హస్తం గూటికి గులాబీ నేతల క్యూ, అసలు వ్యూహం ఇదీ

తెలంగాణలో అధికార మార్పు అనంతరం హస్తం గూటిలోకి గులాబీ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోటకు బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది.

Update: 2024-02-12 04:08 GMT
CM Revanth Reddy

అసెంబ్లీ ఎన్నికల పరాజయ పరాభవం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోవాలని చేస్తున్న భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలకు ఎదురు దెబ్బతగులుతూ ఉంది. పార్టీలోని చాలా మంది నాయకులకు బీఆర్ఎస్ నాయకత్వం మీద విశ్వాసం సడలిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అందుకే రోజుకొక నాయకుడు పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇది జోరుగా సాగుతూ ఉంది. గ్రేటర్ పరిధిలో గతంలో కాంగ్రెస్ దాదాపు ఖతమైంది. అందువల్ల హైదరాబాద్ పరిసరాల్లో అంటే అర్బన్ ఏరియాలో పార్టీ పునరుద్ధరణ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఆయన ఉద్ధేశం లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు, వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీని కేవసం చేసుకోవడం. దీని కోసం సాగుతున్న కృషి ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లో ఎం జరుగుతూ ఉందంటే...

మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు...ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం

 పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి.తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయ వ్యూహం విజయవంతమవుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై హస్తం నేతలు వల విసిరారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. తెలంగాణలో అధికారం మారాక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలన పోయి, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఛైర్మన్లుగా విజయం సాధించారు.

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

లోక్‌సభ ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మన్నె జీవన్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ అప్పట్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేశ్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటేశ్ నేత పార్టీ మారారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి,పార్టీలోకి ఆహ్వానం పలికారు.

కేటీఆర్‌కు ప్రధాన అనుచరుడి షాక్

గ్రేటర్‌ హైదరాబాద్‌‌కు చెందిన కేటీఆర్ ప్రధాన అనుచరుడైన మాజీ డిప్యూటీ మేయర్‌, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ షాక్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా స్పోక్స్‌ పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించిన లేఖలో వెల్లడించారు. 2022లో విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఆకర్షితుడైన ఫసియుద్దీన్‌ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు. 22 ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ.. అగ్రనాయకులు తనను పట్టించుకోవడం లేదని బాబా ఫసియుద్దీన్‌ ఆరోపించారు.

చేవెళ్ల ఎంపీ బరిలో పట్నం సునీత?

అధికారం మారాక పట్నం దంపతులు హస్తం గూటిలో చేరేందుకు సమాయత్తమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునీత పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి,అతని భార్య, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైన తరుణంలో అనూహ్యంగా ఆయనను అప్పటి సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సునీత గత కొద్ది నెలలుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై పలు రకాల అనుమానాలు తలెత్తాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించడానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి, సీఎం సలహాదారు అయిన రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కలిశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన ప్రకాశ్ గౌడ్ సీఎంను కలిశాక బీఆర్ఎస్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం తీసుకుంటారని వార్తలు వెలువడ్డాయి. ప్రకాశ్ గౌడ్ సీఎంను కలవడం వెనుక ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వ్యూహరచన చేశారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్ధేశం లేదని ప్రకాశ్ గౌడ్ చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భూసమస్యలు పరిష్కరించాలని, నిధులు మంజూరు చేయాలని తాను సీఎంను కోరినట్లు ఆయన చెప్పారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు.

కారు పార్టీకి గుడ్ బై చెప్పనున్న ‘బొంతు’

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ‘కారు’ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి బొంతు రామ్మోహన్ భంగపడ్డారు. నాటి నుంచి పార్టీతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మల్కాజ్‌గిరి, లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎంను బొంతు కోరారు. బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల 15వతేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.


జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యం

బొంతు రామ్మోహన్ తోపాటు ఆయన సతీమణి,చర్లపల్లి కార్పొరేటర్ అయిన బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని భావిస్తున్నారు. ఎంపీ కేశవరావు కుమార్తె ,సిట్టింగ్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా సీఎం రేవంత్ తో భేటి అయ్యారు.అనంతరం కాంగ్రెస్ తమ బ్లడ్ లో ఉందని విజయలక్ష్మి వ్యాఖ్యానించి సంచలనం రేపారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే వ్యూహంలో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర సీనియర్ నాయకుడు ఆదం సంతోష్ కుమార్ చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ సీనియర్ నేత,తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల లోపే ఈ 20 మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారని, కానీ బీఆర్ఎస్ పార్టీకి బీటలు పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతూ కుట్రలు చేస్తున్నారని, వారి ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకే తమ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్ బుజ్జగింపు సమావేశాలు...

పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అప్రమత్తమై తమ వారిని కాపాడుకునేందుకు బుజ్జగింపు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘‘బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లేవారు వెళతారు, అది వారి ఖర్మ’’ కేటీఆర్ కార్పొరేటర్లతో వ్యాఖ్యానించడంతో వలసలపై ఆయన చేతులేత్తేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద రోజుకొక బీఆర్ఎస్ నాయకుడు హస్తం గూటిలో చేరుతున్నారు...పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? బీఆర్ఎస్ పార్టీ కోటకు బీటలు వారుతాయా అనేది వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News