‘మహారాష్ట్రలో మోసం చేసి గెలిచారు’
AICC సమావేశంలో బీజేపీపై నిప్పులు చెరిగిన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే..;
ఏఐసీసీ(AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి గెలిచిందని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరుగుతున్న AICC సమావేశాల్లో ఖర్గే కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు.
‘దొంగ ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు’
కాంగ్రెస్(Congress) పార్టీ ఈవీఎం(EVM) పనితీరుపై చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలని ఖర్గే డిమాండ్ చేశారు.
"ప్రపంచం మొత్తం EVMల నుంచి బ్యాలెట్ పేపర్‌కు మారుతోంది. కానీ మనం ఇంకా EVMలను ఉపయోగిస్తున్నాం. అధికార పార్టీకి ప్రయోజనం చేకూరేలా సాంకేతికత రూపొందింది. కానీ దేశ యువత ఏదో ఒక రోజు మాకు బ్యాలెట్ పేపర్ కావాలి అని అడుగుతారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో చూశాం. ఓటర్ల జాబితా తప్పులతడక. ఎన్నికలు మోసపూరితం. మేము ఈ అంశాన్ని ప్రతిచోటా లేవనెత్తాం. రాహుల్ గాంధీ దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. బీజేపీ 90 శాతం సీట్లు గెలుచుకుంది. ఇంతకు ముందు ఇలాంటి ఫలితాలు ఎప్పుడూ రాలేదు. హర్యానాలో కూడా ఇలాగే జరిగింది. దొంగ ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడతాడు. మా లాయర్లు, నాయకులు దాని కోసం పనిచేస్తున్నారు," అని అన్నారు.
‘సిగ్గుచేటు’
గత 11 ఏళ్లుగా అధికార పార్టీ (బీజేపీ) రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపిస్తూ.. ‘‘ప్రభుత్వం తమకు నచ్చినట్లుగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది.
స్పీకర్ ప్రతిపక్ష నాయకుడి పేరును ప్రస్తావించారు. కానీ మాట్లాడనివ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఇది సిగ్గుచేటు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకపోతే ప్రజల గొంతు ఎలా వినిపించగలం,’’ అని మండిపడ్డారు.
‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది’
వక్ఫ్ (సవరణ) బిల్లుపై (Wakf Bill) చర్చను ప్రస్తావిస్తూ.. ‘‘ప్రజా సమస్యలను చర్చించడం వదిలేసి.. మతతత్వ ఎజెండా కోసం ప్రభుత్వం అర్థరాత్రి వరకు చర్చ కొనసాగించింది. మణిపూర్ పై చర్చ కూడా ఉదయం 4 గంటలకు జరిగింది. ఆ మరుసటి రోజు కూడా చర్చ కొనసాగించాలని అభ్కర్థించా. కానీ అందుకు అంగీకరించలేదు. ప్రజాస్వామ్యం నెమ్మదిగా, నెమ్మదిగా ఖూనీ అవుతుంది, " అని ఖర్గే ఆరోపించారు.
‘మోదీ (PM Modi) దేశాన్ని అమ్మేసి వెళ్లిపోతారు’
‘‘అమెరికా సుంకాలు విధింపు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అనుమతి లేదని అంటున్నారు. గుత్తాధిపత్యం చాలయిస్తూ.. ప్రైవేటీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇలాగే కొనసాగితే, మోదీ మొత్తం దేశాన్ని అమ్మేసి వెళ్ళిపోతారు" అని ఖర్గే మోదీని టార్గెట్ చేశారు.
‘మోదీ నిప్పు రాజేస్తే.. ఆర్‌ఎస్‌ఎస్ ఆజ్యం పోస్తుంది’
‘‘మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి 500 ఏళ్ల నాటి అంశాలను బీజేపీ-ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతున్నారు. మసీదుల కింద 'శివలింగాల' కోసం వెతకవద్దని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చెప్పారు. కానీ వారు మళ్లీ అదే పని చేస్తున్నారు. మనం రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నాం. గతంలో మతతత్వం, పేదరికం, అసమానతల నుంచి ఆంగ్లేయులు ప్రయోజనం పొందారు. ఇప్పుడు సొంత ప్రభుత్వమే లబ్ది పొందాలని చూస్తోంది. అంతే తేడా," అని దుయ్యబట్టారు.
బీజేపీది దళిత వ్యతిరేక మనస్తత్వం..
రాజస్థాన్ అల్వార్‌లోని రామాలయంలో కాంగ్రెస్ నేత తికారం జుల్లీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. బీజేపీ నాయకుడు గంగా జలంతో ఆలయాన్ని శుద్ది చేయడం ‘‘పార్టీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని’’ బయటపెడుతుందన్నారు.
‘స్వలాభానికి వాడుకుంటున్నారు’
‘‘దేశవ్యాప్తంగా కుల గణన కోసం పట్టుబడుతున్నాం. కాని ప్రధాని మోదీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం OBC హోదాను వాడుకుని వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు.’’ అని ఖర్గే మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం, ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
‘విశ్రాంతి తీసుకోండి లేదంటే తప్పుకోండి’
పార్టీకోసం పాటుపడని వారు విశ్రాంతి తీసుకోవాలని, బాధ్యతలను నిర్వర్తించని వారు పదవీ విరమణ చేయాలని ఖర్గే కోరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇస్తామని చెప్పిన ఖర్గే..త్వరలో AICC మార్గదర్శకాల ప్రకారం వారి ఎంపిక ఉంటుందని చెప్పారు. డీసీసీ బ్లాక్ కమిటీలు, వాటి కింద ఇతర కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
సభ్యులకు నివాళి..
అంతకుముందు ఫిబ్రవరి 2023 రాయ్‌పూర్ సమావేశాల తర్వాత మరణించిన కాంగ్రెస్ సభ్యులకు నివాళి అర్పిస్తూ కాంగ్రెస్ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. గత ఏడాది డిసెంబర్‌లో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పార్టీ ఘనంగా నివాళులర్పించింది.