14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 'క్రాస్' చేస్తారా? కాంగ్రెస్ గేమ్ షురూ!

ఒక్కొక్క రాజ్యస‌భ సీటు గెల‌వ‌డానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌ర‌మ‌వుతారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాబాలలెంత, ఎవరి లెక్కలేమిటో చూడండి..

Update: 2024-01-30 12:32 GMT
పార్లమెంటు భవనం ఫైల్ ఫోటో

“ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చేంత సీన్ కాంగ్రెస్ కు ఉందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పక్క పార్టీల వాళ్లను కొనుగోలు చేయడానికో, నోట్ ఫర్ ఓట్ అనడానికో ఇష్టపడతారా? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. గుర్రం ఎగరావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వచ్చే నెలలో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ సీట్లకు షెడ్యూల్ ప్రకటించీ ప్రకటించక మునుపే కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా మైండ్ గేమ్ కు తెరలేపింది. తెలంగాణ‌కు సంబంధించి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు కైవశం చేసుకునేలా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అందులో భాగమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా అభివృద్ధి పనులు, నిధులు, నీళ్లు అంటూ ఒక్కొక్కరు వచ్చి రేవంత్ ను కలిసిపోతున్నారు. ఇప్పటికి ఆ సంఖ్య ఏడు దాకా వచ్చింది. అసెంబ్లీలో ఉన్న బ‌లాబ‌లాలను బట్టి కాంగ్రెస్ రెండు, బి.ఆర్‌.ఎస్ ఒక‌ రాజ్యసభ సీటును సునాయాసంగా గెలుచుకుంటాయి. కానీ కాంగ్రెస్ మూడు సీట్లు కైవ‌సం చేసుకునేలా వ్యూహానికి పదును పెట్టినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ లక్ష్యం మూడో సీటేనా?

తెలంగాణ‌లో ఖాళీ అవుతున్న మూడు సీట్లను అధికార కాంగ్రెస్ కైవ‌సం చేసుకోవాల‌ని క‌స‌ర‌త్తు మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వస్తున్న రాజ్యసభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచన చేస్తోంది. మూడుకు మూడు కైవసం చేసుకుంటే.. పొలిటికల్‌గా ప్రతిపక్ష బి.ఆర్.ఎస్. పై అప్పర్ హ్యాండ్ సాధించవచ్చు. అందుకు రాజ్యస‌భ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఆస‌రా చేసుకొని హ‌స్తగ‌తం చేసుకోవాల‌ని చూస్తోంది.

రాజ్యసభ లెక్కలు ఇలా ఉంటాయి...

రాజ్యస‌భ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల మేర‌కు ఖాళీ అవుతున్న మూడు సీట్లకు ప్లస్ వ‌న్ క‌లుపుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం నాలుగు సీట్లుగా లెక్క వేసుకొని అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను డివైడ్ చేస్తారు. అంటే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలు 119 మంది. వీళ్లను డివైడెడ్ బై 4 మాదిరిగా లెక్కబెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కొక్క రాజ్యస‌భ సీటు గెల‌వ‌డానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌ర‌మ‌వుతారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బ‌లాల మేర‌కు కాంగ్రెస్ సులువుగా రెండు, ప్రతిప‌క్ష బి.ఆర్‌.ఎస్. ఒక‌టి గెలుపొంద‌వ‌చ్చు.

కాంగ్రెస్ 2 గెలవగా ఇంకో 5 అదనం...

రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో బ‌లాల మేర‌కు కాంగ్రెస్ సులువుగా రెండు గెలుచుకోగా.. మిత్రప‌క్షంతో క‌లుపుకొని 5 సీట్లు అద‌నంగా ఉంటాయి. రాజ్యసభ ఎన్నిక‌లకు బీజేపీ క‌నుక దూరంగా ఉంటే అప్పుడు అసెంబ్లీలో బ‌లం 111 స్థానాల‌కు తగ్గుతుంది. అసెంబ్లీలో బలం లేని పక్షంలో బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నికల్లో సంఖ్యా బలం మారిపోతుంది. అప్పుడు రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు.

ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతిస్తే...

ఎంఐఎం ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా... మరో పదకొండు మంది ఎమ్మెల్యేలు అవసరం పడతారు. అప్పుడు బి.ఆర్.ఎస్. నుంచి క్రాస్ ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. ఇక రాజ్య సభ ఎన్నికల్లో ఎమ్‌.ఐ.ఎమ్. కూడా దూరంగా ఉంటే సంఖ్యా బలం 104కు ప‌డిపోతుంది. ఇప్పుడు 104 స్థానాల‌ను నాలుగు భాగాలుగా విభ‌జించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఒక్క రాజ్యస‌భ సీటు బ‌లం 26కు ప‌డిపోతుంది. ఇక రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో విప్ జారీ చేసే అవ‌కాశం ఉండ‌దు. ఎమ్మెల్యేలు త‌మ‌కు న‌చ్చిన వ్యక్తికి ఓటు వేయ‌వ‌చ్చు. ఇదే అదునుగా తీసుకొని ప్రతిప‌క్ష బి.ఆర్‌.ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొవాల‌ని భావిస్తోంది. బి.ఆర్‌.ఎస్ నుంచి 13 మందిని త‌మ‌కు అనుకూలంగా ఓటు వేస్తే సెకండ్ ప్రయారిటీ ఓటుతో మూడో సీటును సుల‌భంగా గ‌ట్టెక్కవ‌చ్చని ప్లాన్ వేస్తోంది. ఒక వేళ 14 మంది బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే కాంగ్రెస్ సులభంగా మూడవ సీటును కైవసం చేసుకోవచ్చు. మొత్తం మీద రాజ్యస‌భ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఆస‌రా చేసుకొని కాంగ్రెస్ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తోంది. మూడు సీట్లను కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్ ఆలోచ‌న‌లు ఏ మేర‌కు వ‌ర్క్ అవుట్ అవుతాయ‌నేది చూడాలి.

Tags:    

Similar News