ఇలా అయితే మోదీని ఎదుర్కోలేము: ఇండియా కూటమి

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ఇండియా కూటమి సీట్ల పంపకం ఇంకా కొలిక్కిరాలేదు. మరోవైపు ప్రధాని ఎన్నికల ప్రచారానికి తమ పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.

Update: 2024-01-23 14:25 GMT

లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కూడా లేదు. రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో ప్రధాని మోదీ పరోక్షంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే వారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఎన్నికల వరాలు గుప్పించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ మరోవైపు ప్రతిపక్షం తమ కూటమి సంబంధించిన ముఖ్యమైన పనులను రూపొందించుకోవడంలో అలసత్వం వహిస్తోంది. ఉమ్మడి ప్రచారం పై అందరూ ఏకాభిప్రాయంతో ఉన్న అదీ సీట్ల సర్దుబాటు తరువాతనే దానిపై ఓ స్పష్టత రానుంది. మరో వైపు హిందూత్వం అంశాన్నిబీజేపీ బలంగా ముందుకు తెస్తూ మెరుగైన ఫలితాలను రాబడుతోంది.

రామమందిరం ప్రారంభంలో ప్రధాని ప్రతిపక్షాల పేరు చెప్పకుండా మేమే నిజమైన హిందూత్వ వాదులమని, రామాలయాన్ని నిర్మించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఐదు వందల ఏళ్ల బానిసత్వాన్ని అంతం చేశామని చెబుతూనే వచ్చే ఎన్నికల్లో తమ ప్రాధాన్య అంశాలు ఏంటో చెప్పకనే చెప్పారు. వచ్చే ఎలక్షన్ టోన్ సిద్దం చేసే ప్రయత్నం చేశారు. వీటిని ఎదుర్కొవాలంటే విపక్షాలకు ఐక్యత అవసరం.

కాంగ్రెస్ సహ దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు రామాలయ ప్రారంభోత్సవాన్ని ఆర్ఎస్ఎస్ - బీజేపీ కార్యక్రమంగా ఆరోపిస్తూ రామమందిర ఆలయ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. అయితే బీజేపీకీ ఈ క్రెడిట్ దక్కకుండా ఉండేందుకు, అదే హిందూత్వ బాటలో ప్రతిపక్షాలు నడిచాయి. తమను తాము సెక్యూలర్ వాదులుగా చెప్పుకునే మమతా బెనర్జీ సోమవారం కాళీఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అన్ని మత విశ్వాసాలను గౌరవించే పాదయాత్ర చేసారు.

రాహూల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలోని వైష్ణవ సన్యాసి సంఘ సంస్కర్త శ్రీమంత శంకర దేవ జన్మస్థలమైన బటద్రవ థాన్ లోకి ప్రవేశించేందుకు అనుమతి కావాలని కోరారు. అయితే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయిన తరువాత రావాలని నిర్వాహకులు చెప్పారు. దాంతో ఆయన నాగోన్ లో నిరసన చేపట్టారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సైతం శ్రీరాముడి శోభాయాత్రలు చేపట్టింది. సామూహిక కిచెన్ లను నిర్వహించింది.

ఇదీలా ఉండగా తరువాత తాము శ్రీరాముడి దర్శనం చేసుకుంటామని ప్రకటించారు. ఎప్పటి నుంచో మతతత్వ రాజకీయలను వ్యతిరేకిస్తున్న వామపక్షాలు మాత్రమే ఈ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నాయి. తమదైన శైలిలో మానవహరాలు నిర్మించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసింది.

హిందూత్వాన్ని ఆయుధంగా చేస్తున్నారు

"హిందూత్వ అనే అంశాన్ని బీజేపీ ఇప్పుడు ఆయుధంగా మార్చింది. మనం ఇప్పుడు ఈ భావాలతో వ్యతిరేకించవచ్చు. కానీ హిందూత్వం కచ్చితంగా అందరూ అంగీకరించాల్సిన అంశం. ప్రజలు ఇదే అంశాన్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. లౌకికత్వం అనేది ఎప్పుడో దారితప్పిందనే వారు(బీజేపీ) ప్రచారం చేసి విజయం సాధిస్తున్నారు. నిజానికి హిందుత్వం అనే రామమందిరం ప్రారంభంతో అంతంకాలేదు. ఇప్పుడే బలంగా ముందుకు వచ్చింది. ఈ అంశం ప్రధాని ప్రసంగంతో స్పష్టమైంది" అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఫెడరల్ తో అన్నారు.

హిందీ రాష్ట్రాలకు చెందిన మరో కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడారు. " ప్రజలకు ఆలయం మీద ఉన్న సెంటిమెంట్ ఓ సునామీ లాంటిది. కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఆలయాన్ని, పారంభోత్సవాన్ని విమర్శించడానికి ప్రయత్నించవద్దు, వాటిని వ్యతిరేకిస్తే ఓట్ల సునామీలో కొట్టుకుపోతాము" అన్నారు.

ప్రస్తుతం ఇండియా కూటమి ఎన్నికల ప్రచారానికి ఆర్థిక సమానత్వం, ఆర్థిక సమ్మేళనం, మతసామరస్యం, ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు వంటి అంశాలను ఎంచుకుంది. అయితే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో ఎన్నికల ప్రచారానికి తయారుచేసిన బ్లూప్రింట్ పై అడుగు ముందుకు పడట్లేదు.

" బీజేపీని ఎదుర్కోవాలంటే మనమంతా ఐక్యంగా పోరాడాలి. అలా అయితేనే మోదీని ఎదుర్కోగలం. కానీ కీలక అంశాలపై ముందుకు ఎటూ తేల్చుకోలేకపోతున్నాం" అని ఎన్సీపీలోకి శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ ఒకరు ఫెడరల్ తో అన్నారు. ఇండియా కూటమిలోని చాలామంది కులగణన చేయాలని డిమాండ్ చేశారు. అయితే మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఇది సరిగా పనిచేయలేదు. బీజేపీ వీటిలో క్లీన్ స్వీప్ చేసింది.

రామమందిరాన్ని ప్రారంభం చేయడంతో మోదీ- అభివృద్ది తో కూడిన రామరాజ్యం అనే అంశాన్ని ప్రచారం చేయబోతున్నారు. కానీ ప్రతిపక్షం ఇంకా సీట్ల సిగపట్లు లో బిజీగా ఉంది. 

Tags:    

Similar News