్చిన తెలంగాణను కాంగ్రెస్ కు అప్పగించారే ఈ ప్రజలు అని కేసీఆర్ భావించి ఉండవచ్చు.

-మా కేసీఆరే బాగా పాలించారు, కాంగ్రెస్ వాళ్లు నాశనం చేశారనే భావన కలిగేదాక అసెంబ్లీకి దూరంగా ఉంటారేమో చూడాలన్నది ఉద్దేశం అయిఉండవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ‘ఈ రెడ్ల కన్నా మా దొరే గొప్పోడు‘ అని ప్రజలు అనుకునే దాక ఈ దోబూచులాట సాగవచ్చునని పేరు రాయడానికి ఇష్టపడని ఓ రాజకీయ వ్యాఖ్యత చెప్పిన మాట నిజమేనేమో చూడాలి.

Tags:    

Similar News