ఏయే ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు రద్దయ్యాయంటే..

దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి విమానాలు రద్దు అయ్యాయి. భారత గగనతలంలో కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది.;

Update: 2025-05-07 10:23 GMT
దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి విమానాలు రద్దు అయ్యాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరుతో పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
‘‘గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్‌సర్‌, బికనేర్‌, చండీగఢ్‌, ధర్మశాల, గ్వాలియర్‌, జమ్మూ, జోధ్‌పుర్‌, కిషన్‌గఢ్‌, లేహ్‌, రాజ్‌కోట్‌, శ్రీనగర్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం’’ అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను చూసుకోవాలని తెలిపింది. ఆయా విమాన ప్రయాణికులు రీషెడ్యూల్‌ లేదా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్‌ చేసుకుంటే పూర్తి రీఫండ్‌ కూడా ఇస్తామని పేర్కొంది.
అటు ఎయిర్‌ఇండియా (AirIndia) కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్‌, జమ్మూ, లేహ్‌, జోధ్‌పుర్‌, అమృత్‌సర్‌, భుజ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు వన్‌టైమ్‌ రీషెడ్యూల్‌ ఛార్జీల మినహాయింపు కల్పించింది. లేదా పూర్తి రీఫండ్‌ ఇస్తామని తెలిపింది. స్పైస్‌జెట్‌, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌ విమనాలు కూడా రద్దయ్యాయి.
18 విమానాశ్రయాలు మూసివేత..
మరోవైపు, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్‌, లేహ్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Tags:    

Similar News