కేరళ వయనాడ్‌కు KSTDC టూర్ ప్యాకేజీపై బీజేపీ నేతల ఆగ్రహం..

సీఎం సిద్ధరామయ్య తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రియాంక నియోజకవర్గానికి బస్సులు తిప్పడాన్ని తప్పుబట్టిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్ అశోక..

Update: 2025-10-30 11:43 GMT
Click the Play button to listen to article

పొరుగు రాష్ట్రం కేరళ(Kerala)లోని వయనాడ్‌ను పర్యాటక కేంద్రంగా పేర్కొంటూ.. కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (KSTDC) టూర్ ప్యాకేజీని ప్రమోట్ చేయడంపై భారతీయ జనతా పార్టీ (BJP) ఆగ్రహం వ్యక్తం చేసింది. KSTDC ఈ టూర్ ప్యాకేజీ వివరాలను ఈ నెల అక్టోబర్ 28న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుపై బీజేపీ(BJP) నేత, కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక స్పందించారు. “వయనాడ్(Wayanad) కలెక్టర్‌లా వ్యవహరించే ముఖ్యమంత్రిని కర్ణాటక ప్రజలు ఎంతకాలం భరించాలి? అని ప్రశ్నించారు.

"కర్ణాటక టాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన డబ్బు నుంచి రూ. 10 కోట్లను వయనాడ్‌ వరద బాధితులకు ఇచ్చేశారు. ఏనుగు దాడిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 15 లక్షలు ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన తర్వాత వయనాడ్‌లో 100 ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ నియోజకవర్గం వయనాడ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి KSTDCను వాడేస్తున్నారు’’ అని అశోక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘పరిహారం వెంటనే చెల్లించాలి..’

‘‘వరదలకు ఉత్తర కర్ణాటక బాగా దెబ్బతింది. 12.5 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్ళు కొట్టుకుపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలబురగి, రాయచూరు, యాద్గిర్, బీదర్, విజయపుర, బాగల్‌కోట్, బెలగావి వరద బాధితులకు వరద సహాయం అందలేదు. సొంత రాష్ట్రంలో రైతుల కంటే ఇతర రాష్ట్రాల బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి బిజీ అయ్యారు. ఇది దాతృత్వం కాదు. తన కుర్చీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ కీలుబొమ్మ కాదు, సొంత రాష్ట్ర రైతులను మరచిన ముఖ్యమంత్రి కర్ణాటకకు అవసరం లేదు.

కర్ణాటక రైతులకు అండగా నిలిచే ముఖ్యమంత్రి కావాలి. ఢిల్లీ కీలుబొమ్మ కాదు. కర్ణాటక వరద బాధిత రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించాలి.’’ అని డిమాండ్ చేశారు.


ప్రియాంక కోసమే..

బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సీటీ రవి కూడా కేఎస్‌టీడీసీ తప్పుబట్టారు. కర్ణాటకలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన కెఎస్‌టీడీసీ కన్నడిగులను వయనాడ్‌కు తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.

"వయనాడ్ కర్ణాటకలో ఉందా? లేక KSTDC కేరళ పర్యాటకంగా మారిందా? పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Tags:    

Similar News