మధురైకి బయల్దేరిన విజయ్..
పర్యటనపై క్లారిటీ ఇచ్చిన తమిళగ వెట్రి కజగం చీఫ్..;
తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam (TVK) అధ్యక్షుడు విజయ్ (Actor Vijay) గురువారం (మే 1) మధురై వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో తన పర్యటనపై వస్తున్న పుకార్లపై స్పష్టతనిచ్చారు. తాను సినిమా షూటింగ్ కోసమే మధురై వెళ్తున్నానని, కోయంబత్తూరు రోడ్ షోలాగా మధురైలో రోడ్ షో నిర్వహించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
"నా మధురై పర్యటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.‘‘జన నాయగన్’’ సినిమా షూటింగ్ కోసం మధురై నుంచి కొడైకెనాల్‌కు వెళ్లున్నా. ఇది నా రాజకీయ పర్యటన కానే కాదు. నేను మీ అందరినీ కోయంబత్తూరులో కలిసినట్లే.. త్వరలో మరోసారి కలుస్తా. అందుకు వేచిచూడండి” అని విజయ్ చెప్పారు.
విజయ్ 2025 ఏప్రిల్ 26న కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే.
‘జన నాయగన్’ చివరి చిత్రమా?
విజయ్ ‘‘జన నాయగన్’’ సినిమా షూటింగ్ కోసం మధురై చేరుకుని అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్తున్నారు. బహుశా ఇదే ఆయన ఆఖరు చిత్రం కావొచ్చు. ఈ చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీ అవుతారని సమాచారం.
అభిమానుల ప్రవర్తనతో విజయ్ ఆందోళన..
విమానాశ్రయానికి బయల్దేరిన విజయ్ కాన్వాయ్‌ని ఆయన అభిమానులు బైకుల మీద ఫాలో అయ్యారు. వారిలో చాలా మంది హెల్మెట్ ధరించలేదు. దీంతో విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. "నా అభిమానులంటే ఎంతో అభిమానం. వారి భద్రత నాకు ముఖ్యం. హెల్మెట్ ధరించి నిబంధనలు పాటిద్దాం.’’ అని పేర్కొన్నారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు కూడా చెప్పారు విజయ్.