తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావం వల్ల పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తెలంగాణలోని 26 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ శాస్త్రవేత్తలు సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండు మూడు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. ఉపరితలంపై గంటలకు 40 కిలోమీటర్ల వేగం కంటే తక్కువగా గాలులు వీస్తాయని ఆమె తెలిపారు.
మరో మూడు గంటల్లో హైదరాబాద్ లో వర్షాలు
మరో మూడు గంటల్లో హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.సోమవారం హైదరాబాద్ నగరంలోని పటాన్‌చెరు, ఆర్‌సి పురం, నార్సింగి, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, శివరాంపల్లె, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బహదుర్‌గూడ పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. సోమవారం సాయంత్రం, రాత్రి తర్వాత హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆగస్టు 13వతేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్న తెలంగాణపై సగటు సముద్ర మట్టానికి 3.1, 5.8 కిలోమీటర్ల మధ్య ఎగువ వాయు తుపాను దక్షిణం వైపునకు పయనించే అవకాశముందని ఆమె తెలిపారు. సగటు సముద్ర మట్టానికి రుతుపవన ద్రోణి అమృత్‌సర్, చండీగఢ్, షాజహాన్‌పూర్, లక్నో, గోరఖ్‌పూర్, దర్భంగా, జల్పాయిగురి గుండా వెళుతుందని చెప్పారు. అక్కడి నుంచి తూర్పు ఈశాన్య దిశగా అరుణాచల్ ప్రదేశ్‌కు రుతుపవన ద్రోణి చేరుకుంటుందని నాగరత్న వివరించారు.
తెలంగాణలో ఆగస్టు 13న అతి భారీ వర్షాలు
ఆగస్టు 13వతేదీన బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఐఎండీ అధికారులు తెలంగాణలోని జిల్లాలకు ఆగస్టు 13 నుంచి 15వతేదీ వరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
పలు జిల్లాల్లో భారీవర్షాలు
ఆగస్టు 13వతేదీన ఉదయం 8.30 గంటల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వల్ల ఆగస్టు 13వతేదీన రోడ్లపై వరదనీరు నిలచి ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు
ఆగస్టు 14వతేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో 17 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పది జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆగస్టు 14, 15 తేదీల్లో కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అల్పపీడన ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.