మహారాష్ట్ర రైతుల ఆందోళనకు కారణమేంటి?

ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) నాయకుడు బచ్చు కడు నేతృత్వంలోని 'మహా-ఎల్గార్ మోర్చా'కు మద్దతు పలికిన NCP (శరద్ పవార్ వర్గం), కిసాన్ సభ, రైతు నాయకుడు రాజు శెట్టి

Update: 2025-10-30 13:21 GMT
Click the Play button to listen to article

తమ సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర(Maharashtra)లో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) నాయకుడు, మాజీ మంత్రి బచ్చు కడు నేతృత్వంలో చేపట్టిన అన్నదాతల ఆందోళన గురువారం (అక్టోబర్ 30) తీవ్ర స్థాయికి చేరుకుంది. రైతుల 22 డిమాండ్లపై ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముంబైలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆయన కలవనున్నారు. సీఎం నుంచి సానుకూల ఫలితం వస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు కడు చెప్పారు.


సోమవారం ప్రారంభమైన ట్రాక్టర్ మార్చ్..

అమరావతి జిల్లాలోని చందూర్‌బజార్ నుంచి సోమవారం ప్రారంభమైన రైతుల ట్రాక్టర్ మార్చ్..వార్ధాలో ఆగిపోయి మంగళవారం సాయంత్రానికి నాగ్‌పూర్ చేరుకుంది. పూర్తి వ్యవసాయ రుణ మాఫీ, అకాల వర్ష నష్టానికి తక్షణ పరిహారం, పంటలకు కనీస మద్దతు ధర (MSP), వికలాంగులకు నెలకు రూ.6వేల భత్యం రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. కడు నేతృత్వంలో కొనసాగుతున్న 'మహా-ఎల్గార్ మోర్చా'కు NCP (శరద్ పవార్ వర్గం), కిసాన్ సభ, రైతు నాయకుడు రాజు శెట్టి మద్దతు పలికారు.


ప్రభుత్వం తరుపున చర్చలు..

నాగ్‌పూర్ నగరానికి సమీపంలో నాగ్‌పూర్-హైదరాబాద్ జాతీయ రహదారి 44ను నిరసనకారులు దిగ్బంధించారు. అయితే వాహనాల రాకపోకలపై ఇబ్బంది కలగడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. తరువాత రాష్ట్ర మంత్రులు పంకజ్ భోయార్, ఆశిష్ జైస్వాల్ కూడా ప్రభుత్వం తరపున నిరసనకారులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా బచ్చు కడు విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం రైతులు సోయాబీన్‌ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడగాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు లేకుంటే.. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకు రావాలి" అని విజ్ఞప్తి చేశారు బచ్చు.

మహారాష్ట్ర షెట్కారి సంఘటన్ మాజీ చీఫ్, ప్రముఖ వ్యవసాయ కార్యకర్త విజయ్ జవంధియా ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “రైతుల డిమాండ్లు న్యాయమైనవి. పాలక బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోలో వాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.’’ అని గుర్తు చేశారు.

‘‘సోయాబీన్‌కు ప్రభుత్వం క్వింటాంకు రూ.5,328గా ఎంఎస్‌పి ప్రకటించినా.. రైతులకు మాత్రం రూ.3,500 నుంచి రూ.4,000 మాత్రమే లభిస్తోంది. ఇది ఎంఎస్‌పి కంటే దాదాపు 30 శాతం తక్కువ. అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. దిగుబడి, నాణ్యత రెండింటిపై ప్రభావం చూపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు ప్యాకేజీని ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో నష్టపరిహారం రైతులకు సరిగ్గా అందలేదు’’ అని జవంధియా తెలిపారు.

లాతూర్ జిల్లా రేనాపూర్ తహసీల్‌లోని గర్సులి గ్రామానికి చెందిన సురేష్ చవాన్ అనే రైతు.. తన ఐదు ఎకరాలలో పండించిన సోయాబీన్ కుప్ప మొత్తాన్ని కోల్పోయానని చెప్పాడు. "ప్రభుత్వం సహాయం ప్రకటించింది. కానీ మాకు అది ఎప్పుడూ అందలేదు. దీపావళి పండుగ చీకటిలో గడిచింది. ఇప్పుడు మా పొలాలు కొట్టుకుపోయాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

సెప్టెంబరులో వరదలు ఖరీఫ్ పంటలను నాశనం చేశాయి. తర్వాత రైతులు రబీ పంటలు వేశారు. కానీ మళ్ళీ వర్షం కురవడంతో కొట్టుకుపోయాయి. సోయాబీన్ పంట కోసం ఎకరానికి రూ. 5,500 నుంచి రూ. 6,000 వరకు కూలీలకు చెల్లించామని కొంతమంది రైతులు చెప్పారు.

పర్భానీలో రైతుల ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. రుణమాఫీ, పరిహారం డిమాండ్ చేస్తూ రైతులు కలెక్టర్ కారుపై రాళ్లు రువ్వడంతో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.


‘రైతులను తప్పక ఆదుకుంటాం’..

రైతుల ఆందోళనల నేపథ్యలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్(CM Devendra Fadnavis) స్పందించారు."రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించడానికి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సహాయం చేయడమే ప్రస్తుతం మా ప్రాధాన్యత. వ్యవసాయ రుణమాఫీకి మేము వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నారు.

కాగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని ప్రతిపక్ష పార్టీలంటున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు రూ. 31వేల కోట్లకు పైగా సహాయ ప్యాకేజీని ప్రకటించినా.. ఇప్పటివరకు అందించిన వాస్తవ సహాయం రూ. 1,800 కోట్లు మాత్రమే అని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు విజయ్ వాడేట్టివార్ అని పేర్కొన్నారు. అంటే హెక్టారుకు కేవలం రూ. 10వేల మాత్రమే అని అన్నారు. ఇది ఏ మాత్రం సరిపోదన్నారు. 

Tags:    

Similar News