ట్రైనీ డాక్టర్‌ పోస్టుమార్టం రిపోర్టుపై సీనియర్ డాక్టర్ ఏమంటున్నారు?

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడింది ఒక్కడేనా? పోస్టుమార్టం రిపోర్టుపై సీనియర్ డాక్టర్ ఏమన్నారు? ఆయనకు వచ్చిన అనుమానాలేంటి?

Update: 2024-08-15 07:41 GMT

కోల్‌కతాలోని RG కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దుర్ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను బహిష్కరించారు. ఘటన తర్వాత బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విస్తూపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించిన ఒక సీనియర్ వైద్యుడు డాక్టర్ సుబర్ణ గోస్వామి పలు అనుమానాలను లేవనెత్తారు. రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన బాధితురాలిపై ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యాచారం చేసినట్లు ఉందన్నారు.

‘‘బాధితురాలి ఒంటిపై చాలాచోట్ల గాయాలున్నాయి. ముక్కు, చెంపలు, పెదాలు, కింది దవడ, పుర్రె ఎముకపై గాయాలున్నాయి. పుర్రె ముందు భాగంలో రక్తం గడ్డకట్టింది. కళ్లు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్రీడింగ్ జరిగింది. అత్యాచారానికి ముందు తీవ్ర పెనుగులాట జరిగినట్లుంది. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎక్కువ సార్లు అత్యాచారం జరిగినట్లుంది. ఆమెను గొంతు పిసికి ఉక్కిరిబిక్కిరి చేసి చంపిన ఆనవాలున్నాయి. అసలు ట్రైనీ డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టింది ఒక్కరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది.’’ అని చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే..

ఘటన జరిగిన రోజు.. సెమినార్ గదిలో వైద్యురాలు, ఆమె మరో నలుగురి సహచరులు కలిసి భోంచేశారు. తర్వాత వారంతా తమ గదులకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకుంటూ వైద్యురాలు సెమినార్ రూంలో ఉండిపోయింది. ఆమె నిద్రపోవడం గమనించిన నిందితుడు.. 4 గంటల ప్రాంతంలో సెమినార్ రూంలో ప్రవేశించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దారుణానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఎవరీ సంజయ్ రాయ్..

కోల్‌కతాలోని శంభునాథ్‌ పండిట్‌ వీధిలో ఉండే సంజయ్‌.. స్థానిక పోలీస్‌ విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వలంటీర్‌గా చేరాడు. కొందరికి మాత్రం హోంగార్డుగా పరిచయం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆర్జీ కర్‌ ఆసుపత్రి చెక్‌పోస్టు వద్ద బాధ్యతలు అప్పగించారు.

ట్రైనీ డాక్టర్ హత్యపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది. 

Tags:    

Similar News