వాటర్‌ వార్‌ విజేతలెవ్వరు? కేసీఆర్‌ మళ్లీ డుమ్మా!!

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా BRS ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది.. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి.

Update: 2024-02-12 16:15 GMT
REVANT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రాజెక్టులు KRMBకి అప్పగింత విషయంలో శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటు గులాబీ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు కౌంటర్‌ ఇచ్చారు. ఎట్టకేలకు ప్రాజెక్టులను KRMBకి అప్పగించకూడదన్న తీర్మానానికి ఆమోదం తెలపడంతో సభను వాయిదా వేశారు స్పీకర్‌.

ఏపీకి ధారాదత్తం చేశారా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హాట్‌హాట్‌గా సాగాయి. సభ ప్రారంభం కాగానే.. కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు-బీఆర్‌ఎస్‌ తప్పిదాలు పేరిట శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత KRMBకి ప్రాజెక్టులు అప్పగించకూడదన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణ ఎంతో నష్టపోయిందని.. కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. దానికి కౌంటర్‌ ఇచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. నీటి వినియోగం ఆధారంగానే కేటాయింపులు జరిగాయని ప్రకటించారు.

మాటల యుద్ధంలో పైచేయి ఎవరిది?

ఈ క్రమంలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్‌ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌ విమర్శలు గుప్పించారు. వాటికి మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. చర్చ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి హరీశ్‌రావు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టడంతో అందుకు ఓకే చెప్పారు స్పీకర్‌.

కేసీఆర్‌ మళ్లీ డుమ్మా!

అసెంబ్లీలో కీలక అంశంపై చర్చిస్తున్న సమయంలో కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదని.. ప్రతిపక్ష నేత పదవిని పద్మారావుగౌడ్‌కు అప్పగించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆయన.. తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. ఇక నల్గొండలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టడంతోనే KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పడంపై కాంగ్రెస్‌ వెనక్కి తగ్గిందన్నారు హరీశ్‌రావు. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకువచ్చిన తీర్మానానికి మద్దతు తెలుపుతామన్న ఆయన.. కొన్ని సవరణలు సూచించారు.

బీజేపీ రూటే సెపరేటు

అటు బీజేపీ మాత్రం ప్రాజెక్టులను KRMBకి అప్పగించడాన్ని స్వాగతించింది. అసలు దీనిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన అవసరమేముందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి.. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. మొత్తంగా ప్రాజెక్టులను KRMBకి అప్పగించేది లేదని ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Tags:    

Similar News