వక్ఫ్ సవరణ బిల్లు ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రం అవుతుందా?

ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు - వక్ఫ్ బిల్లు(Waqf Bill)ను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకోనున్న ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు;

Update: 2025-04-06 07:12 GMT
Click the Play button to listen to article

ఇటీవల పార్లమెంటు(Parliament) సమావేశాల్లో ప్రతిపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాయి. కాని ఫలితం దక్కలేదు. ఉభయ సభల్లో పాసయిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలి ఉంది. కాగా ఈ బిల్లు రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని..భారత కూటమి భాగస్వామ్య పార్టీలు తమ వాదనను బలంగానే వినిపించాయి. బీహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహ్మద్ జావేద్, AIMIM అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీకోర్టులో పిటీషన్లు కూడా దాఖలు చేశారు.

భారత కూటమికి కలిసొస్తుందా?

దాదాపు 18 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. భారత కూటమి (INDIA bloc) భాగస్వామ్య పార్టీలయిన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ బిల్లును ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ(BJP) భాగస్వాములైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీ(యూ), ఎల్జెపి(ఆర్వీ), కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీల హెచ్ఏఎం, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా వంటి వారికి ముస్లిం సామాజిక వర్గాల నుంచి ప్రతికూలత ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. జేడీ(యూ) బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముస్లిం నాయకులు న‌దీమ్ అఖ్త‌ర్‌, రాజు నయ్యర్, తబ్రేజ్ సిద్ధిఖీ అలీగ్, మహ్మద్ షానవాజ్ మాలిక్, మహ్మద్ కాసిమ్ అన్సారీ పార్టీని వీడారు. ఇక రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన సీమాంచల్ ప్రాంతంలోని ముస్లింలు రాబోయే ఎన్నికలలో తమకు అండగా నిలుస్తారని INDIA పార్టీలు భావిస్తున్నాయి.

ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి..

"ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అనడంలో సందేహం లేదు. మోదీ, బీజేపీ నాయకులు ఈ అంశాన్ని ఎలా వాడుకుంటారో మనందరికీ తెలుసు. అయితే మనం ఎలా స్పందిస్తామన్నది గమనించాల్సిన అంశం.’’ అని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు .

బీజేపీకి ప్లస్ అవుతుందా?

బీహార్ రాష్ట్రంలోని హిందూ ఆధిపత్య ప్రాంతాల్లో పట్టును బలోపేతం చేసుకోవడానికి బీజేపీకి ఈ బిల్లు దోహదపడుతుందని చెప్పాలి. అదే సమయంలో సీమాంచల్, మిథిలాంచల్‌లోని కొన్ని ప్రాంతాలలో బిల్లు వల్ల NDAకి జరిగే నష్టాన్ని తగ్గించడంపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రయోజనాలను వివరిస్తే సరిపోతుంది..

"ఈ బిల్లుకు వివరణ చాలా సులభం. వక్ఫ్ మాఫియా, హిందువుల భూమిని ఆక్రమించకుండా నిరోధిస్తుంది. పస్మాండ (వెనుకబడిన) ముస్లింలు, ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సీమాంచల్‌తో సహా బీహార్‌లోని మెజారిటీ ముస్లింలు పస్మాండ సమాజ్‌కు చెందినవారు. ఈ చట్టం వారి ప్రయోజనం కోసం ఎలా పనిచేస్తుందో బీజేపీ, జేడీ(యూ) వారికి వివరిస్తాయి" అని బీజేపీ బీహార్ శాసన మండలి సభ్యుడు ది ఫెడరల్‌తో అన్నారు .

బీహార్ ఎన్నికలే కీలకం..

2026 ప్రథమార్థంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాలలో జరిగే ఎన్నికల పోరాటాలకు బీహార్ ఎన్నికల ఫలితాలు మార్గదర్శిగా నిలుస్తాయి. ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్ర, హర్యానాలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

రాహుల్, ప్రియాంక తీరుపై అసహనం..

కీలక బిల్లుపై చర్చ, ఓటింగ్ జరిగినప్పుడు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభకు హాజరు కాలేదు. ఒక ముఖ్యమైన వ్యక్తిగత పనిమీద ఆమె విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ విప్ (కేరళ ఎంపీ కె సురేష్)కు తెలిపారు. ఇక రాహుల్ విషయానికొస్తే.. బిల్లుపై 12 గంటల పాటు జరిగిన చర్చకు లోక్‌సభా ప్రతిపక్ష నేత చాలా తక్కువ సమయం హాజరయ్యారు. పైగా తన వ్యతిరేకతను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. "ముస్లింలను అణగదొక్కడం, వారి ఆస్థులను ఆక్రమించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు" అని బీజేపీని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై రాహుల్, ప్రియాంక చూపిన "నిర్లక్ష్య వైఖరి" మంచిదికాదని కాంగ్రెస్(Congress) సీనియర్ ముస్లిం ఎంపీ ది ఫెడరల్‌తో అన్నారు.

తల్లిని చూసి నేర్చుకోవాలి..

"రాహుల్ ఒక ప్రతిపక్ష నేత. ట్విట్టర్‌లో రాసుకొచ్చే దానికంటే లోక్ సభలో చెప్పేదానికే ఎక్కువ విలువ ఉంటుందని ఆయన ఎప్పుడు గ్రహిస్తారు? తన తల్లి (సోనియా గాంధీ) నుంచి ఆయన చాలా నేర్చుకోవాలి. ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా.. రాజ్యసభలో ఉదయం 4 గంటల వరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 82 ఏళ్ల కాంగ్రెస్ అధ్యక్షుడు (మల్లికార్జున్ ఖర్గే) రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఓటింగ్ లో పాల్గొనడానికి ఉదయం 4 గంటల వరకు కూర్చున్నారు. ఆ తర్వాత మణిపూర్ రాష్ట్రపతి పాలన తీర్మానానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు" అని పార్టీ సీనియర్ ఎంపీ అన్నారు.

 మొత్తంమీద వక్ఫ్ సవరణ బిల్లును జనం స్వాగతిస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్నది బీహార్ ఎన్నికల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News