రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి కల నెరవేరేనా!

దసరాకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక మంత్రి పదవి అందించాలని నిశ్చయించిన కాంగ్రెస్ అధిష్టానం..

Update: 2024-10-05 10:06 GMT

దసరాకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక మంత్రి పదవి అందించాలని నిశ్చయించిన కాంగ్రెస్ అధిష్టానం.. కొన్ని రోజులుగా ఈ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఇంకా తెలియకపోయినా.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలన్న స్వరం గట్టిగానే వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ టాపిక్ వచ్చిన ప్రతి సారీ.. రాజగోపాల్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చేసిన చర్చల్లో కూడా మంత్రివర్గ విస్తరణ కీలకంగా నిలిచిందని, అందులో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వరించనుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా కచ్ఛితంగా మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్న వారిలో ఆయన పేరు ప్రథమంగా, ప్రధానంగా వినిపిస్తుందని అనుచరులు చెప్పుకొస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఫైల్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారని, దానిని దసరాకు మందు ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కల నెరవేరుతుందా? ఆ కలకు ఉన్న అడ్డంకులు ఏంటి అనేకి మరో కీలక చర్చనీయాంశంగా మారింది.

విస్తరణపైనే అన్ని ఆశలు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు పార్టీ పెద్దలతో కూడా చర్చలు చేశారు. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు అందించింది. ఆ సమయంలోనే అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందని, అందులో తప్పకుండా స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ..రాజగోపాల్ రెడ్డికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం సైతం రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది. ఆ కారణంగానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆశలన్నీ కూడా మంత్రివర్గ విస్తరణపైనే ఉన్నాయని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ప్రకటన జరిగిన అనంతరం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖరారైనట్లేనని కూడా జోరుగా వినిపస్తున్న వాదన.

సోదరుడే అడ్డయ్యాడా..

ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉండటానికి తొలి అడ్డంకిగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డే ఉన్నారని వాదన నడుస్తోంది. ఇప్పటికే ఒకరికి మంత్రి పదవి ఇచ్చామని, ఇప్పుడు రాజగోపాల్‌కు కూడా మంత్రి పదవి అంటే సోదరులు ఇద్దరికీ మంత్రి పదవులు కట్టబెట్టారన్న పేరు వస్తుందేమో అని కాంగ్రెస్ యోచిస్తుందని, అందుకే మంత్రివర్గ విస్తరణను కూడా వాయిదా వేసుకుంటూ వస్తోందని, రాజగోపాల్‌ను కన్విన్స్ చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి లేకుండా విస్తరణ చేయాలన్న యోచన చేస్తోందని చర్చ నడుస్తోంది. కాగా మంత్రి పదవి స్థానంలో రాజగోపాల్‌కు మరేదైనా పదవి అందించేలా ఒప్పందం చేసుకునేలా ఒప్పించాలని ఇప్పటికే కొందరు నేతలకు కాంగ్రెస్ అధిష్టానం టాస్క్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం జరిగే పనేనా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం చవ్యక్తం చేస్తున్నారు.

పార్టీలు మారడం వల్లే పలచనా..

కాగా మరోవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మునుగోడు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌ను కాదని బీజేపీ కండువా కప్పుకున్నారు. 4 ఆగస్టు 2022న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే నెల 21న బీజేపీలో చేరారు. ఆ తర్వాత సరిగ్గా ఏడది కాగానే 2023 అక్టోబర్ నెలలో కాంగ్రెస్ గూటికి చేరారు. తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, బీజేపీలో సరైన ప్రాధాన్యత, గౌరవం దక్కినా ఆశయం నెరవేరలేదని, తన ఆశయం నెరవేరాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని గ్రహించి ఘర్ వాపసీ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు. కీలక సమయంలో ఆయన ఇలా పార్టీలు మారడంతో కాంగ్రెస్ పార్టీలో పలచనయ్యారని, అందుకే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రసె అధిష్టానం వెనకడుగు వేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పక్క పార్టీల నుంచి వచ్చిన కొందరికి కీలక స్థానం కల్పించి కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని, ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్‌కు మంత్రి పదవి కట్టబెడితే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతాయని కాంగ్రెస్ యోచించే.. మంత్రివర్గ విస్తరణ, రాజగోపాల్‌కు మంత్రి పదవిని హోల్డ్‌లో ఉంచాయని ప్రచారం జరుగుతోంది.

ఈ చర్చల నేపథ్యంలో తాను ఎంతగానో కలలు కంటున్న మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డిని వరిస్తుందా లేదా? ఆయనను మంత్రి స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం అసలు కాంగ్రెస్‌లో జరుగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News