‘నాన్నకు ప్రేమతో’... అవినీతిని ఒప్పుకున్న కవిత

కాళేశ్వరం పాపం అంతా హరీష్, సంతోష్ దే అని ఇపుడు చెబుతున్న కవిత ఇదే విషయాన్ని కమిషన్ విచారణకు హాజరై ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు;

Update: 2025-09-02 08:11 GMT
KCR and Kavitha

ఇపుడీ మాట తెలంగాణలో బాగా ట్రెండింగ్ అయిపోయింది. ఒకపుడు ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా వచ్చింది. అయితే అప్పట్లో సినిమా పేరు పెద్దగా ట్రెండ్ కాకపోయినా ఇప్పుడు మాత్రం ఆమాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కల్వకుంట్ల కవిత(Kavitha) మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ లో కీలకనేతలు తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావుపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం(Kaleshwaram Scam) అవినీతిమరక కేసీఆర్(KCR) కు అంటిందంటే అందుకు కారకులు హరీష్(Harish Rao), సంతోషే అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కేసీఆర్ తెలంగాణ(Telangana) అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే హరీష్, సంతోష్ డబ్బు సంపాదన మార్గాలను వెతుక్కున్నట్లు చెప్పారు. తన తండ్రి మీద సీబీఐ(CBI) కేసులు, విచారణ అంటేనే తనగుండె మండిపోతుందన్నారు. అందుకనే నాన్నకు ప్రేమతో అని కేసీఆర్ ను సమర్ధించుకున్నారు.

అయితే ఇక్కడే కవిత వాదనను కొందరు నెటిజన్లు కొట్టేస్తున్నారు. నెటిజన్లు కవితను కొన్నిప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు. అవేమిటంటే తండ్రి కేసీఆర్ మీద కవితకు నిజంగానే ఇంత ప్రేముంటే కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కవిత ఎందుకు హాజరుకాలేదన్నది కీలకమైనది. కాళేశ్వరం పాపం అంతా హరీష్, సంతోష్ దే అని ఇపుడు చెబుతున్న కవిత ఇదే విషయాన్ని కమిషన్ విచారణకు హాజరై ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. కాళేశ్వరం అవినీతిలో తనదగ్గర ఉన్న సమాచారాన్ని కవిత కమిషన్ కు ఇచ్చుంటే జస్టిస్ ఘోష్ రిపోర్టు మరింత పక్కాగా ఉండేదికదాని నెటిజన్లు నిలదీస్తున్నారు.

మరికొందరు నెటిజన్లయితే కేసీఆర్ మంచోడు, హరీష్, సంతోష్ మాత్రమే అవినీతిపరులా ? అని కవితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. హరీష్, సంతోష్ అవినీతికి కేసీఆర్ కు తెలీకుండానే జరిగిందా ? అని అడుగుతున్నారు. కేసీఆర్ ఆలోచనలకు విరుద్ధంగా నడుకుకునేంత సీన్ హరీష్, సంతోష్ కు ఉందా అనే సందేహాన్ని వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ కు తెలీకుండానే హరీష్, సంతోష్ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోచుకుంటుంటే మరి కొడుకు, మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఏమిచేస్తున్నారంటు గట్టిగా కవితకు కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ మీద సీబీఐ కేసు, విచారణ అంటే తన గుండె మండిపోతోందని, కేసీఆర్ పరువుపోతోందని బాధపడాల్సిన అవసరం కవితకు లేదని ఎద్దేవా చేస్తున్నారు.

ఎందుకంటే కేసీఆర్ పరువుకు భంగం వచ్చిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్నపుడే జరిగిందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. పార్టీలో సమస్యంతా లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్నపుడే మొదలైందని మరికొందరు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. కవిత స్పందన ఎలాగున్నా, నెటిజన్ల కౌంటర్లు ఎలాగున్నా నాన్నకు ప్రేమతో అన్న మాట మాత్రం ఇపుడు తెలంగాణలో బాగా ట్రెండింగులో ఉంది. ఇక్కడే మరో కోణం కూడా ఉంది. అదేమిటంటే కాళేశ్వరం మరక కేసీఆర్ కు అంటటంలో హరీష్, సంతోష్ దే కీలకపాత్రగా కవిత చెప్పారు. అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కవిత నిర్ధారించినట్లే. అవినీతిలో కేసీఆర్ కు కూడా పాత్ర ఉన్నట్లుగా కవిత అంగీకరించినట్లయ్యింది. మరీ విషయాన్ని కవిత ఎలాగ సమర్ధించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News